పరీక్షలంటే భయమా? | Intermediate Board Has Taken Steps To Make Available Psychologists | Sakshi
Sakshi News home page

పరీక్షలంటే భయమా?

Published Tue, Mar 3 2020 2:07 AM | Last Updated on Tue, Mar 3 2020 2:07 AM

Intermediate Board Has Taken Steps To Make Available Psychologists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షలంటే భయపడుతున్నారా? మీ భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు సైకాలజిస్టులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సైకాలజిస్ట్‌ (7337225803 నంబర్‌)కు ఫోన్‌ చేసి తమ ఆందోళనను పోగొట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో మొదట ఒక సైకాలజిస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తర్వాత మరో ఐదుగురిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వీరంతా ఇప్పటినుంచి పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన తర్వాత దాదాపు 2 నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు.

ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా చిత్రా రాచంద్రన్‌ మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు సమస్య కారణంగా ఆమె చెప్పిన అంశాలను కూడా చిత్రారాంచంద్రన్‌ వివరించారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. 

15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌.. 
విద్యార్థులు 8.45 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాలని పేర్కొన్నారు. 15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుందని, ప్రతి విద్యార్థి 9 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటల కల్లా పరీక్ష కేంద్రంలో ఉండేలా చూసుకోవాలని, 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ‘సెంటర్‌ లొకేటర్‌’యాప్‌ ఉపయోగించుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, వీలైనంత ముందుగా పరీక్షకు బయల్దేరాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమ స్యలు, హాల్‌టికెట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తితే విద్యార్థులు నివృత్తి చేసుకునేందుకు బోర్డు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, 040–24600110, 040–24732369 ఫోన్‌ నంబర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు.

మెయిల్‌ ద్వారా కూడా (helpdesk_ie@telangana.gov.in)  సంప్రదించొచ్చన్నారు. అయినా సమాధానం దొరక్కపోయినా, సంతృప్తి చెందకపోయినా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని, ఇందుకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టం వెబ్‌సైట్‌ను (bigrs.telangana.gov.in) అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రత్యేకంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి వెబ్‌సైట్‌ (tsbie.cgg.gov.in) నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షలకు హాజరు కావొచ్చని, చీఫ్‌ సూపరింటెండెంట్లు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. 

2,500 మంది స్టూడెంట్‌ కౌన్సెలర్లు.. 
పరీక్షల విషయంలో ఆందోళన చెందొద్దని, ప్రతి కాలేజీలో స్టూడెంట్‌ కౌన్సెలర్లు (మొత్తం 2,500 మంది) ఉన్నారని, వారి సహకారం తీసుకోవాలన్నారు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఓఎంఆర్‌ షీట్‌లోని విద్యార్థుల వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలని, పొరపాటేమైనా ఉంటే ఎగ్జామినర్‌ దృష్టికి, చీఫ్‌సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకువెళ్లవద్దని, పరీక్ష విధుల్లో ఉన్న అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్‌ ఫోన్లు తీసుకెళ్లొద్దన్నారు. బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సీజీజీ సహకారం తీసుకున్నామని చెప్పారు.

ప్రతి సెంటర్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ ఓపెన్‌ చేస్తారన్నారు. గతంలో జవాబు పత్రాల కరెక్షన్‌లో తప్పులు చేసిన వారికి జరిమానా విధించామని, ఈసారి వారికి డ్యూటీలు వేయలేదన్నారు. పరీక్షలకు హాజరయ్యే బాలికలను తనిఖీ చేసేందుకు మహిళా సిబ్బందిని నియమించామని, బురఖా ధరించే వారిని ప్రత్యేక గదిలో మహిళలే తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీజీజీ డైరెక్టర్‌ రాజేంద్ర నిమ్జే మాట్లాడుతూ.. ఈసారి పరీక్షల్లో ఓఎంఆర్, ఐసీఆర్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement