
ఇంటర్ మెమోల్లో ‘ఐ’ కోడ్!
ఇంటర్మీడియెట్ మెమో ల్లో భవిష్యత్తులో ‘ఐ’ కోడ్ రాబోతోంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో వినియోగిస్తున్న క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ తరహాలోనే ఐ కోడ్‌ను ఇంటర్ మెమోలపై ముద్రించేం దుకు ఆలోచనలు మొదలయ్యాయి.
నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి చర్యలు
వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచనలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మెమో ల్లో భవిష్యత్తులో ‘ఐ’ కోడ్ రాబోతోంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో వినియోగిస్తున్న క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ తరహాలోనే ఐ కోడ్‌ను ఇంటర్ మెమోలపై ముద్రించేం దుకు ఆలోచనలు మొదలయ్యాయి. ఫేక్ సర్టిఫికెట్ల నిరోధంలో భాగంగా ఐ కోడ్‌ను ముద్రించడం ద్వారా సెక్యూరిటీతోపాటు జెన్యూనిటీ వెరిఫికేషన్ సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో సర్టిఫికెట్ల జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం ఏ ఉద్యోగ సంస్థ కూడా ఇంటర్మీడియెట్ బోర్డును సంప్రదించాల్సిన అవసరమే ఉండదని పేర్కొంటున్నారు. జెన్యూనిటీ వెరిఫికేషన్ కావాలనుకునే సంస్థ.. మెమోపై ఒక మూలన ముద్రించే ఐకోడ్‌ను కోడ్ రీడర్ ద్వారా రీడ్ చేసి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. తద్వారా సదరు విద్యార్థివి ఒరిజినల్ సర్టిఫికెట్లేనా, కాదా అన్నది వెంటనే తెలిసిపోతుంది. వీలైతే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మెమో లపై ఐ కోడ్‌ను ముద్రించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లకు ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ల జెన్యూనిటీ కోసం వివిధ సంస్థలు ఇంటర్ బోర్డుకు లేఖ రాసి, అభ్యర్థిని పంపిస్తు న్నాయి. అయితే సదరు అభ్యర్థి నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం బోర్డు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీంతో ఒక్కోసారి ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ విధానాన్ని త్వరలో అమల్లోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
ఇది అమల్లోకి వస్తే ఉద్యోగ సంస్థ కానీ, మరేదైనా విద్యా సంస్థ గానీ అభ్యర్థి సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజు (ప్రస్తుత ఫీజు రూ.100) చెల్లిస్తే వారికి ఒక రెఫరెన్స్ కోడ్ వస్తుంది. సదరు సంస్థ ఆ కోడ్‌ను, విద్యార్థి వివరాలను ఎంటర్ చేస్తే ఒరిజినల్ మెమో ప్రత్యక్షం అవుతుంది. దాంతో అభ్యర్థి పెట్టిన మెమోలు ఒరిజినలా కాదా అన్నది తేలిపోతుంది. ఇంటర్ బోర్డు కూడా సదరు సంస్థకు మూడు రోజుల్లో వెరిఫికేషన్ వివరాలతో ఓ లేఖను పంపుతుంది.