సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులపై ఇంటర్మీడియట్ విద్యా శాఖ దృష్టి సారించింది. అనేకమంది ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి నేర్చుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కోడింగ్ తదితర పది కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీటిని షార్ట్ టర్మ్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పలు వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. అవి కాకుండా 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్ టర్మ్ కోర్సులుగా వీటిని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కోడింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అగ్‌మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులను ప్రవేశ పెట్టనుంది.
జేఎన్‌టీయూ నేతృత్వంలో ఇండస్ట్రీ, సబ్జెక్టు నిపుణలతో వీటికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కోర్సుల కాల వ్యవధిని నిర్ణయించనుంది. ఈ కోర్సుల్లో 40 శాతం విద్య బోధన రూపంలో ఉండనుండగా, 60 శాతం ప్రాక్టికల్ రూపంలోనే విద్యను అందించనుంది. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పైగా ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఇచ్చే సర్టిఫికెట్‌కు విలువ ఎక్కువగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోర్సులుగా వాటిని ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి వచ్చే స్పందనను బట్టి పూర్తి స్థాయి వృత్తి విద్యా కోర్సులుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment