ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం ముట్టడి
కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలని డిమాండ్
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఫ్‌ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు.
ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్టు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్‌ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment