సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్‌ఎస్‌లో కలకలం కనిపిస్తోంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మరోవైపు చాలా కాలం నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలు, కొత్తగా చేరినవారు, సీనియర్ల వారసులు.. అంతా ఒక్కసారిగా ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మళ్లీ బరిలో ఉండేందుకు సిట్టింగ్‌లు సిద్ధమవుతుంటే.. పోటీ అవకాశం కోసం మిగతావారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు చాలా మంది ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిణామాలు చాలా మంది నేతల్లో కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎక్కు వ మంది బలమైన నేతలున్న స్థానాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పారీ్టలతో కలిసి పనిచేస్తామని బీఆర్‌ఎస్ పెద్దలు సంకేతాలు ఇవ్వడంతో ఆ ప్రభావం ఏ మేర ఉంటుందనే చర్చ సాగుతోంది. మొత్తంగా ఎవరికి టికెట్ దక్కు తుంది? ఎవరికి ఎసరు వస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గుంభనంగా ఉంటూనే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో వర్తమాన రాజకీయాలు, రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాలు, ఎన్నికలు లక్ష్యంగా వాటి ఎత్తుగడలు తదితరాలపై లోతుగా లెక్కలు వేస్తున్నారు.
సిట్టింగ్‌లు వర్సెస్ ఆశావహులు
రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 సీట్లకుగాను బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 104 మంది సభ్యుల బలం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. 65 లక్షల మంది బీఆర్‌ఎస్ సభ్య త్వం కూడా తీసుకున్నారు. ఇలా శాసనసభలో, బయటా అత్యంత బలంగా ఉన్నా.. పలు సంస్థాగత లోపాలు, నేతల మధ్య ఆధిపత్య పోరు ఇబ్బందికరంగా మారాయి. రాజకీయ పునరేకీకరణ పేరిట బీఆర్‌ఎస్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో 40కిపైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
బహుళ నాయకత్వమున్న కొన్ని నియోజకవర్గాల్లో తమకు అవకాశం దక్కదని భావిస్తున్న నేతలు ఆందోళనలో పడ్డారు. ఇలాంటి వారిలో కొందరు సొంతదారి వెతుక్కోవాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక పలువురు కొత్త తరం నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయతి్నస్తున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు నేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు. వారు పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న సిట్టింగ్‌ల పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది.
ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రయత్నాలతో..
పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈసారి అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే దుబ్బాక బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా.. ఎంపీలు మాలోత్ కవిత, పి.రాములు, రంజిత్‌రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, శంభీపూర్ రాజు, పాడి కౌశిక్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ బరిలోకి దిగాలనే ఉత్సాహంతో ఉన్నారు.
పొత్తు, దోస్తీ ప్రభావంపైనా చర్చ
ఉభయ కమ్యూనిస్టు పారీ్టలతో పొత్తు ఉండదని, అవగాహన మాత్రమే ఉంటుందని బీఆర్‌ఎస్ నుంచి సంకేతాలు వస్తున్నా.. రాష్ట్రంలో మనుగడ కోసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం తప్పనిసరి అని వామపక్షాలు భావిస్తున్నాయి. మధిర, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడెం లేదా హుజూర్‌నగర్‌ను సీపీఎం.. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంతోపాటు మరికొన్ని అసెంబ్లీ సీట్లను సీపీఐ కోరే అవకాశం ఉందని అంచనా. ఇందులో మధిర మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం (మజ్లిస్) ఈసారి 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీని ప్రభావం బీఆర్‌ఎస్‌పై ఏమేర ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.
‘సైలెంట్’గా సిద్ధమవుతున్న కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈసారి కూడా గెలవాలని, దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన సీఎంగా రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. గుంభనంగా ఉంటూనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు ఇతర పార్టీల నాయకుల అనుకూలతలు, ప్రతికూలతలను మదింపు చేస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకసారి మాత్రమే పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు, ఒక్కసారి కూడా గెలవని సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు, బీజేపీ ఎంపీలున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మొత్తంగా సంస్థాగత లోపాలను చక్కదిద్దడంతోపాటు ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేసేందుకు త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment