intermediate board
-
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి -
సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఫ్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే సైన్స్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం.. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది. వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు. వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు.. మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది. గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. -
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 28న థియరీ పరీక్షలు మొదలవుతాయని తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటికన్నా ముందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రెండో శనివారం, ఆదివారం కూడా రెండు సెషన్స్‌లో ప్రాక్టికల్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుందని బోర్డ్ తెలిపింది. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎన్విరాన్మెంట్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 1నుంచి 15వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1. ►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1. ►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1. ►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1. ►మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1. ►మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1. ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ►ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2 ►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2. ►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 ►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2. మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2. -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
జేఈఈ మెయిన్ సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్ సెక్షన్–ఏలో 20 టాపిక్స్, సెక్షన్–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్–1, బీఆర్క్ కోసం పేపర్–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్–2బీని నిర్వహిస్తారు. పేపర్–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా పరీక్షలు.. కాగా జేఈఈ మెయిన్ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్ బోర్డులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. -
జూలై 1 నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు. -
మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 3.76 లక్షల మంది విద్యార్థులు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. (చదవండి: సర్కారు వారి పాట) -
ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ వద్దు
సాక్షి, అమరావతి: ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించడానికి ఇంటర్మీడియెట్ బోర్డు ఈ నెల 3న జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పాత విధానంలోనే ఏ కాలేజి విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహించవచ్చని మౌఖికంగా స్పష్టంచేశారు. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రయోజనాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. పాత విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారని వివరించారు. పాత విధానాన్ని మార్చడానికి అధికారులు ఎలాంటి సహేతుక కారణాలు చూపలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. ఇంటర్ బోర్డు ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ అఫిలియేటెడ్ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. మొదట నాన్ జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్‌కు ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలిపారు. ప్రాక్టికల్స్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అకస్మాత్తుగా జంబ్లింగ్ విధానంలోకి మార్చారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది రఘువీర్, ఇంటర్ బోర్డు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోవిడ్ వ్యాప్తి కనిష్ట స్థాయికి చేరుకోవడంతో నాన్ జంబ్లింగ్ స్థానంలో జంబ్లింగ్ తీసుకొచ్చామన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని కాలేజీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకించడంలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నాన్ జంబ్లింగ్ విధానాన్ని మార్చి జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఎందుకు నిర్ణయించారో సహేతుక కారణాలను అధికారులు వెల్లడించలేదన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ, ఈ ఉత్తర్వుల వల్ల ఈ నెల 11న జరగాల్సిన ప్రాక్టికల్స్‌కు ఆటంకం కలుగుతుందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, జంబ్లింగ్ విధానాన్ని మాత్రమే నిలిపివేశామని, పాత పద్ధతిలో ప్రాక్టికల్స్ నిర్వహించుకోవచ్చునని చెప్పారు. -
Andhra Pradesh: ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియెట్ బోర్డు వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 12తో ముగుస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్–2022 మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 16–21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఇంటర్ పరీక్షల మధ్యలో జేఈఈ పరీక్షల షెడ్యూల్ ఉండడంతో విద్యార్థులకు నష్టం కలిగేలా పరిస్థితులు మారాయి. దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్‌పై చర్చించింది. చివరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీన్ని ఆమోదించిన అనంతరం గురువారం మంత్రి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆదివారాలు, సెలవు రోజులతో పాటు మధ్యలో రంజాన్ పర్వదినం ఉండడంతో మే 3, 4 తేదీల్లో పరీక్షలు లేకుండా కొత్త షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ ప్రకారం ఏప్రిల్ 22న ప్రారంభమై మే 12తో ఇంటర్ పరీక్షలను పూర్తిచేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. నైతిక విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షలు ఇంతకుముందు ప్రకటించిన విధంగానే మార్చి 7, 9 తేదీల్లోనే జరుగుతాయన్నారు. అలాగే, ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇక బెటర్మెంటు కోసం 2,500 మంది అభ్యర్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారని, అందుకే సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ పరీక్షలను కూడా ఇదే షెడ్యూల్‌తోపాటు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఈనెల 11 నుంచి 31 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నామని, ఇందుకు జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు వివరించారు. ఇంటర్ థియరీ పరీక్షలకు పది లక్షల మంది వరకు విద్యార్థులు హాజరుకానున్నారని.. ఇందుకోసం 1,456 కేంద్రాలను, ప్రాక్టికల్ పరీక్షల కోసం 975 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన పక్షంలో పరీక్షా కేంద్రాలను పెంచుతామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెన్త్ పరీక్షలు యథాతథం టెన్త్ పబ్లిక్ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నారు. వీటి తేదీల్లో ఎలాంటి మార్పులేదని మంత్రి వివరించారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నెలరోజుల్లో పూర్తిచేయించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌ను జూన్ లేదా జూలైలో నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు వివరించారు. ఇక కొత్తగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అనుమతులకు సంబంధించి ఇప్పటికే సర్వే చేయించామని, అవసరమైన మేరకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. స్కూళ్ల మ్యాపింగ్‌కు సంబంధించి మూడు కిలోమీటర్ల పైబడి ఉన్న వాటి విషయంలో అభ్యర్థనలు వస్తున్నందున పరిశీలిస్తామన్నారు. ఉర్దూ సహా ఇతర మైనర్ మీడియం పాఠశాలలు యథాతథంగానే కొనసాగుతాయని, వాటికి మ్యాపింగ్ ఉండబోదన్నారు. -
AP: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
అమరావతి: ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల తేదీల మార్పు?
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే... జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాయిదా వేస్తే..! జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్‌లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేస్తుంది. -
ఉపాధికి ఊతమిచ్చేలా.. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధికి ఊతమిచ్చేలా ఇంటర్ ఒకేషనల్ విద్యపై ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టి సారించింది. జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదువుతున్నవారితో అప్రెంటీస్‌షిప్ చేసేందుకు వీలుగా పలు కంపెనీలను అనుసంధానం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతోంది. 80 వేల మందికి పైగా విద్యార్థులు.. ఒకేషనల్ కోర్సులను సంబంధిత ప్రత్యేక కాలేజీల్లోనే కాకుండా రెగ్యులర్ కాలేజీల్లోనూ ఇంటర్మీడియెట్ బోర్డు అందిస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ ఒకేషనల్ కాలేజీలు 8 ఉండగా రెగ్యులర్ కాలేజీలు 464 ఉన్నాయి. రెగ్యులర్ కాలేజీల్లో మామూలు కోర్సులతోపాటు అదనంగా వీటిని బోధిస్తున్నారు. ఫస్టియర్‌లో 23 రకాల కోర్సులు, సెకండియర్‌లో 25 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మందికిపైగా ఒకేషనల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ప్రతినెలా ఉపకార వేతనం.. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారికి అప్రెంటీస్‌షిప్ కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏటా వివిధ కంపెనీలన్నింటినీ ఒకే చోటకు చేర్చి మేళాలను నిర్వహిస్తోంది. ఈ నెల 22న రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఈ మేళాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్ పూర్తి చేయగానే వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ (ఆర్డీఎస్డీఈ) ద్వారా సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ధ్రువపత్రాలను కంపెనీలు ప్రముఖంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్‌లో విద్యార్థులకు సంబంధిత కంపెనీ, ఆర్డీఎస్డీఈ కలిపి నెలకు రూ.7 వేలు చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తున్నాయి. సర్టిఫికెట్లు పొందిన వారి కోసం ఏటా మార్చిలో కంపెనీలతో కలసి ఇంటర్ బోర్డు జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించనుంది. డిమాండ్ ఉన్న కోర్సులు కూడా.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకనుగుణంగా ఇంటర్ బోర్డు ఒకేషనల్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులన్నిటికీ చాలా డిమాండ్ ఉంది. వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. ఇవే కాకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, టూరిజం–ట్రావెల్ టెక్నిక్స్ కోర్సులూ విద్యార్థులకు మేలు చేకూరుస్తున్నాయి. ఇక వైద్య రంగానికి సంబంధించి మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్సులకు అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఫ్యాషన్–గార్మెంట్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసినవారికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పదో తరగతి తప్పినవారికి షార్ట్ టర్మ్ కోర్సులు పదో తరగతి తప్పినవారికి కూడా ఇంటర్ బోర్డ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) కింద 3, 9 నెలల కాలవ్యవధితో షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులను కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా రూపొందించారు. అగ్రికల్చర్లో 8, బిజినెస్ కామర్స్, రిటైల్ మార్కెటింగ్‌ల్లో 11, కంప్యూటర్ సైన్స్‌లో 16, ఇంజనీరింగ్ టెక్నాలజీలో 15, హోం సైన్స్‌లో 14, హ్యుమానిటీస్‌లో 2, పారామెడికల్ విభాగంలో 6 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, యూనిక్స్ సీ అండ్ సీ ప్లస్ ప్లస్, వీబీ, ఒరాకిల్, పైథాన్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, మల్టీమీడియా గ్రాఫిక్స్, యానిమేషన్, డేటా సైన్స్ వంటి జాబ్ ఓరియెంటెడ్ కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు ఇంటర్ ఒకేషనల్ కోర్సులన్నీ ఇంచుమించు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేవే. ఇందుకోసం అధ్యాపకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కంపెనీలతోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ బోర్డు కోర్సులకు రూపకల్పన చేసింది. ప్రధానంగా అగ్రికల్చర్, బిజినెస్–కామర్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, హోంసైన్స్, పారామెడికల్ విభాగాల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్లో.. క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సెరికల్చర్, ఫిషరీస్, లైవ్‌స్టాక్ మేనేజ్మెంట్, డెయిరీ కోర్సులున్నాయి. బిజినెస్–కామర్స్‌లో.. అకౌంటింగ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్, రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ కోర్సులున్నాయి. -
ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు చెప్పారు. ఆయన సోమవారం ‘సాక్షితో మాట్లాడారు. ఇతర పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకేరోజున రాకుండా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అవసరాలకోసం జిల్లాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు. విద్యార్థుల కోసం సబ్జెక్టుల కంటెంట్ సిద్ధం కోవిడ్ కారణంగా 2021– 22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావ డం, ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుకాకపోవడం వంటి కారణాలతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తక్కిన 70 శాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించినందున ఆ మేరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కు ఉపయోగపడేలా కంటెంట్ రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతా మని శేషగిరిబాబు చెప్పారు. ఈ మెటీరియల్ ఇం టర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకే కాకుండా జాయిం ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వా న్స్, నీట్, ఏపీఈఏపీసెట్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పకడ్బందీగా ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను మార్చిలో పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్న ట్లు శేషగిరిబాబు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు సం బంధించి విద్యార్థులకు జంబ్లింగ్ ఉండదని, ఎగ్జామినర్లను జంబ్లింగ్ విధానంలో నియమించనున్న ట్లు చెప్పారు. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సిలబస్‌పై నిపుణులతో అధ్యయనం మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమలు, వివిధ సంస్థలు, పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇంటర్మీడియట్ బోర్డులోని ఎడ్యుకేషన్ రీసెర్చి ట్రయినింగ్ వింగ్ (ఈఆర్టీడబ్ల్యూ)ను బలోపేతం చేస్తున్నట్లు తెలి పారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సిలబస్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం, సిఫా ర్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రతినిధులు, ఐఐటీల ప్రొఫెసర్లు, ఎన్సీఈఆర్టీ ప్రముఖులు, ఈఆర్టీడబ్ల్యూ ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్న కమిటీ.. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేర్పులకు సిఫార్సులు చేస్తుందని వివరించారు -
ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి
నాంపల్లి: ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఫస్టియర్ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మళ్లీ ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం చదవాలంటే గందరగోళానికి, తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించిన తరహాలోనే పాస్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఇంటర్ బోర్డు తరఫున డీఎల్ పాండు వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసే సమయంలోనే పరిస్థితులకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే పేర్కొన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు కూడా ఈ విద్యార్థులు రాయలేదని, కరోనా నేపథ్యంలో వీరిని పాస్ చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది. -
AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు టైం టేబుల్ మేరకు ప్రతి రోజూ పరీక్ష ఉంటుంది. నేడు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ -1కి 2వ సెట్ ప్రశ్న పత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బుధవారం నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకి హల్ టిక్కెట్స్ 4 లక్షల మంది విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపద్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్దులెవరైనా ఈ సప్లిమెంటరీ పరీక్షలకి హాజరుకావచ్చు. రేపు(గురువారం) ఇంగ్లీష్, 17న మేథమెటిక్స్- A, బోటనీ, సివిక్స్ పేపర్లు, 18న మేథమెటిక్స్-B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు, 20 న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 21 న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు, 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్స్ మేద్స్, 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు, ఈ నెల 27 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షలకి హాజరుకావాల్సి ఉంటుంది. నిమిషం నిబందనని అమలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా హాజరైనా విద్యార్ధులని అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ ద్వారా తనిఖీలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకి ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియామించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంవర్ 18002749868 ఏర్పాటు చేశారు. వాట్సప్ ద్వారా ఫిర్యాదుకి 9391282578 నంబర్ని అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఎందుకంటే.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు చేసి, అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశం ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్ షీట్స్, నామినల్ రోల్స్ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించారు. జంబ్లింగ్ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీ కూడా కేంద్రాలను తనిఖీ చేయనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి. అయితే నిమిషం లేటు అయినా పరీక్షలకు విద్యార్థులను అనుమతించరు. పరీక్షకు అరగంట ముందుగానే ఉదయం 8.30లకు కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ఇదే రీతిన సెకండ్ ఇయర్ విద్యార్థులను మధ్యాహ్నం 2 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలు ముగిసేంత వరకూ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో శిబిరాలు నిర్వహిస్తారు. కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు.. పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చేయాలని కలెక్టర్ నివాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి ఒక్క విద్యారి్థనీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్ గది ఏర్పాటు చేశారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆ గదిలో కూర్చొబెట్టి పరీక్ష రాయించనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. కోవిడ్ నిబంధనల మేరకు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలి. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలి. – పెదపూడి రవికుమార్, ఆర్ఐఓ -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తూ మంగళవారం జీవో 54ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలో పేర్కొన్న మేరకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలు నిర్ణీత ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్నారు. -
ఏదైనా చట్టప్రకారమే చేయాలి
సాక్షి, అమరావతి: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల విషయంలో ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎలాంటి నిబంధనలు రూపొందించకుండా ఆన్లైన్ ప్రవేశాలను ఎలా చేపడతారంటూ ఇంటర్మీడియట్ బోర్డును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాల నిమిత్తం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీవోఏఎస్ఐఎస్)ను సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ జయసూర్య విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలు రూపొందించకుండా కేవలం పత్రికా ప్రకటన ద్వారా ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని తీసుకురావడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇంటర్ బోర్డు చర్య ఏకపక్షమన్నారు. గత ఏడాది కూడా ఇలాగే ప్రెస్‌నోట్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తప్పుపట్టిందని వివరించారు. నిబంధనల ప్రకారం కాకుండా ప్రెస్‌నోట్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టడం సరికాదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆన్లైన్ ప్రవేశాలపై స్టే విధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుంటూ.. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టామని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం కూడా అదేనని, చట్ట విరుద్ధంగా ఎలాంటి చర్యలు ఉండవని దుష్యంత్ దవే తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ దవే అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. ఇదే అంశంపై పదవ తరగతి పాసైన విద్యార్థులు కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా విచారణను న్యాయమూర్తి ఆ రోజుకే వాయిదా వేశారు. -
ఎట్టకేలకు ఫస్ట్ ఇంటర్‌కు ఆన్‘లైన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయి. సాయంత్రం 3 నుంచి 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జూమ్ ద్వారా జరిగే ఈ బోధనలో ఒక్కో సబ్జెక్టుకు అరగంట కేటాయిస్తున్నారు. ఆన్లైన్ విధానం కొత్త కావడం, బోధకులకు పూర్తిస్థాయి అలవాటు లేకపోవడం, కొన్నిచోట్ల ఇంటర్నెట్, సాంకేతిక సమస్యలు రావడం, విద్యార్థుల మొబైల్ డేటా ఎక్కువ ఖర్చు కాకుండా చూసేందుకు క్లుప్తంగా పాఠాలు చెబుతున్నామని వరంగల్‌కు చెందిన ఓ లెక్చరర్ చెప్పారు. రాబోయే కాలంలో సమయం పెంచే వీలుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తే తాము సిద్ధంగా ఉన్నామని, మరింత మెరుగైన బోధన అందించే అవకాశం ఉంటుందన్నారు. సాధారణంగా తరగతి గదిలో 45 నిమిషాలు లేదా గంట వ్యవధిలో సబ్జెక్టు బోధన జరుగుతుంది. అయితే ఇప్పుడు అరగంటలోనే క్లాస్ ముగించడంతో సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నామని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015 నుంచి 2020 వరకూ తగ్గిన అడ్మిషన్లు.. ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 1,00,687కు చేరాయి. గతంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. కాలేజీల ఆధునీకరణపై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం, కోవిడ్ ప్రభావం, ప్రభుత్వ లెక్చరర్లు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లనే ప్రవేశాలు పెరిగాయని అంటున్నారు. రాష్ట్రంలో 5.78 లక్షల మంది పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ప్రభుత్వ కాలేజీల్లో చేరింది అందులో నాల్గో వంతే. దాదాపు 4 లక్షల మంది కార్పొరేట్ కాలేజీల్లోకి వెళ్లారు. చాలా కాలేజీలు ఇంటర్ బోర్డు అనుబంధ అనుమతి ఇవ్వకున్నా విద్యార్థులను చేర్చుకున్నాయి. అనధికారికంగా ఆన్లైన్లోనే కాదు... ఆఫ్లైన్లోనూ పాఠాలు చెబుతున్నాయని ప్రభుత్వ లెక్చరర్స్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా సిలబస్ పూర్తి చేశాయని, ప్రభుత్వ కాలేజీల్లో రెండు నెలలు ఆలస్యంగా పాఠాలు చెప్పడం పేద విద్యార్థులకు నష్టం చేయడమేనని అంటున్నాయి. దీనివల్ల సబ్జెక్టుపై అవగాహన పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ఒత్తిడితో కళ్లు తెరిచారు ఆలస్యంగానైనా ఆన్లైన్ బోధన సరైన నిర్ణయమే. ఒత్తిడి కారణంగా ఇంటర్ బోర్డ్ అడుగులేసినట్టు కన్పిస్తోంది. అయితే, విద్యార్థులకు అర్థమయ్యేలా ఎక్కువ సమయంలో బోధన ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ కాలేజీలపై పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బోర్డ్ విశ్వసనీయత పెంచాల్సిన అవసరం ఉంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ -
16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ సెకండియర్ తరగతులను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను అనుసరించి తరగతుల నిర్వహణకు వీలుగా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గత నెల 12వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను బోర్డు నిర్వహిస్తోంది. ప్రస్తుతం విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో జూనియర్ కాలేజీల్లోనూ తరగతి గది బోధనను చేపట్టేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించనందున గత ఏడాది ఫస్టియర్ విద్యార్థులందరినీ ఇంటర్మీడియెట్ బోర్డు మినిమమ్ పాస్ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 5.12 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు సెకండియర్ తరగతులకు హాజరుకానున్నారు. -
ఏపీ: సెప్టెంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్ బోర్టు పేర్కొంది. -
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, 2021 మార్చి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 10,32,469 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,12,959 మంది, సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు. ఫలితాల కోసం కొన్ని వెబ్సైట్లు www.sakshieducation.com , www.examresults.ap.nic.in, www.results.bie.ap.gov.in, www.bie.ap.gov.in -
ఇంటర్ అడ్మిషన్స్ @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేపట్టింది. పూర్తి పారదర్శకతతో.. మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కళాశాలలో, గ్రూపులో సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టియర్‌లో ఆన్లైన్ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. అయితే దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్ కావడంతో బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే.. ఆన్లైన్ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్ బోర్డు అనేక సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీ నిర్వహించే గ్రూపులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది ఎంత వైశాల్యంలో ఉండాలి? వంటివాటికి ప్రమాణాలు నిర్దేశించింది. ఆ గదులతో సహా భవనాలు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఫొటోలను దరఖాస్తుతోపాటే బోర్డు వెబ్సైట్లో పెట్టించింది. అంతేకాకుండా ఈ ఫొటోలను జియోట్యాగింగ్ చేయించింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గతంలో కాలేజీ ఒక దగ్గర పెడుతూ.. భవనాలు ఎక్కడివో చూపిస్తూ కాలం గడిపేవి. కానీ జియోట్యాగింగ్ వల్ల కాలేజీలు చూపిస్తున్న భవనాలు దరఖాస్తులోని అడ్రసులో ఉంటేనే అనుమతులు వచ్చేలా చేసింది. పైగా ఆ ఫొటోలన్నింటినీ కాలేజీల వారీగా వెబ్సైట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు చూసేలా అందుబాటులో ఉంచింది. ఆ కాలేజీలో ఏయే గ్రూపులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? వంటి వివరాలను కూడా పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం ప్రత్యేక పోర్టల్.. గతంలో కాలేజీల్లో సెక్షన్‌కు 80 మంది వరకు అనుమతించేవారు. కానీ సీబీఎస్ఈ విధానంలో సెక్షన్‌కు 40 మందిని మాత్రమే ఇంటర్ బోర్డు పరిమితం చేసింది. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు మాత్రమే అనుమతిచ్చేలా నిబంధన పెట్టింది. అలాగే ఎంపీసీ, బైపీసీతోపాటు హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులను కూడా ప్రవేశపెట్టాల్సిందేనని సర్కార్ స్పష్టం చేసింది. కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల సమాచారాన్ని కంప్యూటరీకరించి ఆన్లైన్ అడ్మిషన్లకు అనుగుణంగా వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆన్లైన్ అడ్మిషన్లతో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, క్రీడాకారులకు సంబంధించిన కోటా సీట్లు వారితోనే భర్తీ కానున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు ముకుతాడు పడనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా.. ఆన్లైన్ అడ్మిషన్ల విధానంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు అనేక వెసులుబాట్లు కల్పించింది. – గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్లో పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. – ఆ రిజిస్ట్రేషన్ ఐడీ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. – విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్ నంబర్ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి. – తమకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. – అనంతరం విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. విద్యార్థి మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో దాన్ని తెలియచేస్తుంది. – అలాట్మెంట్ లెటర్‌ను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి. – పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా చెల్లించాలి. అయితే ఫీజులను కమిషన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. – విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్ బోర్డే వాటిని ఆన్లైన్లో పరిశీలిస్తుంది. – ప్రస్తుతం 2020–21కి విద్యార్థులకు ఫలితాలను ప్రకటించే ప్రక్రియలో ఇంటర్ బోర్డు నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్లైన్ అడ్మిషన్లకు శ్రీకారం చుడతామని బోర్డు వర్గాలు వివరించాయి. -
12 నుంచి ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్ సెకండియర్ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్ వివరాలు.. ► ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు అకడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ ► ఆగస్టులో మొదటి యూనిట్ టెస్టు ► సెప్టెంబర్‌లో రెండో యూనిట్ టెస్టు అక్టోబర్ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఫస్ట్ టర్మ్ సెలవులు ► అక్టోబర్ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం ► అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు అకడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ ► నవంబర్‌లో 3వ యూనిట్ టెస్టు ► డిసెంబర్లో 4వ యూనిట్ టెస్టు ► 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్ టర్మ్ సెలవులు ► జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం ► ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు ► ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్ ► మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం ► ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ► మే చివరిలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ► జూన్ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం ► అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు. -
కరోనా ఎఫెక్ట్: ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయడం, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో ఎంసెట్ వెయిటేజీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్షనే కీలకం కానుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. వాటి ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టనుంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,99,019 విద్యార్థుల్లో ఎంసెట్ రాసేవారు ఉంటారు. అయితే ఇపుడు వారిని ప్రథమ సంవత్సర సబ్జెక్టుల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలంటే ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కు లు ఉండాలి. మొదటి సంవత్సరంలో కొందరు విద్యార్థులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కనీస మార్కులతో పాస్ చేస్తున్నందున ఎంసెట్‌లో ఇంటర్‌మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఉండదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నందున... వచ్చే ఏడాది వారు ద్వితీయ సంవత్సరానికి వస్తారు. దీంతో అప్పుడు కూడా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ( చదవండి: వాయిదా వేద్దామా! ) -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆదివారాలు సహా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ చెప్పారు. ‘సాక్షి’తో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. కోవిడ్ దృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రోటోకాల్‌ను అనుసరించి పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి చేసినట్టు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ.. కోవిడ్ తీవ్రత ఉండి కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల చివరి విడతలో పరీక్షలు నిర్వహిస్తాం. మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా పరీక్షలు జరుగుతాయి. కోవిడ్–19 దృష్ట్యా ప్రోటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లోకి భౌతిక దూరం పాటిస్తూ ప్రవేశించాలి. ప్రాక్టికల్ పరీక్షలకు బ్యాచ్‌కు 20 మంది చొప్పున ఉంటారు. అంతమంది పట్టే వీలులేని చోట భౌతిక దూరం ఉండేలా 10 మందిని మాత్రమే అనుమతిస్తాం. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేస్తాం. గతంతో పోలిస్తే ఈసారి 42 కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేశాం. గతంలో 905 కేంద్రాలుండగా.. ఈసారి 947 ఏర్పాటు చేశాం. విద్యార్థులు, సిబ్బందికి పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నాం. ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో విడుదల చేస్తాం. తమ ఫోన్లకు వచ్చే ఓటీపీ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు ఆన్లైన్ ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయిస్తారు. ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేయడానికి వీల్లేదు. జిల్లాల పరిధిలోనే టాస్క్‌ఫోర్స్ నిఘా కరోనా వల్ల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను గతంలో మాదిరిగా ఇతర జిల్లాల నుంచి నియమించడం లేదు. ఆయా జిల్లాల సిబ్బందితోనే టాస్క్‌ఫోర్స్‌లు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. అక్రమాలపై ఫిర్యాదులు వస్తే సీసీ కెమెరాలు పరిశీలించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. పరీక్షల సమాధాన పత్రాలు, అవార్డుల లిస్టులు పరీక్ష ఫలితాలు వెలువడే వరకు భద్రపర్చాలని ఆదేశించాం. ఒకరి రికార్డులను వేరొకరు మళ్లీ వినియోగించే వీలు లేకుండా వాటిపై ప్రత్యేక ముద్రలు వేయిస్తున్నాం. ప్రైవేట్ కాలేజీల్లోని ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ప్రభుత్వ సిబ్బందినే చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా నియమిస్తున్నాం. ఇతర సిబ్బంది ఎవరినీ లోపలకు అనుమతించం. చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప మిగతా వారెవరూ పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా కాలేజీల ప్రిన్సిపాల్స్ సంతకాలతో ప్రమేయం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి ఈ పరీక్షలకు ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్ నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరు కానున్నారు. జేఈఈ, నీట్ సహా అనేక జాతీయ ప్రవేశ పరీక్షలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలతో ముడిపడి ఉన్నందున విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ప్రాక్టికల్, ఇతర పరీక్షలను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కనుక పరీక్షలను ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. అవాంఛనీయ పరిస్థితులకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు పూర్తి సహకారం అందించాలి. -
31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్‌నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరుకానున్నారు. 947 కేంద్రాల్లో ఉదయం (9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు), మధ్యాహ్నం (2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సెషన్లలో ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులెవరికీ ఫిజికల్ హాల్ టికెట్లను బోర్డు పంపిణీ చేయటంలేదు. బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లను నియమించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోను బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ల్యాబ్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్లో ప్రశ్నపత్రం ప్రాక్టికల్ పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ప్రశ్నపత్రాన్ని వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత పరీక్ష సమయానికి ముందు బోర్డు అధికారులు విడుదల చేసే ఓటీపీతో మాత్రమే ఓపెన్ అవుతుంది. సెషన్ల వారీగా పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకనం పూర్తయిన సమాధాన పత్రాలు, ఒరిజినల్ అవార్డు లిస్టు, డూప్లికేట్ అవార్డు లిస్టు కవర్లో ఉంచి సీల్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ముందు నిర్వహించాలి. పరీక్షలలో అక్రమాలు జరిగితే ఆ కేంద్రంలోని పరీక్షల నిర్వాహకులు, విద్యార్థులను బాధ్యులుగా పరిగణిస్తారు. ప్రాక్టికల్ రికార్డు బుక్సును వేరొకరు వినియోగించకుండా ఒకటి రెండుచోట్ల గోటితో చించాలి. ఫలితాలు విడుదలయ్యే వరకు ఈ ప్రాక్టికల్ రికార్డు బుక్సును సెషన్ల వారీగా, బ్యాచీల వారీగా భద్రపరిచి ఉంచాలి. చీఫ్ సూపరింటెండెంటుకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోను వినియోగించవచ్చు. కోవిడ్ జాగ్రత్తలతో పరీక్షలు కోవిడ్–19 వైరస్ దృష్ట్యా ప్రొటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. మాస్కు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలి. కోవిడ్–19తో బాధపడుతున్న విద్యార్థులకు వేరుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా ఉండేందుకు వీలుగా బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందిని మాత్రమే ప్రాక్టికల్ రూములోకి అనుమతించాలి. వారి తరువాత మిగతా 10 మందికి పరీక్షలు నిర్వహించాలి. -
ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులపై ఇంటర్మీడియట్ విద్యా శాఖ దృష్టి సారించింది. అనేకమంది ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి నేర్చుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కోడింగ్ తదితర పది కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీటిని షార్ట్ టర్మ్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పలు వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. అవి కాకుండా 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్ టర్మ్ కోర్సులుగా వీటిని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కోడింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులను ప్రవేశ పెట్టనుంది. జేఎన్టీయూ నేతృత్వంలో ఇండస్ట్రీ, సబ్జెక్టు నిపుణలతో వీటికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కోర్సుల కాల వ్యవధిని నిర్ణయించనుంది. ఈ కోర్సుల్లో 40 శాతం విద్య బోధన రూపంలో ఉండనుండగా, 60 శాతం ప్రాక్టికల్ రూపంలోనే విద్యను అందించనుంది. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పైగా ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఇచ్చే సర్టిఫికెట్‌కు విలువ ఎక్కువగా ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోర్సులుగా వాటిని ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి వచ్చే స్పందనను బట్టి పూర్తి స్థాయి వృత్తి విద్యా కోర్సులుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
సెకండ్ ఇంటర్ పరీక్షలే ముందు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్–2021 మార్చి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షెడ్యూల్లో కాకుండా వేర్వేరుగా నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారడమే దీనికి కారణం. నిజానికి ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు జూన్‌లో ప్రారంభం కావల్సి ఉండగా కరోనా కారణంగా నవంబర్ 2 నుంచి కేవలం సెకండియర్ తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈనెల 18 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం రెండో విడత ప్రవేశాలు సోమవారం వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో.. ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందుగా సెకండియర్ పరీక్షలను పూర్తిచేసేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఫస్టియర్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 11లోగా పరీక్షల ఫీజు చెల్లించాలి ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును వచ్చేనెల ఫిబ్రవరి 11లోగా చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు (జనరల్, వొకేషనల్), కాలేజీలో స్టడీ లేకుండా హాజరు మినహాయింపు పొందిన (హ్యుమానిటీస్) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ముందుగా సెకండియర్ పరీక్షల ఫీజు గడువును ప్రకటించడం ద్వారా పరీక్షకు ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని, తదనంతరం పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేస్తామని బోర్డు వర్గాలు ప్రకటించాయి. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులు తమ ఫస్టియర్ సబ్జెక్టుల మార్కుల్లో పెరుగుదల కావాలనుకుంటే అలాంటి వారికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. కానీ, ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టులలో పాసైన వారు మాత్రమే ఈ ఇంప్రూవ్‌మెంటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫస్టియర్ పరీక్ష ఫీజు రూ.490తో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున ఇంప్రూవ్‌మెంటు పరీక్షకు చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీ స్టడీ లేకుండా హాజరు మినహాయింపుతో 2021 మార్చి ఫస్టియర్, సెకండియర్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లోనే పరీక్షలను రాయవలసి ఉంటుంది. అలాగే, విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజులను చెల్లించాలనుకుంటే ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఫీజుల చెల్లింపు తేదీని పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. సీఎం ఆదేశాలతో పరీక్ష ఫీజుల పెంపు నిలుపుదల ఈ ఏడాది నుంచి ఇంటర్ పరీక్షల ఫీజును పెంచాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. అయితే, కోవిడ్–19ను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచవద్దని.. దానితో పాటు ఆలస్య రుసుమును కూడా రద్దుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని.. దీంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష ఫీజులకు సంబంధించిన వివిధ కేటగిరీల వారీ వివరాలను బోర్డు ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో పొందుపరిచింది. -
జూన్ 20 తర్వాత ఎంసెట్.. ప్రిపరేషన్‌కు నెల రోజులే
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపైనా ఉన్నత విద్యా మండలి సమాలోచనలు చేస్తోంది. ఇంటర్ బోర్డు విద్యా బోధన చేపట్టే సిలబస్ ప్రకారమే ఎంసెట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. 12వ తరగతిలో సీబీఎసీఈ సిలబస్‌ను 30 శాతం తగ్గించినా, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో పూర్తి సిలబస్‌తో జేఈఈ మెయిన్ నిర్వహిస్తామని, విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రశ్నల సంఖ్యను పెంచి ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు 30 శాతం సిలబస్‌ను తొలగించి 70 శాతం సిలబస్‌పై వార్షిక పరీక్షలు నిర్వహిస్తే, ఆ సిలబస్‌పైనే ఎంసెట్ నిర్వ హించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినా ఇంటర్ బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రిపరేషన్‌కు తక్కువ సమయమే..: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3 నుంచి నిర్వహించేలా ఇంటర్ బోర్డు అకడమిక్ కేలండర్ రూపొందిస్తోంది. మే 19 వరకు ప్రధాన పరీక్షలు, 24 వరకు అన్ని పరీక్షల పూర్తికి షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఎంసెట్‌ను జూన్ 20 తర్వాత నిర్వహించే అవకాశముంది. ఎంసెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇంటర్ పరీక్షల తర్వాత నెల సమయమే ఉండే పరిస్థితి నెలకొంది. వచ్చే నెలలో షెడ్యూలు ప్రకటన ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం అయ్యాక ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణ తేదీలను అధికారికంగా ఖరారు చేయనుంది. సెట్స్ కననర్ల నియామకాలను కూడా వచ్చే నెలలో చేపట్టే అవకాశముంది. -
మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్ కేలండర్ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్ రూపకల్పనపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తోంది. మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. ఆ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగిం చే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్మెంటల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంసెట్‌పైనా ఆలోచన మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌కు కేంద్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తీసుకొని, ఉన్నత విద్యా మండలితో సమావేశం కావా లని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. మండలితో నిర్వహించే సమావేశంలో యూనివర్సిటీలు పాల్గొంటాయి కనుక అందులో ఎంసెట్ సిలబస్ ఎంత ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. చదవండి: (హెడ్మాస్టర్ స్థాయి వరకే పదోన్నతులు!) ప్రాక్టికల్స్ ఉంటాయ్.. కరోనా కారణంగా విద్యా బోధన దెబ్బతిన్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్/టీవీ ద్వారా విద్యా బోధనను బోర్డు నిర్వహించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్ విద్యాబోధనను కొనసాగించనుంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను సైతం నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అందుకు అనుగుణంగానే అకడమిక్ కేలండర్, పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన వారూ పాస్! గతేడాది మార్చిలో (2020) జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన ఫస్టియర్ విద్యార్థులను పాస్ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇచ్చి పాస్ చేసింది. కానీ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది. నేడో రేపో పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ ఒకటీ రెండురోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే కేలండర్‌ను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. -
ఇంటర్‌కు ఇకపై ఒకే హాల్‌టికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో వేర్వేరుగా కాకుండా రెండేళ్లూ ఒకే నెంబరుతో హాల్‌టికెట్ ఇచ్చే అంశంపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి, ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో వేర్వేరు హాల్‌టికెట్ నెంబరు ఉండటం వల్ల విద్యార్థులు ఏది ఇవ్వాలనే విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఒక్కోసారి మొదటి సంవత్సరపు హాల్‌టికెట్ నెంబరు ఇచ్చి నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లకూ ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్లు జారీ చేసేలా ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. వీలైతే వచ్చే ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్ విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. సిలబస్ కుదింపు.. ఇంటర్లో 30 శాతం సిలబస్ కుదింపుపై బోర్డు తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. గత ప్రతిపాదనల్లో కొందరు జాతీయ ప్రముఖులు, సంఘ సంస్కర్తలపై పాఠ్యాంశాలు, తెలంగాణ పండుగలు కుదిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభు త్వ ఆదేశాల మేరకు బోర్డు సిలబస్ కమిటీని సబ్జెక్టు నిఫుణులతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిలబస్ కుదించే ప్రతిపాదనలు రూపొందించింది. కొన్ని సబ్జెక్టుల్లో 25 శాతం, మరికొన్నింటిలో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించేలా ప్రతిపాదించింది. అలాగే ఇంటర్నల్ అసెస్మెంట్ విధానంపైనా బోర్డు చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాస్తవానికి ఇంటర్లో డిస్క్రిప్టివ్ విధానంలోని పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిలో చాలామందికి ఆబ్జెక్టివ్ విధానంలోని ఎంసెట్‌లో మాత్రం తక్కువ మార్కు లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్ విధానంతో కూడిన ఇం టర్నల్ అసెస్మెంట్పై బోర్డు ఆలోచిస్తోంది. వీటన్నింటిపైనా ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే విధానపర నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. -
