168 సర్వే నంబర్ల భూముల క్రయవిక్రయాలకు బ్రేక్
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ ఒక్క పదం తెచ్చిన అవస్థలు
మూడు నెలలుగా కుత్బుల్లాపూర్‌లో పరిస్థితి ఇదీ
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి.
‘మరియు’కు బదులు ‘నుండి’
కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు.
చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!
వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్‌బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment