‘స్మార్ట్‌’ వాదనలు స్మార్ట్‌ కాదు! లైఫ్ పార్ట్‌నర్‌తో ‘ఫెక్స్‌టింగ్‌’ చేస్తున్నారా? | Experts warn that fexting is not so smart | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ వాదనలు అంత స్మార్ట్‌ కాదు! లైఫ్ పార్ట్‌నర్‌తో ‘ఫెక్స్‌టింగ్‌’ చేస్తున్నారా?

Published Thu, Feb 16 2023 3:34 AM | Last Updated on Thu, Feb 16 2023 7:56 AM

Experts warn that fexting is not so smart - Sakshi

భార్యాభర్తలు, జీవిత భాగస్వాముల మధ్య ఏదో అంశం మీద వాదోపవాదనలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాదన జరుగుతుండగా... ఆఫీసుకు వెళ్తూ తన పార్ట్‌నర్‌ నుంచి దూరంగా వెళ్తే గొడవ సద్దుమణగడం ఖాయం. కానీ మొబైల్‌ ఫోన్‌లో టెక్ట్స్‌ మెసేజీల రూపంలో అదే గొడవ అదే పనిగా కొనసాగితే...? ఇలా లైఫ్‌ పార్ట్‌నర్స్‌ మధ్య ఫైటింగ్‌ కాస్తా టెక్ట్స్‌ మెసేజీల రూపంలో కొనసాగడాన్ని‘ఫెక్స్‌టింగ్‌’ అనే ధోరణిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్స్‌ ఎన్నెన్నో కొత్త కొత్త రకాల ఫీచర్స్‌తో వస్తున్నాయి కాబట్టి వాటిని ‘స్మార్ట్‌’ఫోన్స్‌ అన్నారు. కానీ ‘ఫెక్స్‌టింగ్‌’ అంత స్మార్ట్‌ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

‘ఫెక్స్‌టింగ్‌’ అంటే కేవలం జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్‌ అనే కాదు... పేరెంట్స్, ఫ్రెండ్స్‌ మధ్య కూడా కావచ్చుకానీ... అత్యధికంగా ప్రభావం చూపేది భార్యాభర్తల మధ్యనే కావడంతో సాధారణంగా దాన్ని లైఫ్‌పార్ట్‌నర్స్‌కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 

అత్యంత ప్రఖ్యాతమైన ఓ సెలబ్రిటీ కేస్‌స్టడీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, అమెరికన్‌ ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ల దాంపత్యం వయసు 45 ఏళ్లు పైమాటే. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము వాదించుకునేందుకు టెక్ట్స్‌ మెసేజీలు వాడతామని చెప్పా రు.

అందుకు ఓ వినోదాత్మక కారణం కూడా తెలిపారు. తమ ఘర్షణ, వాదోపవాదాలు అమెరికన్‌ సీక్రెట్‌ ఏజెన్సీకి తెలియకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటామని సరదాగా వెల్లడించారామె. అంటే అందరి గుట్టుమట్లు పసిగట్టే అత్యంత సమర్థమైన ఏజెన్సీనే బురిడీ కొట్టించడానికి ఆమె ‘ఫెక్స్‌టింగ్‌’ ను ఎంచుకున్నారన్న మాట. 

రెండు రకాల వాదనలు 
ఫెక్స్‌టింగ్‌లో పార్ట్‌నర్స్‌ ఎదురెదురుగా ఉండరు కాబట్టి... ముఖ కవళికలూ. అందులోని ఆవేశాలూ, ఉద్వేగాలూ కనిపించవు. వాదన తాలూకు తీవ్రత అక్షరాల్లో అంతగా ప్రభావ పూర్వకంగా కనిపించదు కాబట్టి అంత హానికరం కాదనీ అనేవాళ్లూ ఉంటారు.

అంతేకాదు... ఆ వాదన కొనసాగడానికి ఇష్టపడని వారు...  టెక్ట్స్‌కు బదులుగా క్రమంగా ‘స్మైల్‌’ లేదా షేక్‌హ్యాండ్‌ ఎమోజీల్లాంటివి ఉపయోగిస్తూ పోతే, ఎదుటివారి నుంచి తగినంత ప్రతిస్పందన లేకపోవడంతో క్రమంగా వాదన సన్నగిల్లిపోతుందనీ, ఎదురుబొదురు ఉన్నప్పటంత హాని జరగకపోవచ్చనీ కొందరు చెబుతుంటారు. సరిగ్గా దీనికి పూర్తి భిన్నంగా వాదించేవారూ ఉంటారు. మాటలు తడబడవచ్చు. ఏదో మాట సరిగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ సరిగ్గా వ్యక్తీకరించగలిగేవాళ్లైతే రాతలోనే ప్రభావం ఎక్కువ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. 

పాతగాయాలూ రేగే ప్రమాదం 
దంపతుల మధ్య సంభాషణల రూపంలో ఎదురుబొదురుగా ఘర్షణలు జరుగుతున్నప్పుడు  ఏదైనా మాటతూలినా గాలికి పోయే మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ ‘రాత’ ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో చదువుకున్నప్పుడూ పాత మాటలూ, పాత వాదనల ప్రభావాలు కెలికినట్లుగా అయి, అవి ఆ తర్వాతెప్పుడో కూడా ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. 

అంతుఉండకపోవచ్చు... ఆ అంశమే ప్రమాదం తేవచ్చు... 
పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన చెలరేగింది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూనే వాదనల్లో మునిగిపోయారు. ఆఫీసుకు బయల్దేరే సమయానికి ఘర్షణ పెద్దదైంది. కానీ ఆఫీసు సమయానికి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోవడంతో ఆ ‘వాదోపవాదాలు’ అక్కడితో ముగుస్తాయి. కానీ ‘ఫెక్స్‌టింగ్‌’ అలా కాదు. ఆఫీసుకు వెళ్లే దారిలో బస్సులోనో, ఆటోలోనో లేదా మెట్రోరైల్‌ లోనో అలాగే కొనసాగవచ్చు.

అంతేకాదు... ఆఫీసుకు చేరి, సీట్లలో కూర్చున్నాక కూడా అదేపనిగా కొనసాగితే ప్రమాదమే. ఆ మాటకొస్తే కీలకమైన మీటింగుల్లోనూ ‘టెక్ట్స్‌ మెసేజు’లు కొనసాగుతూ... అసలు లక్ష్యానికి అడ్డంగా మారవచ్చు. టెక్ట్స్‌ వల్ల ఒనగూరే సౌలభ్యమల్లా వాదన మౌనంగా కొనసాగుతూ... అది మాటల ద్వారా బయటకు తెలియదంతే.

కానీ పని ప్రదేశంలో... చేయాల్సిన పని వదిలేసి అదేపనిగా వాదులాడుకుంటూ పోతే... ఆఫీసులో  పూర్తి చేయాల్సిన పనులు కొనసాగకపోగా / జరగకపోగా...  అదే ఇబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉందంటున్నారు కపుల్‌ కౌన్సెలింగ్‌ నిర్వాహకులు, మనస్తత్వ నిపుణులు. అంతేకాదు... అది పనితీరుతో పాటు, బంధాల విషయాల్లోనూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు. 

వస్తువులో కాదు...  అంతా మన విచక్షణలోనే ఉంది..
‘‘ఏదైనా ప్రయోజనం అన్నది ఆ వస్తువును మనం ఉపయోగించే తీరులో లేదా మన విచక్షణను బట్టే ఉంటుందిగానీ... ఉపకరణంలో ఏమీ ఉండదు. ఇంగ్లిష్‌లో చెప్పా లంటే ‘ఆబ్జెక్ట్‌’లో కాకుండా ‘ఆబ్జెక్టివ్‌’లోనే అంతా ఉంది’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు మనస్తత్వ నిపుణులు. 

ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదురుబొదురుగా ఉండి మాట్లాడుకోవడమే మంచిది. కొన్ని పదాలు, పంక్చువేషన్లు, ఎమోజీల వల్ల దురభిప్రాయాలు  వచ్చే అవకాశమూ ఉంది. మాటల్లో చెప్పుకునే విషయాలను రాతలో పెట్టినప్పుడు అది మరింతగా హాని చేసే ప్రమాదం ఉంది. ‘మీ అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు. కానీ మీ అభిప్రాయానికి విలువివ్వాల్సిందే’ అనే పరస్పర గౌరవ భావన, దృక్పథాల వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. 

– డాక్టర్‌ సుజాత రాజమణి,  మానసిక నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement