KP Vivekananda
-
బండి సంజయ్ సీఎం రేవంత్‌కు కోవర్టు: కేపీ వివేకానంద
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా మారారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ మాట్లాడాడు. ఢిల్లీలో కుస్తీ గల్లిలో దోస్తీ కాంగ్రెస్, బీజేపీ పని. ఈ రెండు పార్టీలకు చెరో 8 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఇచ్చారు.. ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు?. కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారు బండి సంజయ్. ఎందుకు కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలి?. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసిఆర్ అరెస్ట్ చేయాలా?. ఈ నెల రెండో తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సుంకిశాల ప్రమాదం చిన్నదిగా చూపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆ కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదు ప్రభుత్వం’అని అన్నారు.బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనను మా కేడర్ మరిచిపోదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది’ అని అన్నారు. -
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్‌రెడ్డి, పి.శశిధర్‌రెడ్డి గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
ఇద్దరి చూపు అసెంబ్లీపైనే! నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం కల్పిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 2014 (టీడీపీ), 2018లో (టీఆర్ఎస్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా వివేకానంద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి టికెట్ రేసులో తానూ ఉన్నానని ఇప్పటికే తన అనుచరుల ద్వారా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సంకేతాలు పంపడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, కుత్బుల్లాపూర్: ఇప్పటికే సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద అదే పార్టీకి చెందిన వ్యక్తి కావడం ఈ ఇద్దరి మధ్య గత సంవత్సర కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి తనకి టికెట్ వస్తుందనే ధీమాతో ఎమ్మెల్యే వివేకానంద ముందుకు సాగుతుండగా.. కాదు ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ శంభీపూర్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ అంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న శంభీపూర్ రాజు టికెట్ ఆశించి భంగ పడ్డాడు. 2023లో జరిగే ఎన్నికల్లో తనకు తప్పకుండా అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న పూర్తి నమ్మకంతో ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. ఎమ్మెల్సీకి మద్దతుగా కార్పొరేటర్లు.. అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, విజయశేఖర్గౌడ్లతో పాటు కార్పొరేటర్ల భర్తలు మహమ్మద్ రఫీ, సురేష్‌రెడ్డిలు ఇప్పటికే ఎమ్మెల్సీ రాజుకు పూర్తి మద్దతు పలికి ఆయన వెంట తిరుగుతున్నారు. పైన పేర్కొన్న కార్పొరేటర్లు సైతం సంవత్సర కాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కౌన్సిలర్లకు టచ్‌లో ఉంటూ.. స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ.. ఇదే క్రమంలో కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రతిరోజు టచ్‌లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.అదే విధంగా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో సైతం కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతూ వస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంగా కొనసాగుతున్న ఇంటిని సైతం అద్దెకు తీసుకొని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించు కున్నట్లు సమాచారం. తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యే! ఇదే క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద సైతం ద్వితీయ శ్రేణి నాయకులతో డివిజన్ అధ్యక్షులను కలుపుకుని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తారన్న పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఏది ఏమైనా ఈసారి టికెట్ విషయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘ఫాక్స్ సాగర్ చెరువుపై వదంతులు నమ్మొద్దు’
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్ఎల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌తో కలిసి పరిశీలించారు. ఫాక్స్ సాగర్ చెరువు పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు వందేళ్ల తర్వాత ఫాక్స్ చెరువులోకి భారీగా నీరు వచ్చిందన్నారు. సర్ ప్లస్ నీటిని బయటకు పంపించేందుకు తూము గేట్లు ఓపెన్ చేస్తున్నామన్నారు. ఇందుకు గాను శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద పని చేసే అనుభవం గలా సిబ్బందితో పనులు చేయిస్తున్నామన్నారు. (చదవండి: ఎమ్మెల్యే వివేకానందపై వీఆర్ఓ ఫిర్యాదు) అభివృద్ధి పనుల్లో భాగంగా తాము గతంలో చేపట్టిన చెరువు మరమ్మతు పనులతో ఫాక్స్ చెరువు గట్టు దృఢంగా ఉందని అన్నారు. తూము గేట్లు తెరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. విడుదలైన నీటిని నాలలకు డైవర్ట్ చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కొంత మంది చెరువు కట్టకు గండి పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. సుభాష్ నగర్ డివిజన్లో భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం కావడంతో అక్కడ వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. (చదవండి: మీర్‌పేట చెరువుకు గండి..ఆందోళనలో స్థానికులు) ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజా, మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, గండిమైసమ్మ ఎమ్మార్వో భూపాల్, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీఆర్ నరసింహ రావు, పేట్ బషీరాబాద్ ఎస్ హెచ్ఓ రమేష్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
-
వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
అసమ్మతి తిరుగుబావుటా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు వచ్చినప్పుడే టీఆర్ఎస్లో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే, గులాబీ బాస్ మాత్రం ఎక్కడిక్కడ తాజా మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో గ్రేటర్‌లోని ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు తిరుగుబావుటా ఎగరేశాయి. మొదటి రెండు రోజుల్లో షాక్‌లో ఉన్న ఆశావహులు, తర్వాత తేరుకుని వేరు కుంపట్లకు రెడీ అయ్యారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం గ్రూపులు కట్టారు. తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇంతకాలం అధికారం చెలాయించిన తాజా మాజీలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆశించినవారు సైతం రెబెల్స్‌గా మారారు. దీంతో ఎవరిని బుజ్జగించాలో.. ఇంకెవరి స్థానాలు మార్చాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇదే అదునుగా ఇంతకాలం గుంభనంగా ఉన్నవారు సైతం తమకు ప్రజాబలం ఉందని.. తమకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం తమ వెంట వస్తారని కాంగ్రెస్, టీడీపీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు ఎటు వైపు..? కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. కుత్బుల్లాపూర్‌లో ఇప్పటి దాకా తెర చాటుగా ఉన్న గ్రూపు రాజకీయాలు బహిరంగ సమరానికి సై అంటున్నాయి. ఇక్కడి నుంచి తనకు టికెట్ ఇస్తే తన వెంట ముగ్గురు కార్పొరేటర్లు వస్తారని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్.. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలిసి విన్నవించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న పై ముగ్గురు జ్ఞానేశ్వర్ వెంట నడుస్తారా.. లేక పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం పనిచేస్తామని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగ్‌కు కార్పొరేటర్ల మధ్య దూరం.. తాజా మాజీ ఎమ్మెల్యేగా వివేకానంద్‌కు సీటు కేటాయించడంతో కార్పొరేటర్లు కనీసం వివేకానంద్‌ను కలిసేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ప్రకటన వెలవడగానే కేవలం రెండు, మూడు డివిజన్ల కార్యకర్తలు, కార్పొరేటర్లు మాత్రమే హంగామా చేశారు. తిరుగుబావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు మాత్రం వివేకానంద్‌ను కలవకుండానే వేరు కుంపటి పెట్టడం చర్చానీయాంశమైంది. ఇంతలోనే కాసాని విషయం వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్లో మరింత ఆందోళన మొదలైంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే సీఎం చెప్పిన విధంగానే సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వడంతో అటు కార్పొరేటర్లు, ఇటు గ్రామాల సర్పంచ్‌లు గ్రూపులు కట్టారు. శంభీపూర్‌కు టికెట్ ఇవ్వాలని తీర్మానం కుత్బుల్లాపూర్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్‌ను కోరాలని కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో సమావేశమైన వీరంతా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును నిలదీశారు. టికెట్ నీకేనని తామంతా ప్రచారం చేశామని, తీరా ఫలితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి, విజయ్‌శేఖర్‌గౌడ్‌తో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొని తమకు కేటీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విషయంపై తమ అభిప్రాయాన్ని ఆయనకు చెబుతామన్నారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్ట వద్దని, అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని రాజు చెప్పగా.. పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ రహస్య సమావేశం మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఎల్బీనగర్కు అసమ్మతి సెగలు అధికార టీఆర్ఎస్లో ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన అసమ్మతి నగరమంతటా విస్తరిస్తోంది. ఆదివారం ఎల్బీనగర్లో అభ్యర్థితో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్,రాజేంద్రనగర్‌లలో కార్పొరేటర్లే కేంద్రంగా అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా మేయర్ రాంమోహన్ పావులు కదుపుతున్నారు. ఇక అభ్యర్థులు ప్రకటించని ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సందిగ్దంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ను గోషామహల్ నుండి పోటీ చేయాల్సిందేనని పార్టీ ముఖ్యనేత హుకుం జారీ చేయడంతో ఆయన ఒకటి రెండు రోజుల్లో అక్కడ ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఖైరతాబాద్‌లో కార్పొరేటర్ విజయారెడ్డి – మన్నె గోవర్ధన్రెడ్డిలలో ఒకరికి టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని బృందం నాయినిని కలిసి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా అర్హుడని ఆయనకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా సీఎంను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. గోషామహల్లో ముస్లిమేతరులను అంగీకరించం బంజారాహిల్స్: ముస్లింలకు కనీసం పది సీట్లు కేటాయించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సాజిద్ అలీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన 105 స్థానాల్లో ముస్లింలకు కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని ఇది అన్యాయమన్నారు. గోషామహల్లో పోటీ చేసేందుకు దానం నాగేందర్‌ను బతిమిలాడుతున్నారని, ముఖేష్‌గౌడ్ చుట్టూ తిరుగుతున్నారని అయితే, ఇక్కడున్న ముస్లిం నేతలను వదిలేసి ఇతరులను బతిమిలాడాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో 90 వేల మంది ముస్లింలు ఉన్నారని, తనకు అవకాశమిస్తే గెలిచి చూపిస్తానన్నారు. ఎవరినో తీసుకొచ్చి తమపై రుద్దితే సహించమని హెచ్చరించారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ‘బొంతు’కు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన బంజారాహిల్స్: గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి టిక్కెట్ ఇవ్వాలంటూ కుషాయిగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని బొంతు నివాసం ముందు బైఠాయించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఉప్పల్‌ను రామ్మోహన్‌కు ఇవ్వకపోతే స్థానిక మహిళలెవరూ టీఆర్ఎస్ కోసం పనిచేయరని హెచ్చరించారు. అయితే, ఆందోళనచేస్తున్న సమయంలో మేయర్ తన ఇంట్లో లేరు. -
‘పగిడీలు చుడితే అధికారం వస్తుందా?’
సాక్షి, హైదరాబాద్: తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఆదరణను కాంగ్రెస్ నేతలు ఓసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్పందిస్తూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'కష్టపడే తత్వం ఉన్న నేతలు పార్టీని వదలరు'
హైదరాబాద్ : స్వతంత్రంగా ఎదగాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తమకు సూచించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానందా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కెపి వివేకానందా మాట్లాడుతూ... ఎదిగే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కష్టపడే తత్వం ఉన్న నేతలు టీడీపీని వదలరన్నారు. అధికార టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సాయన్న, తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీని వీడారని ఆరోపించారు. తాను కానీ మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ టీడీపీని వీడటం లేదని తెలిపారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఉందని విమర్శించారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ కేడర్‌లో గందరగోళం సృష్టించేందుకే టీఆర్ఎస్ అలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇప్పటికే కోరామని వివేకానందా తెలిపారు. -
ఎమ్మెల్యే తల్లి అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?
టీఎస్ఐఐసీ కమిషనర్ వివరణ కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తల్లి కె. శ్యామల అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం స్పందించింది. ఈ విషయంలో ఫిర్యాదు అందినా చర్యలు చేపట్టకపోవడంపై తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కమిషనర్ వివరణ కోరింది. తమ ముందు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్‌లోని సర్వే నంబర్లు 279 పార్ట్, 280 పార్ట్‌లలో స్థానిక శాసన సభ్యుడు కె.పి.వివేకానంద తల్లి కె.శ్యామల రోడ్డును ఆక్రమించుకోవడంపాటు నిబంధనలకు విరుద్ధంగా భవన సదుదాయాన్ని నిర్మించారని...వాటిని కూల్చేసేలా టీఎస్ఐఐసీని ఆదేశించాలంటూ పిటిషనర్ కె.ఎం.ప్రతాప్ వేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ కుమారుడు ఎమ్మెల్యే కావడంతో శ్యామల ప్రజలు ఉపయోగించే రోడ్డునే ఆక్రమించి, నిబంధనలను విరుద్ధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించారన్నారు. దీనిపై తన క్లయింట్ టీఎస్ఐఐసీ అధికారులకు ఫిర్యాదు చేసి (పారిశ్రామిక ప్రాంతం కావడంతో) సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా టీఎస్ఐఐసీ కమిషనర్ ఇవ్వలేదన్నారు. అలాగే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని...నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ వినతిపత్రాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని టీఎస్ఐఐసీ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు'
హైదరాబాద్: మంత్రి పదవుల కోసమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేత రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడుతున్నారని కుత్భుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి పోటీపడ మరీ రేవంత్ ను తిడుతున్నారని వాపోయారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై శాసనసభలో రేవంత్‌రెడ్డిని మాట్లాడనివ్వాలని కోరారు. కాగా, రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖండించారు.టీడీపీని ఎదుర్కొనే సత్తా లేకే అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రేవంత్ మాట్లాడితే వాస్తవాలు బయటికి వస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అన్నారు. అధికారపక్షమే పోడియంలోకి వచ్చి సభను వాయిదా వేయించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.