ఈ ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు ఆన్ లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ మంగళవారం విజయవాడలో పేర్కొన్నారు.https ://bie.ap.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి నుంచి ఆన్ లైన్లో ఇంటర్మీయట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా ఈనెల 29 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ళ ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కాగా బీసీ,ఓసీ విద్యార్థులకు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చని రామకృష్ణ పేర్కొన్నారు. -
ఇంటర్ సిలబస్ తగ్గింపు; ఈ ఏడాదికే
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యా సంవత్సరానికి (2020-21) గాను 30 శాతం తగ్గించారు. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలిగించిన పాఠ్యాంశాల వివరాలను ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలిగించామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు నెల క్రితమే 30 శాతం సిలబస్‌లో కోత విధిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం సహా ఇతర సబ్జెక్టుల సిలబస్‌పై నిపుణుల కమిటీలతో చర్చించి వాటి సిఫారసు ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఇక సిలబస్ తగ్గింపు అంశం ఈ సంవత్సరానికే వర్తిస్తుందని తెలిపారు. -
రిజర్వేషన్లు ప్రకటించిన ఇంటర్ బోర్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (2020-21) సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అప్లికేషన్ ఫామ్‌ను సెప్టెంబర్ 16(బుధవారం)న ఇష్యూ చేస్తుంది. ఆన్లైన్ తరగతులను సెప్టెంబర్ 18(శుక్రవారం)న ప్రారంభించనున్నారు. అడ్మిషన్లకు చివరి తేదీగా సెప్టెంబర్ 30న బోర్డ్ నిర్ణయించింది. అయితే కేటగిరీ వారిగా రిజర్వేషన్లు: షెడ్యూల్ క్యాస్ట్స్(ఎస్సీ)-15శాతం, షెడ్యూల్ ట్రైబ్స్(ఎస్టీ)-6శాతం, బ్యాక్వర్డ్ క్లాసెస్(బీసీ)- 29శాతం(బీసీ సబ్ కేటగిరీల వారిగా రిజర్వేషన్లు: బీసీ ఏ (7శాతం), బీసీ బీ (10శాతం), బీసీ సీ (1శాతం), బీసీ డీ (7శాతం), బీసీ ఈ (4శాతం), ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్(3శాతం), ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(5శాతం), ఎక్స్ సర్వీస్‌మెన్, డిఫెన్స్, పర్సనల్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్(3శాతం), ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(10శాతం) ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అయితే మొత్తం సీట్లలో 33.3శాతం బాలికలకు కేటాయించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. -
ఇంటర్ సిలబస్ 30 శాతం కుదింపు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది. లాంగ్వేజ్‌లకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో వివరాలు అప్లోడ్ చేయనున్నారు. కోవిడ్–19 కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్ కుదింపు చర్యలు చేపట్టింది. ఇలా ఉండగా, ఇంటర్మీడియెట్ 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల తాజా మార్కులతో కూడిన షార్ట్ మార్కుల మెమోలను కూడా బోర్డు వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. -
డిజిటల్ బోధన షిఫ్ట్ విధానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యా బోధన ప్రారంభంపై ఇంటర్ బోర్డు కసరత్తు వేగవంతం చేసింది. ముందుగా డిజిటల్ బోధన, ఆపై షిఫ్ట్ పద్ధతిలో బోధనను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. నష్టపోయిన పని దినాల సర్దుబాటు, భౌతికదూరం పాటించేలా డిజిటల్, షిఫ్ట్ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన, ఒక్కో సెక్షన్లో విద్యార్థుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదముద్ర పడగానే తొలుత డిజిటల్ తరగతుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఆ తరువాత షిఫ్ట్ పద్ధతిలో బోధన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తోంది. మరోవైపు విద్యా సంవత్సరం ఆలస్యం కారణంగా నష్టపోయిన పని దినాలను సెలవుల రద్దుతో సర్దుబాటు చేయడంతోపాటు 30% సిలబస్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా ప్రతిపాదించింది. డిజిటల్ బోధన, తరగతుల నిర్వహణ ఇలా..: ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు క్లాస్‌రూమ్‌లో రెగ్యులర్ విద్యాబోధన సాధ్యం కాదు కాబట్టి డిజిటల్ విద్యాబోధనకు ఇంటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ బోధన, వీడియో పాఠాల రూపకల్పనపై ప్రభుత్వ లెక్చరర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పటికే పలు డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉన్నా అవి సమగ్రంగా లేకపోవడంతో ప్రభుత్వ లెక్చరర్లతోనే వీడియో పాఠాల రూపకల్పనకు చర్యలు తీసుకుంటోంది. ఆ పాఠాలను యూట్యూబ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు చానల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) వంటి చానళ్ల ద్వారా ఒక్కో సబ్జెక్టులో 30 శాతం పాఠాలను బోధించడం, వాటికి 20 ఇంటర్నల్ మార్కులిచ్చే విధానాన్ని ప్రతిపాదించింది. కరోనా కొంత అదుపులోకి వచ్చాక కూడా కొన్ని నెలలపాటు షిఫ్ట్ పద్ధతిలో తరతగతుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఒక్కో సెక్షన్లో విద్యార్థులు 88 మంది ఉండగా, ఆ సంఖ్యను సగానికి తగ్గించేలా ప్రతిపాదించింది. భౌతికదూరం పాటిస్తూ 44 మందికి మాత్రమే బోధన చేపట్టాలని భావిస్తోంది. మరోవైపు అవకాశం ఉంటే అందులో సగం మందికి ఉదయం, సగం మందికి మధ్యాహ్నం బోధించే అంశాన్నీ పరిశీలిస్తోంది. లేదంటే సెక్షన్‌లోని సగం మందికి ఒక రోజు ఆఫ్‌లైన్ బోధన, మరో సగం మందికి డిజిటల్ పాఠాలు, మరోవైపు అదే పద్ధతిలో డిజిటల్ పాఠాలు, ప్రత్యక్ష బోధన విధానం చేపట్టాలని భావిస్తోంది. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్, మరో మూడ్రోజులు సెకండియర్ తరగతులు నిర్వహించే అంశంపైనా కసరత్తు చేసింది. కట్టుదిట్టంగా క్లాసులు.. తరగతి గదుల్లో పరిశుభ్రత విషయంలో జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించడం, రోజూ తరగతి గదులను శానిటైజ్ చేయడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు, తరగతి గదుల్లో మాస్క్ తప్పనిసరి చేయడం, హ్యాండ్‌వాష్ వంటి అంశాలను పక్కాగా అమలు చేయడం వంటి అంశాలపై బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు వీలైన చోట ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఆన్లైన్ బోధనకు అవసరమైన సదుపాయాలు, విద్యార్థులకు ఫోన్లు, డేటా ఉంటే అందుకు అనుగుణంగా ముందుకు సాగే ఆలోచనలు చేస్తోంది. పని దినాలను సర్దుబాటు చేసే క్రమంలో రెండో శనివారాలను రద్దు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. -
‘ఇంటర్ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు నోటీసులు’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఇంటర్ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ ప్రవేశాల కోసం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ కాలేజీ విద్యార్థులే పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన కాలేజీలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. -
‘త్వరలో కాలేజీల పున:ప్రారంభ తేదీని ప్రకటిస్తాం’
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా మూతపడిన జూనియర్ కాలేజీల పున:ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే జూనియర్ కాలేజీల కోసం ఆన్లైన్ దరఖాస్తు తేదీని జూన్ 30 వరకు పోడగించింది. అంతేగాక ప్రైవేటు ఇంటర్ కాలేజీల రెన్యువల్ తేదీని కూడా జూన్ 30 వరకు పొడగించింది. రూ. 20 వేల ఫైన్ ద్వారా ఆగష్టు 12వ తేదీ వరకు రెన్యువల్స్‌కు అవకాశం ఇచ్చినట్లు బోర్డు పెర్కొంది. కాగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షను తిరగి జూన్ 3వ తేదిన నిర్వహించన్నట్లు తెలిపింది. విద్యార్థులు www.bie.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా బోర్డు సూచించింది. -
దశల వారీగా పాఠశాలలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశల వారీగా స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిస్థితిని బట్టి జూలై 1 నుంచి లేదా 15 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయంతో ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అధికా రులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడే స్కూళ్ల ప్రారంభంపై పెద్దగా నిర్ణయాలు లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఒకవేళ కరోనా అదుపులోకి వస్తే జూలైలో ప్రారంభించాలని, అప్పుడు మొదట 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనకు వచ్చారు. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. టీచర్లను మాత్రం పాఠశాలల పునఃప్రారంభ దినమైన జూన్ 12 నుంచే వచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లంతా గ్రామ పంచా యతీల సమన్వయంతో పాఠశాలలను శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్ చేయించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల నుంచి నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపైనా చర్చించారు. ఎక్కువుంటే షిఫ్ట్ పద్ధతిలో.. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ పద్ధతుల్లో కొనసాగించాలని, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇది అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, డిజిటల్ తరగతులు, కేబుల్ టీవీ ద్వారా తరగతుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వాస్తవానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కానే కాదని పేర్కొన్నా.. ఉన్నత తరగతులకు ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రత్యక్ష బోధన లేకుంటే ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, భౌతిక దూరం పాటించడం గ్రామీణ పాఠశాలల్లో పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కరోనా అదుపులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపైనా విద్యా శాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరో 10–15 రోజుల తర్వాత కరోనా పరిస్థితిని చూసి మళ్లీ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోగా అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతోనూ ఓసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై 15 నుంచి ఇంటర్ తరగతులు ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్ విద్యా కార్యక్రమాలపైనా బోర్డు అధికారులు మంత్రికి నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే ఇంటర్లో సిలబస్ తగ్గించొద్దని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే సిలబస్ అలాగే ఉండాలని, అవసరమైతే నష్టపోయిన పని దినాలను ఆన్లైన్ బోధన ద్వారా సర్దుబాటు చేయాలని సూచించారు. భేటీలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్య సీనియర్ అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
జూలైలో ద్వితీయ.. ఆగస్టులో ప్రథమ తరగతులు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యా ఏడాది ప్రారంభంపై కసరత్తు కొనసాగుతోంది. తరగతుల నిర్వహణ ఎలా అనే దానిపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నివేదికను విద్యాశాఖ మంత్రికి అందజేసే అవకాశం ఉంది. తరువాత దానిపై చర్చించి ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూలైలో సెకండియర్ తరగతులు, ఆగస్టులో ఫస్టియర్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. నష్టపోయిన పని దినాల సర్దు బాటు, భౌతికదూరం పాటించేలా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనలు, షిప్ట్ పద్ధతులు, ఒక్కో సెక్షన్లో విద్యార్థుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై కమిటీ పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. అయితే ఈ కమిటీ తరగతుల ప్రారంభానికి సంబంధించి సిఫార్సు చేసినా, కరోనా కేసులు, కట్టడి పరిస్థితుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే తుది నిర్ణయం ఆధారంగానే ఉండనున్నాయి. ఒకవేళ కేంద్రం కనుక జూలైలో తరగతుల నిర్వహణ వద్దంటే సెకండియర్ తరగతులు ఆగస్టులోనే ప్రారంభించే అవకాశం ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు.. ► జూలైలో ఇంటర్ సెకండియర్, ఆగస్టులో ఫస్టియర్ క్లాసుల్ని ప్రారంభించాలి. ► విద్యా ఏడాది ఆలస్యంతో ఎన్ని రోజులు నష్టపోతే అన్ని రోజుల సిలబస్‌ను ఆన్లైన్లో నిర్వహించాలి. లేదంటే నష్టపోయిన పనిదినాల్లో సగం ఆన్లైన్లో నిర్వహించాలి. మిగతా సగం పాఠాలను సిలబస్ నుం చి తొలగించవచ్చా? అనేది చూడాలి. ఈ మేరకు ఇంటర్ వార్షిక పరీక్షల్లోనూ వాటిని తొలగించి, ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఎంసెట్‌లోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలి. ► రెగ్యులర్ తరగతుల నిర్వహణలో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌కు చర్యలు చేపట్టాలి. కొంతమందికి ఆన్లైన్, కొంతమందికి ఆఫ్‌లైన్ నిర్వహణను పరిశీలించాలి. లేదంటే ఫస్టి యర్ వారికి ఉదయం, సెకండియర్ వారి కి మధ్యాహ్నం నిర్వహించవచ్చు. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్ వారికి, మరో మూడ్రోజులు సెకండియర్ వారికి నిర్వహించవచ్చా? అనేది చూడాలి. ఒకే కోర్సు లోని విద్యార్థులను విభజించి రోజు విడిచి రోజు ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించాలి. ► ఆన్లైన్ బోధనకు వెళ్లే క్రమంలో అందుకు తగిన సదుపాయాలున్నాయో లేవో చూ డాలి. ప్రస్తుతం విద్యార్థులకు ఫోన్లు ఉన్నా యి. ఫోన్ విత్ డేటా ఉండేలా ట్యాబ్స్‌ను గవర్నమెంట్ సరఫరా చేస్తే విద్యార్థులకు ఉపయోగం. ► ఆన్లైన్ కంటెంట్ ప్రస్తుతం మార్కెట్లో విద్యార్థులకు అర్థం కానివి ఉన్నాయి. వర్చువల్ ల్యాబ్స్‌ను ప్రైవేటు సంస్థలతో రూపొందించాలి. అధ్యాపకులు వాటిని ఉపయోగించుకొని ఆన్లైన్లో బోధన నిర్వహించాలి. ► పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం సాధ్యమవుతుందో లేదో పరిశీలించాలి. ► తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేందుకు ప్రస్తుతం సెక్షన్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను తగ్గించాలి. ప్రస్తుతం ఒక్కో సెక్షన్లో 88 మంది ఉంటున్నారు. దానిని 40–50కి పరిమితం చేయాలి. ► హైజెనిక్ కండిషన్‌కు జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించాలి. ► రోజూ తరగతి గదుల శానిటైజేషన్‌కు చర్యలు చేపట్టాలి. ► స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చే యాలి. తరగతి గదుల్లో మాస్క్ తప్పనిస రి. హ్యాండ్‌వాష్ అమలుచేయాలి. ► కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం భౌతికదూరం పాటించాలి. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దు. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ భౌతికదూరం తదితర జాగ్రత్తలతో సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మొత్తం 10.64 లక్షల మంది వివిధ కాంబినేషన్ల కోర్సులతో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు రాశారు. వీరికి సంబంధించి 60 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్య దర్శి ఎం.రామకృష్ణ తెలిపారు. రోజూ రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎగ్జామినర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున 30 పేపర్లు ఇస్తామని, పరిస్థితిని బట్టి వీటి సంఖ్య కొంత పెంచి మూల్యాంకనాన్ని త్వరగా ముగించి ఫలితాలు వెల్లడిస్తామనిì తెలిపారు. గతంలో జిల్లాకొకటి చొప్పున 13 మూల్యాంకన కేంద్రాలుండగా ఇప్పుడు వాటిని మొత్తం 46 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం, తూ.గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, ప.గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విజయనగరం జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఏపీలో మిగిలిన ఇంటర్ పరీక్షలకు రీషెడ్యూల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్ రెండో ఏడాది మోడ్రన్ లాంగ్వేజ్–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్షలు మార్చి 23న జరగాల్సి ఉండగా కరోనా, లాక్డౌన్ల కారణంగా వాయిదా వేశారు. తాజా రీషెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు గతంలో జారీ చేసిన హాల్ టిక్కెట్లలో పేర్కొన్న పరీక్ష కేంద్రాల్లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు రావాలి. పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం, శానిటైజేషన్ తదితర ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు బోర్డు ఏర్పాట్లు చేసింది. రెడ్ జోన్లలో మినహా తక్కిన ప్రాంతాల్లోని మూల్యాంకన కేంద్రాల్లో జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఇది పూర్తయిన అనంతరం మూల్యాంకనాన్ని ప్రారంభిస్తారు. -
ఇంటర్మీడియట్ జియోగ్రఫీ పరీక్ష తేదీ ఖరారు
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్ మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ.. జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను www.bie.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. -
ఇక హాస్టళ్లలోనూ భౌతిక ‘దూరం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ హాస్టళ్ల అనుమతులకు సంబం ధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి హాస్టల్లో కనీసంగా 50 ఎస్ఎఫ్టీ స్థలం కేటాయించాలన్న నిబంధన ఉండగా దానిని రెట్టింపు చేయాలని బోర్డు భావిస్తోంది. వీలైతే అంతకంటే ఎక్కువ స్థలం కేటాయించేలా చూడాలన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఆ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. వాటి ప్రకారమే హాస్టళ్ల గుర్తింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియెట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. లక్షన్నర మందికిపైగా.. రాష్ట్రంలో 2,500కు పైగా జూనియర్ కాలేజీలుంటే అందులో ప్రభుత్వ, ఎయిడెడ్, సంక్షేమ శాఖల గురుకుల జూనియర్ కాలేజీలు పోగా ప్రైవేటు కాలేజీలు 1,556 ఉన్నాయి. అందులో నివాస వసతితో కూడిన(హాస్టళ్లతో) జూనియర్ కాలేజీలు 570 వరకు ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే 9.5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో దాదాపు 3.5 లక్షల మంది చదువుతుండగా, 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. అందులో లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయా కాలేజీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 10 మందిని ఉంచుతున్నారు. సదుపాయాలు పెద్దగా కల్పించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఐదారు అంతస్తులుండే హాస్టళ్లలో లిఫ్ట్ సదుపాయం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం కూడా ప్రధానమే కావడంతో 2020–21 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. మరో వేయి వరకు పాఠశాలల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. చదవండి: తగ్గిన కంటైన్మెంట్ జోన్లు 2018లోనే నిబంధనలు రూపొందించినా... హాస్టళ్లలో ఉండాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై 2018 మార్చిలోనే ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఫీజును నిర్ణయించింది. ముందుగా ఫీజు ఎక్కువగా ఉందని యాజమాన్యాలు పేర్కొనడంతో మూడుసార్లు ఫీజు తగ్గించింది. అయినా యాజమన్యాలు ముందుకు రాకపోగా, కోర్టును ఆశ్రయించాయి. దీంతో బోర్డు ఆ నిబంధనల అమలును పక్కన పెట్టింది. ప్రస్తుతం ఒక్కో హాస్టళ్లలో 300 నుంచి 500 వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేయడం ద్వారా భౌతిక దూరం పాటించేలా చేయవచ్చన్న ఆలోచనకు వచ్చింది. దీంతోపాటు ప్రతి చోట భౌతిక దూరాన్ని పెంచేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు అధికారుల కమిటీ చర్యలు చేపట్టింది. మార్పులు చేయనున్న కొన్ని నిబంధనలు (ప్రస్తుతం ఉన్నవి)... ►25 మంది విద్యార్థులు ఉండే ఒక్కో డార్మెటరీ 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. రూమ్ అయితే ఒక్కో విద్యార్థికి 50 ఎస్ఎఫ్టీ ఉండాలి. ► 25 మంది విద్యార్థులకు స్టడీ రూమ్ 300 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►ఫస్ట్ ఎయిడ్/సిక్ రూమ్ ఒక్కో విద్యార్థికి 75 ఎస్ఎఫ్టీ ఉండాలి. డార్మెటరీ లాంటిదైతే 10 మందికి 750 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►కిచెన్ 250 ఎస్ఎఫ్టీ, డైనింగ్ హాల్ కనీసంగా 500 ఎస్ఎఫ్టీ, రిక్రియేషన్ రూమ్ 300 ఎస్ఎఫ్టీ, లైబ్రరీ 500 ఎస్ఎఫ్టీ, ఆఫీస్ ఏరియా 500 ఎస్ఎఫ్టీ, కౌన్సెలింగ్/గైడెన్స్ రూమ్ 120 ఎస్ఎఫ్టీ ఉండాలి. కొన్నాళ్లు భౌతికదూరం పాటించేలా.. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. ఇప్పటికిప్పుడు అదనపు తరగతి గదులను నిర్మించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే వీలైనంత వరకు విద్యార్థుల మధ్య దూరం పాటించేలా చేయాలని భావిస్తోంది. విద్యార్థులను విభజించి షిఫ్ట్ పద్ధతిలో తరగతులను కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా చర్చించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని హాస్టళ్లలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
అన్నీ ఉంటేనే అనుమతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అందించాలి. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. ► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్స్పెక్షన్ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్లైన్లో సమర్పించాలి. ► ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్వర్డ్ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. ► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. ► భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్ డీడ్లను పరిశీలిస్తారు. ► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. ► పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. ► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
ఆన్లైన్లోనే నూతన జూ.కళాశాలల అనుమతులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాని బోర్డు సూచించింది. ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీలు అఫిలియేషన్ గుర్తింపును పొడిగింపు కూడా ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపింది. నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసిన వాటిని మాత్రమే ఇకపై ఆన్లైన్లో జూనియర్ కళాశాల అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొంది. (కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం) జియో ట్యాగింగ్ ద్వారా కళాశాల క్రీడా స్థలం, తరగతి గదులు, లైబ్రరీ గుర్తింపు, ఇతర అనుమతులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు 10,500 ఫీజు, పట్టణ ప్రాంతాల్లో 27,500 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని తెలిపింది. మే 31 వరకు ఆన్లైన్లో జూనియర్ కళాశాలకు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 1 నుంచి అపరాధ రుసుం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. (‘రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’ ) -
ఇంటర్ మూల్యాంకనం ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గందరగోళంలో పడింది. లాక్డౌన్ కారణంగా మూల్యాంకనం ప్రారంభించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. సాధారణ పరిస్థితుల్లో ఈ సమయానికల్లా ఫలితాలు వెలువడేవి. ఇప్పుడు మూల్యాంకనమే ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్లో మూల్యాంకనం చేపట్టాలని అధ్యాపకులు సూచిస్తున్నా బోర్డు అధికారులు ససేమిరా అంటున్నారు. ఆన్లైన్ మూల్యాంకనానికి అనువైన పరిస్థితుల్లేవని, చిన్న పొరపాటు తలెత్తినా విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. ఇక ఆఫ్‌లైన్‌లో మూల్యాంకనాన్ని వచ్చే నెల 7వరకు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఆ తరువాతే మూల్యాంకనంలో వేగం పెంచేందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలపై బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. మొత్తానికి జూన్ మొదటి వారంలోగా మూల్యాంకనం పూర్తిచేసి, జూన్ రెండో వారంలోగా ఫలితాలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. ‘ఆన్లైన్’కు నో.. ‘ఆఫ్‌లైన్’కు ఓకే! మూల్యాంకనం ఆన్లైన్లో చేపట్టాలన్న ప్రతిపాదనలు బోర్డు అధికారులకు ఈ నెల మొదట్లోనే వచ్చాయి. అయితే 9.65 లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాలను స్కానింగ్ చేయడం, వాటిని అధ్యాపకులకు పంపించడం, వాటిని ఆన్లైన్లో (ఆన్‌స్క్రీన్) మూల్యాంకనం చేయడం ఇబ్బందికరమని బోర్డు అధికారులు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు ఫలితాల ప్రాసెస్‌ను మొదటిసారిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేయనుంది. ఈ క్రమంలో చిన్న సమస్య తలెత్తినా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే ఆఫ్‌లైన్‌లో మూల్యాంకనం చేపడతామని చెబుతున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. లాక్డౌన్ తరువాత మూల్యాంకనంలో వేగం పెంచేందుకు స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను పెంచాలని బోర్డు యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలు ఉండగా, వాటిని 40కి పెంచాలని చూస్తోంది. 12 స్పాట్ కేంద్రాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ స్పాట్ కేంద్రాలు మినహా మిగతా 9.. నల్లగొండ, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, నిజమాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, హైదరాబాద్, హైదరాబాద్‌లోని వొకేషనల్ క్యాంపు ప్రాంతాలన్నీ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్‌లో లేని ప్రాంతాలతో పాటు పాత జిల్లాల్లోని కొన్ని ప్రధాన కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా వేగంగా మూల్యాంకనం పూర్తి చేయవచ్చని భావిస్తోంది. మరోవైపు అధ్యాపకులు నివాసం ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్పాట్ కేంద్రానికి వెళ్లి మూల్యాంకనంచేసే వెసులుబాటు కల్పించే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఏ జిల్లాలో పనిచేసే లెక్చరర్లు అక్కడే మూల్యాంకనం చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనను సడలించడం ద్వారా అధ్యాపకులు తమ నివాసానికి సమీపంలోని కేంద్రానికి వెళ్లి వచ్చే వెసులుబాటు కల్పిస్తే ఎక్కువ మంది వస్తారని అధ్యాపకులు చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఫలితాలు? కేంద్రాలను పెంచడం, ఎక్కడ వీలైతే అక్కడి స్పాట్ కేంద్రాల్లో వ్యాల్యుయేషన్‌కు అవకాశమిస్తే జూన్ మొదటి వారానికల్లా మూల్యాంకనం పూర్తి చేయడం, రెండో వారంలో ఫలితాలను విడుదల చేసేలా బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం కాకపోయినా రెండు మూడు సబ్జెక్టులకు సంబంధించి ఆన్లైన్లో మూల్యాంకనం చేయిస్తే మే నెలాఖరులోగా ఫలితాలను ఇవ్వవచ్చని అధికారులు అంటున్నారు. కరోనా ప్రభావం మే, జూన్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ద్వితీయ సంవత్సర మూల్యాంకనమే చేపట్టేలా బోర్డు కసరత్తు చేస్తోంది. 4,85,345 మంది విద్యార్థులున్న ద్వితీయ సంవత్సర ఫలితాల ప్రకటన తరువాత 4,80,531 మంది ప్రథమ సంవత్సర విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని బోర్డు భావిస్తోంది. -
అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: నిబంధనలను గాలికొదిలేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. కాలేజీలకు అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు, బుక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న కార్పొరేట్ యాజమాన్యాలకు చెక్ పెడుతూ.. అడ్మిషన్లు, అనుమతులను ఆన్లైన్లో నిర్వహించనుంది. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ (ఏపీఎస్ఈఎంఆర్సీ) నిర్ణయిస్తుంది. ఇంటర్ బోర్డు కూడా పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా వచ్చే ఏడాది (2020–21 విద్యాసంవత్సరం) నుంచి కాలేజీలకు ఈ–ప్రవేశాలు (ఆన్లైన్ అడ్మిషన్లకు) నిర్ణయించింది. ప్రయివేటు జూనియర్ కాలేజీలకు అనుమతులను కూడా ఆన్లైన్ చేసింది. ► కాలేజీలు పలు రకాల ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ఇంటర్మీడియెట్‌బోర్డుకు అధికారాలు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. ► అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి ఉంటుంది. ► కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను కూడా పాఠశాల విద్య, పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వెబ్సైట్లోనే పొందుపర్చనుంది. ► 2020–21 విద్యా సంవత్సరం నుండి ఈ–ప్రవేశాలు (ఆన్లైన్) అమలు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్లు కల్పించనున్నారు. ► ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలోనే ఈ– ప్రవేశాల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం. ► వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు కోర్సుల వారీగా అనుమతులకు ఇంటర్మీడియెట్‌బోర్డు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ జాబితాను బోర్డ్ వెబ్సైట్లో కాలేజీలో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలతో అప్లోడ్ చేయనుంది. ► విద్యార్థులు ఆప్షన్ల ప్రకారం ఆన్లైన్లో అనుమతులు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు ఇస్తారు. ► కొత్త కాలేజీల ఏర్పాటుకు కూడా ఆన్లైన్ దరఖాస్తులనే ఆహ్వానించింది. ► ఏఏ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీల అవసరముందో బోర్డ్ అధ్యయనం చేసింది. ఆయా మండలాలు, పట్టణాలకే కొత్త కాలేజీలకు అనుమతి. ► విద్యార్థుల అన్ని ధ్రువీకరణ పత్రాలను బోర్డు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయనుంది. ఈ మేరకు టెన్త్ ఫలితాల వివరాలను ఎస్సెస్సీ బోర్డునుంచి, కుల, ఆదాయ, నివాస ప్రాంతాల ధ్రువీకరణకు సంబంధించి మీసేవ వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుంది. ► ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్ పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ప్రత్యేక బృందాలతో తనిఖీ. -
ఇంటర్ బోర్డు ఉద్యోగులకు టర్మ్ డ్యూటీస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియ ట్ కమిషనర్ కార్యాలయం ఉద్యోగులు 20 శాతం మం ది రోజూ కార్యాలయాలకు రావాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర పనులు ఉన్నం దున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు రొటేషన్ పద్ధతిలో రోజువారీగా హాజరు కావాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలో ఈనెల 31 వరకు 20 శాతం ఉద్యోగులే హాజరయ్యేలా ఆయా శాఖలు ఏర్పాట్లు చేశాయి. ఈనెల 20 నుంచి 31 వరకు రోజువారీగా ఏయే ఉద్యోగులు విధులకు హాజరు కావాలి? ఎవరు సెలవుల్లో ఉండాలన్న వివరాలతో కూడిన ఆదేశాలను ఆయా శాఖలు జారీ చేశాయి. అలాగే రొటేషన్ పద్ధతిలో ఎవరెవరు ఏయే రోజుల్లో హాజరు కావాలనే వివరాలతో ఆదేశాలను జారీచేశాయి. మిగతా ఉద్యోగులు ఈ– ఆఫీస్ విధానం లో ఇళ్ల నుంచే పని చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. -
‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సూచనలను ఉల్లంఘిస్తే కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ నెల 21 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ వాల్యూషన్ తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని ఈ నెల 31 తర్వాత ఇంటర్ బోర్డు వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏలూరులో కరోనా హెచ్చరికలను ఖాతరు చేస్తూ పాఠశాల నిర్వహించిన నారాయణ, భారతి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు పాఠశాలలను సీజ్ చేశారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) విజయవాడ: జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పదిహేను రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 900 మంది విదేశాల నుంచి వచ్చారని, వాళ్లందరినీ హౌస్ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు తీసిన మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయని, ఈ రోజు(శుక్రవారం) మరో శాంపిల్ టెస్టింగ్ కోసం పంపామని అన్నారు. యాభై ఆసుపత్రిలో 200 పడకలు ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎయిర్ పోర్టు నుంచి అనుమతిస్తున్నామని తెలిపారు. నిన్న(గురువారం) ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన 18 మంది మెడికల్ విద్యార్థులను హౌస్ ఐసోలేషన్ లొ పెట్టామని, రాష్ట్రంలో కరోనా ప్రభావం భయపడే స్థాయిలో లేకపోయినా.. జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. జనంలో కరోనాపై అపోహలు పోగొట్టి అవగాహన పెంచాలని సీఎం సూచించారన్నారు.(కామసూత్ర నటికి కరోనా పాజిటివ్) -
‘కార్పొరేటు’కు కళ్లెం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా చేపట్టిన చర్యలతో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇష్టానుసారంగా ప్రవేశాలు, ఫీజుల వసూలు తతంగానికి తెరపడనుంది. అనధికారికంగా హాస్టళ్ల నిర్వహణ, బోర్డు నిబంధనల ప్రకారం కాకుండా సొంత సిలబస్ బోధన, కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లో ఫీజుల వసూలు వంటి వ్యవహారాలు ఇక సాగవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో సంస్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల, ఉన్నత విద్యలకు సంబంధించి రెండు కమిషన్లను ప్రభుత్వం నియమించింది. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు దక్కేందుకు, నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పలు సంస్కరణలను ప్రారంభించింది. - ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు ప్రకటించే షెడ్యూల్‌ను ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు గతంలో ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించేవి. - నిబంధనల ప్రకారం కాలేజీల్లోని మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ తరగతులకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29%.. అందులోబీసీ–ఎకి 7%, బీసీ–బికి 10%, బీసీ–సికి 1%, బీసీ–డికి 7%, బీసీ–ఈకి 4% చొప్పున ఇవ్వాలి. ఇక దివ్యాంగులకు 3%, ఎన్సీసీ, స్పోర్ట్సు కోటా కింద 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% సీట్లు కేటాయించాలి. - ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయించాలి. - ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు నిర్దేశిత కోటాను పక్కనపెట్టి ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు చేపడుతున్న చర్యలతో వీటికి తెరపడనుంది. - వచ్చే విద్యాసంవత్సరం(2020–21) నుంచి ఇంటర్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానాన్ని(ఈ–అడ్మిషన్లు) ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల ఇంటర్మీడియెట్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది. మే–జూన్ నెలల్లో ఈ ప్రవేశాలుంటాయని స్పష్టం చేసింది. - ఆన్లైన్ విధానంతో ప్రతి ఇంటర్మీడియెట్ కాలేజీలోనూ ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తద్వారా నిరుపేద మెరిట్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. - ఈ–అడ్మిషన్ల విధానంలో ఇకపై అనుమతికి మించి విద్యార్థులను చేర్చుకోవడం సాధ్యం కాదు. - కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ప్రభుత్వం ఇటీవల జీఓ నం.57 జారీ చేసింది. - ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డేస్కాలర్స్ నుంచి ఏడాదికి రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాలి. కానీ, బడా కాలేజీలు రూ.లక్ష దాకా దండుకుంటున్నాయి. - ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి అధికంగా వసూలు చేస్తే సదరు కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. - ఏ కాలేజీలో ఎంత మేరకు ఫీజులు వసూలు చేయాలన్న విషయాన్ని ఇకపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించనుంది. - హాల్ టికెట్ల విషయంలో విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకొని, పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. - కాలేజీల కోసం అనుమతులు పొంది ఇతర కోచింగ్ క్లాస్‌లు నిర్వహించడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన పాఠ్యాంశాలను బోధించాల్సిందేనని ఆదేశించారు. -
ఇంటర్లో ఈ–అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2020–21) నుంచి ఆన్లైన్ ప్రవేశాల (ఈ–అడ్మిషన్లు) విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్య కళాశాలల్లో ఆటోమేటెడ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ (ఈ–అడ్మిషన్స్) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మే, జూన్ నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ముకుతాడు ఆన్లైన్లోనే ప్రవేశాలు కల్పిస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిర్దేశించిన రిజర్వేషన్లను ఈ కాలేజీలు అమలు చేయడం లేదు. బోర్డు అనుమతించిన సెక్షన్లకు మించి విద్యార్థులను చేర్చుకుం టున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డే స్వయంగా ఈ –అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించనుంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాలేజీల వారీగా నిర్ణయించే ఫీజులనూ ఈ ఆన్లైన్ అడ్మిషన్లకే అనుసంధానించి, విద్యార్థులు ఆ మేరకే చెల్లించేలా ఇంటర్ బోర్డు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇంటర్ బోర్డు పుస్తకాలను బోధించాల్సిందే కొన్ని కాలేజీలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన పాఠ్య పుస్తకాలను పట్టించుకోవడం లేదు. జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. ఇందుకోసం రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డు రూపొందించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు బోధించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
కోవిడ్ 19 ఎఫెక్ట్: విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతినిచ్చింది. కరోనా వైరస్ వ్యాపించకుండా పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతిచ్చింది. కాగా దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయించింది. (మైండ్ స్పేస్ ఖాళీ కాలేదు : సజ్జనార్) -
విద్యార్థులకు విషమ పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: తెల్లారితే ఇంటర్ పరీక్షలు.. అయినా ఆ కాలేజీ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. అడిగితే ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయి.. అంటూ యాజమాన్యం విద్యార్థులను మభ్య పెట్టింది. చివరికి ఇంటర్ బోర్డు అధికారులను కలసే వరకు అసలు విషయం తెలియలేదు. వారి నుంచి ఫీజులను వసూలు చేసిన యాజమాన్యం బోర్డుకు చెల్లించలేదని తెలిసింది. హైదరాబాద్ (కొత్తపేట)లోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు అసలు పరీక్షలకు ముందు మరో కఠిన పరీక్షనే ఎదుర్కొన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, మంగళవారం రాత్రి వరకు కూడా వారి హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రాలేదు. దీంతో వారంతా ఆం దోళన చెందుతూ ఇంటర్మీడియట్ బోర్డును సంప్రదించారు. స్పందించిన ఇంటర్ బోర్డు.. ఇటు విద్యార్థులకు హాల్‌టికెట్లు అందని విషయంపై తెలంగాణ ఇంటర్ బోర్డు వెంటనే స్పందించింది. విద్యార్థుల ఫీజు చెల్లించడం మర్చిపోయామని కొత్తపేటలోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం తెలిపిందని, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు అనుమతించామని బోర్డు తెలిపింది. 48 మంది విద్యార్థుల జాబితాతో మంగళవారం తమ వద్దకు కాలేజీ యాజమాన్యం వచ్చిందని బోర్డు వెల్లడించింది. వారి లో 11 మంది ఫస్టియర్ కాగా మిగిలిన వారు సెకండియర్ విద్యార్థులున్నారని తెలిపింది. మరో ఘటనలో హన్మకొండకు చెందిన బీఆర్ అంబేడ్కర్ వొకేషనల్ కాలేజీ కూడా మంగళవారం 30 మంది విద్యార్థుల జాబితాతో బోర్డును ఆశ్రయించింది. కాగా, వీరికి గత నెల 20నే ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు వీరిని థియరీ పరీక్షలకు అనుమతించినా ఫెయిల్ కిందే లెక్క.. అందుకే వీరిని మేలో జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవ్వాలని సూచించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన రెండు కాలేజీల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (మార్చి 4వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కాపీయింగ్‌కు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. మార్చి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 9,96,023 మంది, వొకేషనల్ విద్యార్థులు 69,133 మంది ఉన్నారు. ‘నో యువర్ సీట్’ సదుపాయం ఫీజులు పూర్తిగా చెల్లించకుంటే హాల్ టికెట్లు ఇవ్వబోమంటూ ప్రైవేట్ కాలేజీలు వేధిస్తున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులే ఇంటర్మీడియెట్ వెబ్సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని, పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసింది. ప్రిన్సిపాళ్ల సంతకంతో పని లేకుండా ఆ హాల్ టికెట్లతో వచ్చే విద్యార్థులందరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకొనేందుకు ‘యాప్’ సదుపాయాన్ని ఇదివరకే ఇంటర్ బోర్డు కల్పించింది. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఆ కేంద్రంలో వారి సీటు ఏ గదిలో ఉందో తెలుసుకొనేందుకు ‘నో యువర్ సీట్’ను ప్రవేశపెట్టింది. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పక్కనే ‘నో యువర్ సీట్’ ఆప్షన్ ఉంటుంది. ఈ సదుపాయం 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో నిఘా ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఇంటర్మీడియెట్ బోర్డు నుంచే ‘లైవ్ స్ట్రీమింగ్’తో పర్యవేక్షిస్తారు. ప్రతి జిల్లాలో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాల బండిళ్ల సీళ్లను సీసీ కెమెరాల ముందు మాత్రమే తెరవాలి. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లకు క్యూఆర్ కోడ్ ఈసారి విద్యార్థులకు హాల్ టికెట్ల కాపీలను ఇంటర్ బోర్డు నుంచి పంపించలేదు. వారు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్‌కు సంబంధిత లింకును పంపించారు. బోర్డు వెబ్‌సైట్‌లోని డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కూడా పుట్టిన తేదీ, రోల్ నంబర్‌ను నమోదు చేసి, హాల్‌టికెట్‌ను పొందవచ్చు. కాలేజీ లాగిన్‌లోనూ పొందవచ్చు. హాల్ టికెట్లకు ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్ జతచేశారు. ఈ కోడ్‌లో విద్యార్థి సమాచారం మొత్తం ఉంటుంది. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. -
పరీక్షలంటే భయమా?
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటే భయపడుతున్నారా? మీ భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సైకాలజిస్టులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సైకాలజిస్ట్ (7337225803 నంబర్)కు ఫోన్ చేసి తమ ఆందోళనను పోగొట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో మొదట ఒక సైకాలజిస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తర్వాత మరో ఐదుగురిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వీరంతా ఇప్పటినుంచి పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన తర్వాత దాదాపు 2 నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా చిత్రా రాచంద్రన్ మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు సమస్య కారణంగా ఆమె చెప్పిన అంశాలను కూడా చిత్రారాంచంద్రన్ వివరించారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్.. విద్యార్థులు 8.45 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాలని పేర్కొన్నారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ప్రతి విద్యార్థి 9 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటల కల్లా పరీక్ష కేంద్రంలో ఉండేలా చూసుకోవాలని, 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ‘సెంటర్ లొకేటర్’యాప్ ఉపయోగించుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, వీలైనంత ముందుగా పరీక్షకు బయల్దేరాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమ స్యలు, హాల్టికెట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తితే విద్యార్థులు నివృత్తి చేసుకునేందుకు బోర్డు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 040–24600110, 040–24732369 ఫోన్ నంబర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మెయిల్ ద్వారా కూడా (helpdesk_ie@telangana.gov.in) సంప్రదించొచ్చన్నారు. అయినా సమాధానం దొరక్కపోయినా, సంతృప్తి చెందకపోయినా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని, ఇందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం వెబ్‌సైట్‌ను (bigrs.telangana.gov.in) అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రత్యేకంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి వెబ్సైట్ (tsbie.cgg.gov.in) నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షలకు హాజరు కావొచ్చని, చీఫ్ సూపరింటెండెంట్లు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. 2,500 మంది స్టూడెంట్ కౌన్సెలర్లు.. పరీక్షల విషయంలో ఆందోళన చెందొద్దని, ప్రతి కాలేజీలో స్టూడెంట్ కౌన్సెలర్లు (మొత్తం 2,500 మంది) ఉన్నారని, వారి సహకారం తీసుకోవాలన్నారు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఓఎంఆర్ షీట్‌లోని విద్యార్థుల వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలని, పొరపాటేమైనా ఉంటే ఎగ్జామినర్ దృష్టికి, చీఫ్‌సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లవద్దని, పరీక్ష విధుల్లో ఉన్న అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లొద్దన్నారు. బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సీజీజీ సహకారం తీసుకున్నామని చెప్పారు. ప్రతి సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిల్ ఓపెన్ చేస్తారన్నారు. గతంలో జవాబు పత్రాల కరెక్షన్లో తప్పులు చేసిన వారికి జరిమానా విధించామని, ఈసారి వారికి డ్యూటీలు వేయలేదన్నారు. పరీక్షలకు హాజరయ్యే బాలికలను తనిఖీ చేసేందుకు మహిళా సిబ్బందిని నియమించామని, బురఖా ధరించే వారిని ప్రత్యేక గదిలో మహిళలే తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీజీజీ డైరెక్టర్ రాజేంద్ర నిమ్జే మాట్లాడుతూ.. ఈసారి పరీక్షల్లో ఓఎంఆర్, ఐసీఆర్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
ఆ కాలేజీలను మూసేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న జూనియర్ కాలేజీలను మూసేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా భవనాల్లో ఆ కాలేజీలను కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఆయా భవనాల్లో కాలేజీలను కొనసాగించకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పూర్తయ్యే విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని తెలిపారు. ఆయా కాలేజీలు నిబంధనలు పాటించని వైనంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారు చెప్పిన సమాధానం పట్ల బోర్డు సంతృప్తి చెందలేద న్నారు. అందుకే త్వరలోనే మూసివేత నోటీసులు ఇస్తామని తెలిపారు. మరోవైపు కావాలనుకుంటే ఆయా యాజమాన్యాలు ఆ కాలేజీలను ఇతర భవనాల్లోకి షిప్ట్ చేసుకోవచ్చని సూచించారు. అందుకోసం అఫిలియేషన్ దరఖాస్తుల సమయంలో కొత్త భవనాలకు సంబంధించి షిఫ్టింగ్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 18 కాలేజీలు, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 26 కాలేజీలు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలకు చెందిన 8 కాలేజీలు, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందిన 5 కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు 11 ఉన్నట్లు వెల్లడించారు. కాలేజీలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లను నియంత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామ ని చెప్పారు. ఒత్తిడిని అధిగమించేలా, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేలా విద్యార్థులకు హార్ట్ఫుల్నెస్ సొసైటీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. -
ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాలకు ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనుండగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బోర్డు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘టీఎస్‌బీఐఈ ఎం–సర్వీసెస్’యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, దానిద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల ముందే కేంద్రానికి వెళ్లి, తామున్న ప్రాంతం నుంచి ఎంత సమయంలో అక్కడికి చేరుకుంటామో యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్ అధికారిని నియమించామని తెలిపారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, 25,550 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 4,80,516 మంది మొదటి సంవత్సరం, 4,85,323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షకు హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. -
68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) లేకుండా నిర్వహిస్తున్న 68 కార్పొరేట్ కాలేజీలను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వాటిలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య కాలేజీలు 18 ఉన్నాయని తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా మూసివేత నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఇంటర్ పరీక్షలు అయ్యాక ఈ ఏడాది మార్చి 28 తర్వాత 68 కాలేజీల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షలు అవ్వగానే మార్చి 28 తర్వాత ఎన్ఓసీలు లేకుండా నడుపుతున్న కాలేజీలను మూసివేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. నారాయణ, శ్రీచైతన్య ఇతర విద్యా సంస్థలు ఎన్ఓసీ లేకుండా ఎన్ని కాలేజీలను నిర్వహిస్తున్నాయో, ఎన్ని కాలేజీలను అధికారులు తనిఖీలు చేశారో, ఆయా కాలేజీల్లో పరిస్థితులెలా ఉన్నాయో పూర్తి వివరాలతో ఏప్రిల్ 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. షోకాజ్ నోటీసుల జారీ అనేది కంటితుడుపు చర్యే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కాలేజీలకు నోటీసులు ఇచ్చాం..: ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకోడానికి వీలుకాదన్నారు. ఆ 68 కాలేజీలు తాత్కాలిక ఎన్వోసీలతో నడుపుతున్నాయని, ఇకపై అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు. షోకాజ్ నోటీసుకు స్పందించి వివరణ ఇస్తున్నాయని తెలిపారు. ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. వీరందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వమే అన్నీ చేయలేక..: ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్వోసీ లేని కాలేజీల్లోని విద్యార్థులు వారు చదివే కాలేజీలకు బదులుగా మరో కాలేజీలో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే మార్చి 28 తర్వాత నుంచే ఎన్ఓసీలు లేని 68 కాలేజీలను మూసేస్తామని పేర్కొన్నారు. -
'గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి'
సాక్షి, హైదరాబాద్ : గుర్తింపులేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. అయితే మార్చి 4నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా తాము షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని, అలాగే ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
ఇకపై ఇంటర్ కళాశాలల గుర్తింపు,అడ్మిషన్లకు ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యా సంస్థల్లో అక్రమాలకు చరమగీతం పాడుతూ విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు పడేలా పలు చర్యలను చేపట్టనుంది. ఆయా కళాశాలలకు గుర్తింపు, అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు ఇంతకుముందే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదముద్ర పడగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమల్లోకి తేనున్నారు. కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని గుర్తింపునకు అనుమతులు పొందుతున్నాయి. కేవలం కాగితాలపై నిర్ణీత సదుపాయాలు అన్నీ ఉన్నట్లు చూపుతున్నా వాస్తవానికి ఆయా కాలేజీల్లో అవేవీ ఉండడం లేదు. కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఒక కాలేజీకి, పరిమిత సెక్షన్లకు అనుమతులు తీసుకొని రెండు మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో పెట్టి బోధన సాగిస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నిర్ణీత రుసుములు కూడా చెల్లించకుండా పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటికి ముకుతాడు వేసేందుకు వీలుగా గుర్తింపు ప్రక్రియను ఇకపై ఆన్లైన్ చేయనున్నారు. ప్రతి కాలేజీ అనుమతి కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. కాలేజీ భవనం ఉన్న ప్రాంతంతోపాటు, తరగతి గదులు, దానికి అనుబంధంగా ఆటస్థలం, లైబ్రరీ, లేబొరేటరీ వంటి వసతులన్నిటినీ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియెట్ బోర్డు వీటిని జియోట్యాగింగ్ చేస్తుంది. కాలేజీ పేర్కొన్న స్థలంలో భవనం, ఆటస్థలం ఉన్నట్లు తేలితేనే గుర్తింపు వస్తుంది. కోచింగ్‌లకు కాలేజీలకు సంబంధం లేదు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ఇంటర్ పాఠ్యాంశాల బోధన తప్ప ఇతర కోచింగ్‌లకు ఆస్కారం లేకుండా బోర్డు చర్యలు చేపడుతోంది. కాలేజీలకు, కోచింగ్‌లకు సంబంధం లేదని ఇప్పటికే విద్యా శాఖ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అలాగే హాస్టళ్లలోని పరిస్థితులు దారుణంగా ఉంటున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా కొన్ని సంస్కరణలకు వీలుగా ప్రతిపాదనలు అందించింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు తమ ఇష్టానుసారం అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మహిళలకు నిర్ణీత కోటాలో సీట్లు కేటాయించాల్సి ఉన్నా వాటిని బేఖాతరు చేస్తున్నాయి. ఫీజులను కూడా కాకుండా ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. వీటికి ఇకపై చెక్ పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వసూళ్లను ఆన్లైన్లో నిర్వహించేలా ఇంటర్ బోర్డ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు నీట్, ఎంసెట్ తరహాలో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించనుంది. రాష్ట్రంలో బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీలు, వాటిలో సెక్షన్లు, కోర్సు గ్రూపుల సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్లో విద్యార్థులు,తల్లిదండ్రులకు తెలిసేలా ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. టెన్త్ పాసయ్యే విద్యార్థులు దీని ద్వారా తమ మండలం, జిల్లా, రాష్ట్రంలోని ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరాలనుకుంటారో ఆ మేరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆ విద్యార్థి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి కాలేజీలో సీటు ఆన్లైన్లో అలాట్ అవుతుంది. -
తెలుగులోనూ ఫిర్యాదుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుచేసిన ‘గ్రీవెన్సెస్ రిడ్రసెల్ సిస్టమ్’ అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను (http://bigrs. telangana.gov.in/) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ను రూపొందించింది. వారంలో తెలుగులోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. సెలవులు మొదలుకొని పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్లు, మెమోలు, ఫలి తాలు, వాటిల్లో దొర్లే పొరపాట్లు తదితర 36 రకాల ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఇతర సమస్యలను పేపరుపై రాసి అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి గడువు విధించింది. సమస్య పరిష్కారమైనదీ లేనిదీ విద్యార్థి తెలుసుకునేందుకు రిఫరెన్స్ నంబర్‌ను (విద్యార్థి మొబైల్‌కు పంపనుంది) ఇవ్వనుంది. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు రెండు మూడు రోజుల్లో మొబైల్ యాప్ తీసుకురానుంది. వెబ్సైట్లో విద్యార్థి తన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా వెబ్సైట్లోకి ఎంటర్ అయి ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థి తన ఫిర్యాదును అధికారులు పరిష్కరించలేదని భావిస్తే మళ్లీ ఆన్లైన్లోనే రెయిజ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఫేస్బుక్, వాట్సాప్, జీమెయిల్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు: సీఎస్ మార్చిలో జరిగే పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరు కానున్నారని, అందులో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్ స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వం విద్యార్థుల విషయంలో ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, బోర్డు అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో సమస్యలు వచ్చినా, ఫలితాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు దొర్లినా, విద్యార్థులకు ఎదురయ్యే ఏ ఇతర సమస్యలకు సంబంధించి అయినా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. గత పరీక్షల సమయంలో దొర్లిన తప్పులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు ఆన్లైన్లో చేసే ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించేలా, సంబంధిత సమాచారాన్ని సదరు విద్యార్థి మొబైల్ నంబరు/ఈమెయిల్ ఐడీకి పంపేలా ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లో ఫిర్యాదుల ద్వారా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. -
ప్రమాణాల్లేని కాలేజీలపై వేటే
సాక్షి, అమరావతి: ఇప్పటికే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇక ఇంటర్మీడియెట్ విద్యను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీలదే పెత్తనం. ప్రమాణాల మేరకు నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల సంఖ్య అంతంతమాత్రమే. కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కాలేజీల్లో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ రంగంలోని కొన్ని జూనియర్ కాలేజీలు ప్రమాణాలకు పాతరేసి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తేల్చింది. కనీస మౌలిక వసతులు ఉన్నా కూడా కొన్ని కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని గుర్తించింది. న్యాయ శాఖతో సంప్రదింపులు ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియెట్ బోర్డు చట్టంలో వెసులుబాటు లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కాలేజీల అనుమతులను రద్దు చేసేందుకు బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును చేపట్టారు. చట్టంలో ఎలాంటి సవరణలు తీసుకురావాలన్న దానిపై విద్యా శాఖ అధికారులు న్యాయ శాఖను సంప్రదిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్ తెలిపారు. చట్టంలో సవరణలకు వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుందని పేర్కొన్నారు. కనీస ప్రమాణాలు పాటించని 500 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పి.వి.రమేశ్ తెలిపారు. -
జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి కూడా సెంటర్ల జంబ్లింగ్ లేకుండానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవలే రావడం, విద్యా శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కూడా కొత్తవారే కావడంతో ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జంబ్లింగ్ అమలుకు మొదట్లో ఆలోచనలు చేసినా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న భావనలో బోర్డు వర్గాలు ఉన్నాయి. అందుకే 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు సాధ్యం కాదని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్ సాధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలోనే జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నా రాష్ట్రంలో 2,500 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో దాదాపు 10 లక్షల మంది చదువుతున్నారు. అందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉండగా, అందులో సైన్స్ కోర్సుల విద్యార్థులు 3 లక్షలకు పైగా ఉంటున్నారు. వారికి ప్రతి ఏటా సొంత కాలేజీల్లోనే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కారణంగా కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్ చేసి, తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30 మార్కులకు 30 మార్కులు వేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎప్పటి నుంచో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల ఏర్పాటులోనూ జంబ్లింగ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్ ఉంది. అయితే ప్రతి ఏటా బోర్డు అధికారులు మొదట్లో జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రకటించడం, ఆ తరువాత ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో జంబ్లింగ్ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడం కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామినర్లను మేనేజ్ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులను వేయించుకుంటున్నందున ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో 30కి 30 మార్కులను వేయడం లేదు. దీంతో వారు నష్టపోతున్నారు. అయితే ఈసారి ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ అమలుకు చర్యలు చేపడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల పేర్కొన్నారు. కానీ ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున జంబ్లింగ్ సా«ధ్యం కాదన్న భావనకు బోర్డు వర్గాలు వచ్చాయి. పైగా బోర్డు కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ జలీల్ కొత్తగా వచ్చినందునా, ఇప్పుడు ఆయన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంపైనే దృష్టి పెట్టారు. గతేడాది దొర్లిన పొరపాట్లు దొర్లకుండా హాల్‌టికెట్ల జనరేషన్ నుంచి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. -
మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 23 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు. ఒకేషనల్ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి. ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. -
1st తర్వాత సెకండే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఫ్లెక్లీ కోర్సు విధానం (మొదటి ఏడాది తరువాతే రెండో ఏడాది కచ్చితంగా చదవాల్సిన అవసరం లేకుండా) అమలుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం తరువాత కచ్చితంగా రెండో ఏడాది పూర్తి చేయాలి.ఈ నిబంధనను తొలగించే అంశంపై బోర్డు కసరత్తు చేస్తోంది.తొలి ఏడాది ముగిశాక విద్యార్థి మరేదైనా చదువుకొని మళ్లీ ద్వితీయ ఏడాది పూర్తి చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ విధానం విదేశాల్లో ఉండగా, దేశంలోని ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో మాత్రమే ఇది అమల్లో ఉంది. దీనివల్ల విద్యార్థులు కొంత కాలవ్యవధితో తమ చదువును కొనసాగించ వచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆయన వివిధ అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఒత్తిడి తగ్గించేందుకే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. గత నెల 30న నిర్వహించిన స్టూడెంట్ కౌన్సెలర్ల శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిఫుణులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లలో పాస్, ఫెయిల్ స్థానంలో క్లియర్, నాట్ క్లియర్ పదాలను తీసుకురావడం, ఫ్లెక్సీ విధానం అమలు వంటివి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.దేశ వ్యాప్తంగా పాస్, ఫెయిల్ విధానమే ఉంది. మన రాష్ట్రంలో దానిని తీసుకువస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయా అనే అంశాన్నీ చర్చించాల్సి ఉంది. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీకి ఈనెల 7న అధ్యయనానికి వెళ్తున్నాం. వచ్చాక నివేదికతోపాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తాం. వృత్తి విద్యా కోర్సుల్లో సమూల మార్పులు రాష్ట్రంలో వృత్తివిద్యను మార్పు చేయబోతున్నాం. ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెడతాం.వొకేషనల్ ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా చూస్తాం. ప్రస్తుతం సెంచూరియన్ యూనివర్సిటీలో 28 రకాల వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి రాష్ట్రంలో మార్పులు తీసుకువస్తాం. వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఈ మేరకు జిల్లా అధికారులకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. రెండు రోజుల్లో ఈ తరగతులు ప్రారంభమవుతాయి. కృతార్థులు కాని విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. బోర్డు వెబ్సైట్లో ఆడియో వీడియో పాఠాలు విద్యార్థుల కోసం బోర్డు వెబ్సైట్లో ఆడియో, వీడియో పాఠాలను ఉంచుతాం. ప్రభుత్వ , ప్రైవేటు కాలేజీల విద్యార్థులూ వాటిని చూసి నేర్చుకునేలా ఉంటాయి. ఇంగ్లిషు–తెలుగులో రూపొందించిన ఈ పాఠాలను (పాఠ్యాంశాల వారీగా) నిఫుణుల నుంచి తీసుకుంటున్నాం. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాల మార్పు గతేడాది ప్రథమ సంవత్సర పాఠ్య పుస్తకాలను మార్పు చేశాం. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరంలో మార్చుతున్నాం. వచ్చే ఏడాదినుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఈసారి ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేయం.. వచ్చే ఏడాదికి ఆలోచిస్తాం.ఇకపై పక్కాగా నిబంధనల ప్రకారం ఉన్న కళాశాలలకే అనుమతులు ఇస్తాం. ఈ ప్రక్రియనూ జనవరిలోనే ప్రారంభిస్తాం. -
ఇంటర్ ఇక లోకల్..!
పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ఓ శుభవార్త. ఇంటర్ చదువులకోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. సీటు వస్తుందోరాదోనన్న బెంగలేదు. వ్యయప్రయాసల కోర్చి పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పదోతరగతి చదువుకునే పాఠశాలలోనే నచ్చిన కోర్సులో ఇంట ర్ విద్యను బోధించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 500 మంది విద్యార్థులుండే పాఠశాలలను కళాశాలలుగా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదముద్రవేసింది. సాక్షి, విజయనగం : పేద, మధ్యతరగతి విద్యార్థులు చాలామంది పదో తరగతి తరువాత మధ్యంతరంగా చదువులను ఆపేస్తున్నారు. బాలికలను దూరంగా ఉన్న కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. చదువులకు బలవంతంగా దూరం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాసంకల్పయాత్రలో పలువురు సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. తల్లిదండ్రుల కోరిక మేరకు... ప్రభు త్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాఠశాలలోనే ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. విద్యావేత్తల సూచనల మేరకు 500 మంది పిల్లలుండే పాఠశాలల్లో తొలివిడతలో ఇంటర్ తరగతుల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళాశాల విద్య ఆరంభం కానుంది. ఈ మేరకు మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. 21 పాఠశాలల్లో... ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ 500 మం ది విద్యార్థులు చదువుతున్న పాఠశాలల వివరాలను సేకరించింది. యూ–డైస్ నివేదికలో విద్యార్థుల వివరాల నమోదు ఆధారంగా జిల్లాలో 21 పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి చదవుతున్నట్టు గుర్తించింది. ఈ పాఠశాలలు వచ్చే ఏడాది నుంచి కళాశాలలుగా మార్చేందుకు అర్హత పొందాయి. వీటిలో జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఉన్నవి 19, కార్పొరేషన్ పరిధిలో 3, ప్రైవేటు ఎయిడెడ్ 1, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉన్నాయి. కార్పొరేషన్‌కు చెందిన విజయనగరం నగరపాలక కస్పా ఉన్నత పాఠశాల, బీపీఎంహెచ్‌స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చీపురుపల్లి, రామభద్రపురం, మక్కువ, పూసపాటిరేగ, జా మి, బలిజిపేట, కుమరాం, జొన్నవలస, కొత్తవలస, మెట్టపల్లి, పార్వతీపురం, పాంచాలి, తెర్లాం, బుడతనాపల్లి, ధర్మవరం, బాడంగి, అలుగోలు, గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. వీటిలో కళాశాల విద్య బోధిస్తే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్ విద్య ఊరిబడిలోనే చదువుకోవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఇంటర్ విద్య ఇలా... ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను కలుపుకొని జిల్లాలో 184 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 21 వృత్తి విద్య కళాశాలలను మినహాయిస్తే 165 ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. 24 ప్రభుత్వ, 82 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ విద్యలో జూనియర్ కళాశాలలకు డిమాండ్ జిల్లాలో ఏళ్లుగా సాగుతోంది. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేపట్టాయి. అధికారులు వీటిపై పరిశీలించి పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో గుర్ల, గరుగుబిల్లి, బొండపల్లి, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల్లో డిమాండ్ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు పరిశీలించి ఫీజుబులిటీ ఉందని బోర్డుకు నివేదించారు. మూడేళ్లుగా ఈ ప్రతిపాదనలపై కదలిక లేదు. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి గత ప్రభుత్వం దత్తిరాజేరు, మెరకముడిదాంలో ఇంటర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. కార్యరూపం దాల్చడంతో సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు రుసుములు భారం తగ్గి ఉన్నత విద్యను అందుకునే వీలు కలిగింది. ఇంకో ఏడు కళాశాలల ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇంటి వద్దకే ఇంటర్ చదువు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులు ప్రవేశ పెట్టడం మంచి ఆలోచన. పదోతరగతి తరువాత ఆర్థిక భారంతో ఉన్నత చదువులు చదవలేని వారికి శుభపరిణామం. పదో తరగతి పాఠశాలలోనే ఇంటర్ చదువుకోవడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఉచితంగానే ఇంటి వద్దనే ఇంటర్ చదువుకోగల అవకాశం లభిస్తుంది. – టి.సన్యాసిరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయ సంఘం -
జూనియర్ కాలేజీల్లో కౌన్సెలర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపడుతోంది. చదువులో వెనుకబడి పోతున్నామన్న ఆందోళనతో ఆత్మన్యూనతా భావానికి గురయ్యే విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయిం చేలా, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేలా కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు చేపడు తోంది. ఇందుకోసం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కౌన్సెలర్లను నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బయట నుంచి కాకుండా కాలేజీల్లో బోధించే లెక్చరర్లలో ఒకరిని కౌన్సెలర్‌గా నియమించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 404 మంది లెక్చరర్లకు త్వరలోనే సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లెక్చరర్లు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ముందుగా ప్రభుత్వ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తరువాత ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేసేలా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సైకాలజిస్టుల ఆధ్వర్యంలో శిక్షణ పొందే లెక్చరర్లు కౌన్సెలర్లుగా నియమితులయ్యాక విద్యార్థులు ఒత్తిడి తట్టుకోవడం ఎలా అనే అంశాలతోపాటు పరీక్షల సూచనలు, సబ్జెక్టులను ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానిపై మెమరీ టిప్స్ కూడా నేర్పించనున్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో వీడియో లెక్చర్స్‌ను విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కాలేజీల్లో కలివిడిగా ఉండని విద్యార్థులను గుర్తించి వారు చదువులో ఎలా ఉన్నారన్న అంశాలను తొలుత పరిశీలించనున్నారు. వారు కలివిడిగా ఉండకపోవడానికి కారణాలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత విద్యార్థులందరికీ స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టి బాగా చదువుకునేలా అవగాహన కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సెకండియర్ విద్యార్థులు ఎవరైనా ఒకవేళ ఫస్టియర్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బాగా చదివే విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణను నవంబర్ 8 లేదా 9న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బోర్డు ప్రతి సబ్జెక్ట్‌లో స్పెషల్ కంటెంట్‌ను తయారు చేయించి వాటిని సీడీల్లో భద్రపరించింది. వాటిని త్వరలోనే అన్ని కాలేజీలకు పంపించనుంది. మరోవైపు ఆన్లైన్ పాఠాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కాలేజీల్లోని విద్యార్థులు ఒకేసారి పాఠాలు వినేలా చర్యలు చేపడుతోంది. -
కోచింగ్ బోర్డులను తక్షణమే తొలగించాలి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో కోచింగ్ బోర్డులను ఈ నెలాఖరు కల్లా తొలగించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవో గుంటుక రమణారావు స్పష్టం చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన వీటి విధి విధానాలపై వివరించారు. కళాశాల నేమ్ బోర్డుపై కేవలం కళాశాల పేరు, అనుమతి ఉన్న గ్రూపులు, విద్యార్థుల సంఖ్యను మాత్రమే ఉండాలి, నేమ్ బోర్డు తెలుపు రంగులోనూ, నీలం రంగులో అక్షరాలు ఉండాలని సూచించారు. పాత బొర్డులను తొలగించకపోతే మొదటి అపరాధ రుసుంగా రూ.10 వేలు, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయమై ఇటీవలి ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆదేశించినట్టు పేర్కొన్నారు. మార్కులు, గ్రేడింగ్ ప్రచారం చేస్తే చర్యలు ఇంటర్మీడియెట్ మార్కులు, గ్రేడింగులు ప్రచా రం చేస్తే చర్యలు తప్పవని ఆర్ఐవో తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు రూ.4,470 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలన్నారు. కళాశాలల్లో హాస్టళ్లు నిర్వహిస్తే అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇంటర్æ విద్యార్థులకు బోర్డు నిర్దేశించిన పరీక్ష ఫీజులు మాత్రమే వ సూలు చేయాలని, అదనంగా వసూలు చేస్తే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది. కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు. -
ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఎప్పటికైనా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ నిర్ణయమేదో ఇప్పుడే తీసుకోవాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరింత ఉత్సాహంగా పని చేస్తారని పేర్కొన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో కొద్దిగా అసంతృప్తితో ఉన్నా, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మేలు జరుగుతుందని విన్నవించారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు దూరం పెరగకుండా సీఎం జోక్యం చేసుకొని త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పీఆర్సీ అమలు, ఐఆర్ వంటి అంశాలను త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల విభజన, కొత్త పోస్టుల మంజూరు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. -
రేపు ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల సీడీని ఎట్టకేలకు ఇంటర్మీడియెట్ బోర్డు ఎంసెట్ కమిటీకి శుక్రవారం అందజేసింది. దీంతో ఎంసెట్ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఈ నెల 27న రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడి తరువాత సీడీని వెంటనే ఇంటర్ బోర్డు ఎంసెట్ కమిటీకి అందజేస్తుందని భావించినా సీడీని ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో ఎంసెట్ ఫలితాలు/ర్యాంకుల వెల్లడి ఆలస్యమైంది. తాజాగా శుక్రవారం సీడీని అందజేయడంతో వెంటనే ఫలితాల ప్రాసెస్‌ను ప్రారంభించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, గతంలోనే పాసైనా... రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను తీసుకొని వాటికి 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకుల ఖరారుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే ర్యాంకులను ఏ రోజున ప్రకటించాలన్న దానిపై శనివారం స్పష్టత వస్తుందని తెలిపారు. దీంతో వీలైతే ఆదివారం లేదంటే సోమవారం ఎంసెట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. గతనెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
తప్పెవరిది.. శిక్ష ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్లో భారీగా మార్కుల్లో తేడాలు బయటపడ్డాయి. మొదట ఫెయిలైన విద్యార్థులకు ఒక మార్కు నుంచి 49 మార్కుల వరకు పెరిగాయి. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులై, తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గరిష్టంగా 60 మార్కుల వరకు అదనంగా వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలు బయటపడ్డాయి. గ్లోబరీనా సంస్థ కారణంగా జరిగిన సాంకేతిక తప్పిదాలు, మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది తప్పిదాల కారణంగా జరిగిన ఈ తప్పులకు బోర్డు ఎవరిని బాధ్యులను చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రీవెరిఫికేషన్‌తో బయటపడిన మరిన్ని వైఫల్యాలు.. రీవెరిఫికేషన్‌తో మారిన మార్కులు ఇంటర్ బోర్డు వైఫల్యాలను బయటపెట్టింది. సాంకేతిక సమస్యలే కాదు.. మూల్యాంకన లోపాలు, లెక్కించడంలో సిబ్బంది చేసిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. వాస్తవంగా విద్యార్థులు రాసిన జవాబులకు, మెమోల్లో వచ్చిన మార్కులకు పొంతన లేకుండా తప్పిదాలు దొర్లాయి. రీవెరిఫికేషన్ తరువాత తమకు వచ్చిన మార్కులను చూసి విద్యార్థులే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులన్న అంశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పక్కన పడేసింది. మూల్యాంకనం చేసిన లెక్చరర్లు, మార్కులు లెక్కించిన సిబ్బంది, ఆన్లైన్లో ప్రాసెస్ తప్పులు చేసిన ఏజెన్సీ.. ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితిలో పడింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే వీలున్నా.. బోర్డు నిబంధనల ప్రకారం పేపర్ వ్యాల్యుయేషన్‌లో తప్పు చేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లేదంటే వారి మూల్యాంకనం విధుల నుంచి కనీసం రెండేళ్లపాటు బహిష్కరించవచ్చు. అలా చేస్తే భవిష్యత్‌లో జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనల్లో బోర్డు వర్గాలు ఉన్నాయి. ఇక సాంకేతిక తప్పిదాలకు కారణమైన డాటా ప్రాసెస్ చేసిన సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అన్నది ప్రశ్న. డాటా ప్రాసెస్‌లో పొరపాట్లు చేసిన సంస్థకు మూడేళ్లపాటు పనులను అప్పగించారు. ఇప్పుడు ముగియకుండా వారి టెండరును రద్దు చేసే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. ఇవీ లోపాలకు ఉదాహరణలు.. - ఇంటర్లో ఫెయిలైన వారికి పెరిగిన మార్కులు 1 నుంచి 48 కాగా, ఉత్తీర్ణులై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారికి గరిష్టంగా పెరిగిన మార్కులు 60. - ఫలితాల్లో ఒక విద్యార్థి మొదట ఫెయిల్ కాగా.. తరువాత వచ్చిన మార్కులు 91. - కామర్స్‌లో ఒక విద్యార్థికి మొదట వచ్చిన మార్కులు 12.. రీవెరిఫికేషన్ తరువాత లభించిన మార్కులు 62. - ఓ విద్యార్థికి సంస్కృతంలో మొదట వచ్చిన మార్కులు 5.. రీవెరిఫికేషన్లో వచ్చిన మార్కులు 50. - ఇంకో విద్యార్థికి తెలుగులో తొలిసారి వచ్చిన మార్కులు 18...తరువాత వచ్చినవి 41 మార్కులు. - ఆంగ్లంలో ఓ విద్యార్థికి 25 మార్కులొస్తే.. రీవెరిఫికేషన్లో లభించిన మార్కులు 43. - ఫెయిలైన విద్యార్థుల్లో ఒకరికి కెమిస్ట్రీలో మొదట వచ్చిన మార్కులు 15.. తరువాత లభించిన మార్కులు 25. -
రీవెరిఫికేషన్లో 1137మంది విద్యార్ధులు ఉత్తీర్ణత
-
ఇంటర్మీడియట్లో మరో 1,137 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్ కాగా, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది. 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను మినహా మిగతావారి జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో (http://bie.telangana.gov.in/)అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ స్కానింగ్ కాపీలను మంగళవారం ఉదయంలోగా వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. మిగిలిన 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలోనూ జవాబుపత్రాల పరిశీలన జరిపినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న 23 మందిలో 20 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైనట్టు తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులు అంతకుముందే ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. ఒక విద్యార్థి 3 పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆ మూడు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిందని వివరించింది. జూన్ 12 తర్వాత ఫీజు వెనక్కి... ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించిన 21,537 విద్యార్థుల ఫీజులను వచ్చే నెల 12వ తేదీ తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల అందరి జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగానే చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఫీజులను తిరిగి ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. తక్కువ మార్కులు వచ్చాయని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను మూడు రోజుల్లో తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది. కాగా, రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగి పాస్ అయిన విద్యార్థులే కాకుండా మొదట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగినా పాస్ కాని విద్యార్థులు వేలల్లో ఉంటారని తల్లిదండ్రులు అంటున్నారు. అలా ఎంతమందికి మార్కులు పెరిగాయో, వారి వివరాలను కూడా బోర్డు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంతమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయో తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు తాజా ఫలితాల వెల్లడిలోనూ కొంచెం గందరగోళం చోటుచేసుకుంది. ఫలితాల్లో కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లు రెండుమూడు సార్లు పునరావృతమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి