సమావేశంలో మాట్లాడుతున్న వివేకానంద. చిత్రంలో కౌశిక్‌రెడ్డి
స్పీకర్ ఆఫీసును సీఎం ప్రభావితం చేస్తున్నారు : బీఆర్‌ఎస్ నేతల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్‌ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్‌రెడ్డి, పి.శశిధర్‌రెడ్డి గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
► ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్‌రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు.
► బీఆర్‌ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు.
‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.
► 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment