రూ. 100 కోట్ల భూమికి ఎసరు.. ఎలా క‌నిపెట్టారంటే..? | Attempt to Grab Rs 100 Crore Government Land in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: రూ. 100 కోట్ల భూమికి ఎసరు!

Published Sun, Mar 16 2025 5:54 PM | Last Updated on Sun, Mar 16 2025 6:06 PM

Attempt to Grab Rs 100 Crore Government Land in Hyderabad

ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు

నకిలీ డాక్యుమెంట్ల సృష్టి

అప్రమత్తమైన యంత్రాంగం

పలువురిపై కేసు నమోదు

హైద‌రాబాద్‌: దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు పన్నిన పన్నాగాన్ని అధికారులు గుర్తించారు. స్థలాన్ని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులపై పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ (pet basheerabad police station)లో కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..

కుత్బుల్లాపూర్‌ (Quthbullapur) మండల పరిధిలోని సర్వేనెంబర్‌ 48లో యూఎల్‌సీ భూమి 5,800 గజాలు జీడిమెట్ల (Jeedimetla) పేట్‌ బషీరాబాద్‌ గ్రామ పరిధిలో ఉన్నట్లు పాత రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఓ ఎమ్మెల్సీ ప్రోద్బ‌లంతో కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి హెచ్‌ఎండీఏ (HMDA) నుంచి 15 ఫ్లోర్లకు అనుమతులు పొంది నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2001లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ అధికారులు నిర్వహించిన సర్వే మ్యాప్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం పరిశీలించి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌కు నివేదించారు.

సమగ్ర విచారణ జరిపించి అది యూఎల్‌సీ స్థలమే అని నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు రతన్‌ కుమార్, శ్రీనివాసరావు, శేఖర్‌ బాబు, వెంకట్రావు, సతీష్‌ బాబులతోపాటు జిష్ణు ఇన్ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు చేశారు.

ఈ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేశారు. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని స్వాదీనం చేసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువచేసే ఈ స్థలం కబ్జా కాకుండా జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఎట్టకేలకు విలువైన స్థలం ప్రభుత్వ సొంతం అయింది.

చ‌ద‌వండి: ఎల్‌ఆర్‌ఎస్‌తో ముప్పు తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement