
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.
అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది.
దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది.
తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.
అంచనాలు నెరవేరకపోతే!?
‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.
‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.
‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది.
‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది
‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.
అసలైన సమస్య ఏమిటి?
‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.
‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.
నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.
భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.
ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.
ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం.
బంధాన్ని ఎలా కాపాడుకోవాలి?
‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.
ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!
‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.
అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.
అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.
పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి.
సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలి
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment