అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం కల్పిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 2014 (టీడీపీ), 2018లో (టీఆర్‌ఎస్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా వివేకానంద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి టికెట్ రేసులో తానూ ఉన్నానని ఇప్పటికే తన అనుచరుల ద్వారా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సంకేతాలు పంపడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
సాక్షి, కుత్బుల్లాపూర్: ఇప్పటికే సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద అదే పార్టీకి చెందిన వ్యక్తి కావడం ఈ ఇద్దరి మధ్య గత సంవత్సర కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి తనకి టికెట్ వస్తుందనే ధీమాతో ఎమ్మెల్యే వివేకానంద ముందుకు సాగుతుండగా.. కాదు ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ శంభీపూర్ రాజుకు టికెట్ కన్‌ఫర్మ్ అంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు.
గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న శంభీపూర్ రాజు టికెట్ ఆశించి భంగ పడ్డాడు. 2023లో జరిగే ఎన్నికల్లో తనకు తప్పకుండా అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న పూర్తి నమ్మకంతో ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు.
ఎమ్మెల్సీకి మద్దతుగా కార్పొరేటర్లు..
అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, విజయశేఖర్‌గౌడ్‌లతో పాటు కార్పొరేటర్ల భర్తలు మహమ్మద్ రఫీ, సురేష్‌రెడ్డిలు ఇప్పటికే ఎమ్మెల్సీ రాజుకు పూర్తి మద్దతు పలికి ఆయన వెంట తిరుగుతున్నారు. పైన పేర్కొన్న కార్పొరేటర్లు సైతం సంవత్సర కాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
కౌన్సిలర్లకు టచ్‌లో ఉంటూ.. స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ..
ఇదే క్రమంలో కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రతిరోజు టచ్‌లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.అదే విధంగా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో సైతం కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతూ వస్తున్నారు.
కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ
అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంగా కొనసాగుతున్న ఇంటిని సైతం అద్దెకు తీసుకొని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించు
కున్నట్లు సమాచారం.
తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యే!
ఇదే క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద సైతం ద్వితీయ శ్రేణి నాయకులతో డివిజన్ అధ్యక్షులను కలుపుకుని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తారన్న పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఏది ఏమైనా ఈసారి టికెట్ విషయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment