corporate colleges
-
సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఫ్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు. -
ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసి వాటిలో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీపప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు. టాపర్‌గా తహురా అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ రియాజ్ అలీ, షేక్ నూర్‌భాను కుమార్తె షేక్ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ♦ కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల జనరల్ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్‌గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్ విద్యార్థి నులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది. ♦ ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హెచ్.అజయ్ రాజు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్. కళ్యాణి ఎంఎల్‌టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి. ♦ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కులతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలల విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్ అదుర్స్.. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ సెకండియర్ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి. కేజీబీవీలు కేక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థి ని జి.విజయలక్ష్మి(ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో యు.మానస 495, కంప్యూటర్ సైన్స్‌లో ఎం.యమున 494, ఎస్.హజీరాభాను 490 మార్కులు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు. హైస్కూల్ ప్లస్‌ల్లో పెరిగిన ఉత్తీర్ణత రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్‌లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్‌గా.. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఆదిత్య ప్రతిభ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులు ఏడుగురు, 464 మార్కులు 20 మంది పొందారని పేర్కొన్నారు. బైపీసీలో 435, 434 మార్కులు, ఎంఈసీలో 489 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో 990, 989, బైపీసీలో 986, ఎంఈసీలో 978 మార్కులు పొంది తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, వైస్ చైర్మన్ సతీ‹Ùరెడ్డి, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, డైరెక్టర్లు గంగిరెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ మెయినా అభినందించారు. శ్రీచైతన్య విజయకేతనం విజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చింటు రేవతి రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు గాను టి.దివ్య రాష్ట్రస్థాయిలో 436 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో ఎ.వి.దుర్గామధులిక 1000 మార్కులకు గాను 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చారని తెలిపారు. అలాగే బైపీసీలో ఎస్.పావని 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించినట్లు చెప్పారు. శ్రీప్రకాష్ విజయభేరి తుని: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ ఏడాది విద్యార్థి ని టి.వెన్నెల 982/1000, డీడీ సాయి శ్రీనివాస్ 980/1000, బైపీసీలో కె.లాస్య నందిని 979/1000 మార్కులతో అగ్రస్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం డీవీఎల్ సాయి నిహారిక 464/470, ఎస్.మేఘన 463/470, బైపీసీలో జి.వర్షిణి 428/470 మార్కులు పొందారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అభినందించారు. నారాయణ జయకేతనం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను పి.మేఘన 467, కె.ప్రసన్న 466 మార్కులు పొందారని పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు 14 మంది సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 991, 991 టాప్ మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీలో 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. సత్తా చాటిన శశి ఉండ్రాజవరం: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శుక్రవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఎం.నవ్యశ్రీ 990, బి.పార్వతి, కె.లిఖిత 989 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కేఎస్ సాయి శివాని 987, ఎండీ అబ్దుల్ జాఫర్ 985 మార్కులు పొందారని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎం.లీలాకృష్ణారెడ్డి, డి.దుర్గా కౌసల్య 466, ఎస్కే ఇర్పాత్, బి.సహస్ర, బి.షన్మిత, టి.మనోజ్ఞ 465 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు టి.కీర్తి, పీవీ హసని, వి.ఖ్యాతి, ఎం.నిస్సి, సీహెచ్ తేజస్వి 435 మార్కులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. తిరుమల విద్యాసంస్థల ప్రభంజనం రాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 466 మార్కులు 12 మంది సాధించారని చెప్పారు. బైపీసీలో 440కి 436 మార్కులు నలుగురు తెచ్చుకున్నారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఇద్దరికి 990 మార్కులు వచ్చాయని తెలిపారు. బైపీసీలో 1000 మార్కులకు గాను నలుగురు 989 మార్కులు పొందారని నున్న తిరుమలరావు వివరించారు. ‘విజ్ఞాన్’ విజయభేరి చేబ్రోలు: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్స్ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.లీలావతి (989), జి.వైశాలి (988), ఎం.స్నేహ (987), ఎస్కే.మీరావలి (987), కె.వంశీక్రిష్ణ (987), టి.సంజయ్ తేజ (986), సీహెచ్ మనస్వి (986), టి.సంజయ్ తేజ (986) మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వి.కౌశిక్ (466), జీవీఏ తేజస్వి(464), వై.పార్థసారథి(464), జె.హేమంత్ సందీప్(464), కె.విష్ణువర్ధన్(464), ఆర్.శ్రీకాంత్(464), ఎం.అఖిలేష్ (464), ఎం.హర్ష వర్ధన్(464) మార్కులు సాధించారని చెప్పారు. సత్తా చాటిన భాష్యం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం. హేమ ప్రియ హాసిని, జి సాయి మనోజ్ఞ 470 మార్కులకు 466 సాధించారని పేర్కొన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో జి.చంద్రలేఖ్య వెయ్యి మార్కులకు గాను 990 మార్కులు, బి.అభిజ్ఞ, ఎం.లహరి పి.సాయి మనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించినట్లు చెప్పారు. జూనియర్ బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థులు ఎల్.నవ్య, షేక్ నసీమా 440కి 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సీనియర్ బైపీసీలో ఎం.హాసిని లాలిత్య, ఇంటూరి యోషిత వెయ్యి మార్కులకు 985, శ్రీషా 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. శ్రీగోసలైట్స్ విద్యార్థుల ప్రతిభ భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ని ఆలూరు కిరణ్మయి 990/1000 మార్క్‌లతో రాష్ట్రంలో సెకండ్ టాప్, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి ని ఇంజమూరి హరిచందన 435/440 మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్‌లో, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గోసలైట్స్ చైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. శ్రీవిశ్వశాంతి విజయం భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిశ్వశాంతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా 988, 984, 984, 982, 982, 981 మార్కులను సాధించారు. అదే విధంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 465, 464, 464, 463, 463, 463, 463, 462, 462, 462, 462, 462 మార్కులు పొందారు. ఈ ఘన విజయాలు సాధించిన విద్యార్థులను శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డైరెక్టర్ మాదల సూర్యశేఖర్ అభినందించారు. -
నోటికొచ్చిందే ఫీజు!
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుమారుడు ధీరజ్ ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ధీరజ్‌ను ఇంటర్మీడియట్లో చేర్చేందుకు శ్రీనివాస్ ఎల్బీనగర్ వైపున్న ఓ కార్పొరేట్ కాలేజీని (రెసిడెన్షియల్) సంప్రదించారు. ఏడాదికి రూ.2.10 లక్షల ఫీజు అని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. చేసేదేం లేక సమీపంలోని మరో కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన కాలేజీలో సంప్రదించారు. అక్కడ ఏడాదికి రూ.2.20 లక్షలని చెప్పడంతో అవాక్కయ్యారు. డిసెంబర్, జనవరి సమయంలోనే వస్తే రూ.1.90 లక్షలకే సీటు ఇచ్చేవారమని, ఇప్పుడు సీట్లు నిండిపోతుండటంతో ఫీజు పెరిగిందని సదరు కళాశాలల సిబ్బంది చెప్పడం గమనార్హం. కరీంనగర్ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం సింగరేణిలో చిన్న ఉద్యోగి. తన కుమార్తె మీనాక్షి కోసం షామీర్పేట ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో సంప్రదించగా.. ఫస్టియర్‌కు రూ.2.40 లక్షలు, సెకండియర్‌కు రూ.2.60 లక్షలు ఫీజు ఉందని చెప్పారు. ఆలోచించుకొని రెండు రోజుల్లో వస్తానని సుబ్రమణ్యం చెప్పివచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లేసరికి సీట్లు లేవన్నారు. వస్తానని చెప్పాను కదా ఎలాగైనా సీటు కావాలని కోరగా.. సిబ్బంది సార్‌తో మాట్లాడతామని చెప్పి వెళ్లారు. కాసేపటికి వచ్చి ఫస్టియర్‌కు రూ.2.60 లక్షలు, సెకండియర్‌కు రూ.2.80 లక్షలు ఫీజుకు ఓకే అంటే సీటు ఇస్తామని తెగేసి చెప్పారు. -సాక్షి ప్రతినిధి, నల్లగొండ .. ఇది ఆ రెండు, మూడు కాలేజీల్లోనో, ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రుల పరిస్థితి మాత్రమేనో కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రముఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల బాగోతం, లక్షల కొద్దీ ఫీజులు కట్టడం కోసం సతమతం అవుతున్న తల్లిదండ్రుల ఆందోళన. ఆశనే బలహీనతగా మార్చుకొని.. ఫలానా కాలేజీలోని ఫలానా బ్రాంచీలో ఇంటర్మీడియట్ చదివిస్తే జేఈఈలో, ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వస్తాయని.. తద్వారా బీటెక్ సీటు మంచి కాలేజీలో వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆశను కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయి. నోటికే వచ్చిందే ఫీజు అన్నట్టుగా అడ్డగోలుగా నిర్ణయించి, రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి. అసలు పదో తరగతి పరీక్షలైనా జరగకముందే.. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసి, అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అడిగేవారు లేరని, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడమే లేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోనే అత్యధిక కాలేజీలు రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ శాఖల పరిధిలోని 850 వరకు ఉన్న గురుకుల కాలేజీలతోపాటు 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఐదు కార్పొరేట్, ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే 300 వరకు ఉండగా.. వీటిలో 220 కాలేజీల దాకా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్ చదివే దాదాపు 5లక్షల మంది విద్యార్థుల్లో సగం మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఆయా కాలేజీల్లో చదివిస్తే తమ పిల్లలకు మంచి చదువు వస్తుందని, మంచి ర్యాంకు వస్తుందన్న ఆశలతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజు విధానం ఊసే లేక.. ఇంటర్ బోర్డు నిర్ణీత ఫీజుల విధానాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు నిర్ణయించిన ఫీజు రూ.3 వేలలోపే. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం సాధారణ ప్రైవేటు కాలేజీలు స్థాయిని బట్టి రూ.20 వేల వరకు వసూలు చేస్తుండగా.. కార్పొరేట్ కాలేజీలు హాస్టల్ వసతి కలుపుకొని రూ.1.50 లక్షల నుంచి రూ.2.70 లక్షలవరకు తీసుకుంటున్నాయి. 2009లో లవ్ అగర్వాల్ ఇంటర్ విద్య కమిషనర్‌గా ఉన్న సమయంలో ఫీజుల విధానానికి చర్యలు చేపట్టినా ముందుకు సాగలేదు. 2013లో ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ కమిటీ.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా రూ.3,500, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.6,500 ఫీజు నిర్ణయించాలని సూచించింది. ఆ సిఫార్సులు ఆచరణలోకి రాలేదు. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా ఇంటర్మీడియట్ ఫీజుల విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదు. -
చెలరేగిపోతున్న కార్పొరేట్ కళాశాలలు ..అధికంగా ఫీజుల వసూలు
హితేష్ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ‘చైనా’ బ్యాచ్ అని, 24 గంటలూ ఏసీ అని రూ.90 వేలు ఫీజు కట్టించుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.15 వేలు వసూలు చేశారు. హాస్టల్‌కు నెలకు రూ.5 వేల చొప్పున కట్టించుకున్నారు. నారాయణ కళాశాలలో నర్మద అనే విద్యార్థినికి ఐఐటీ కోచింగ్ పేరుతో ఏడాదికి రూ.75 వేలు, హాస్టల్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున కట్టాలని చెప్పారు. పుస్తకాలు, ప్రాక్టికల్స్ పేరుతో మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేశారు. తలకు మించిన భారం కావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నారాయణ కళాశాలలో టీసీ తీసుకుని.. కూతురిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్చారు. నారాయణ విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేయడానికి పీఆర్వోలను నియమించుకున్నారు. ముందుగా చేరితే ఫీజుల రాయితీ ఇస్తామని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జెడ్ఎఫ్బీ, ఎన్120, కోస్పార్క్ అని ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్టడీ మెటీరియల్‌పై అమాంతంగా ఫీజులు పెంచుతున్నారు. అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఇటీవల కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఫీజు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫీజు కట్టలేదని అందరి ముందు అవమానించడం, క్యాంపస్ బయట నిల్చోబెట్టడం, రికార్డులు, హాల్‌టికెట్లు ఇవ్వబోమని బెదిరించడం కార్పొరేట్ కళాశాలల్లో షరామామూలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవ్యశ్రీ లాంటి విద్యార్థినులు ఎంతోమంది అర్ధంతరంగా చదువులు మానేయడం.. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. అనంతపురం: కార్పొరేట్ కళాశాలలు అడ్డగోలు సంపాదనకు తెరలేపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు, వసూళ్ల కోసం వేధింపులు పరాకాష్టకు చేరుతున్నాయి. సూపర్ –20, ఐఐటీ తదితర కోర్సుల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తూ తల్లిదండ్రులపై విపరీతమైన భారం మోపుతున్నారు. విద్యార్థుల్లోనూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. దీని నుంచి విద్యార్థులు బయటపడలేక అర్ధంతరంగా చదువు మానేయడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తోంది. కళాశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.60 వేలట! నారాయణ కళాశాలలో ఒక్కో విద్యార్థికి హాస్టల్ ఫీజు రూ.60 వేలుగా నిర్ధారించారు. నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తూ ఒక్కో గదిలో 10 మందిని కేటాయించారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదే విషయం ఇటీవల తనిఖీలో వెలుగు చూడటంతో జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు. ఒక్కో విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లో ఫీజు రూ.20 వేలు దాటకూడదు. కానీ కార్పొరేట్ కళాశాలలు రూ.65 వేల నుంచి రూ.80 వేల దాకా వసూలు చేస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉన్నప్పటికీ సొంత మెటీరియల్ పేరుతో మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికి హాస్టల్ ఫీజు, కళాశాల ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అంత డబ్బు చెల్లించుకోలేని వారు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారు. అన్నీ అద్దె భవనాలే.. నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఏ ఒక్క బ్రాంచ్‌కూ సొంత భవనాలు ఉండవు. అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హవా నడిచినన్నాళ్లూ తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేసి.. అద్దె భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుననే ఎత్తుగడతోనే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదించాం నారాయణ కళాశాల ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ సురేష్‌బాబు, ఆర్ఐఓ, అనంతపురం -
కళాశాలలకు కార్పొరేట్ కళ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళను సంతరించుకోనున్నాయి. నాడు–నేడు పనులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులకు కార్పొరేట్ సొబగులు అద్దిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలలపై దృష్టి సారించింది. డిసెంబరు నాటికి పూర్తి స్థాయిలో సకల వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. జిల్లాలో తొలి విడతలో 1,059, రెండో విడతలో 1,112 పాఠశాలలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కళాశాలల్లో 9 రకాల వసతులను కల్పించనున్నారు. వీటి అభివృద్ధికి రూ.13.44 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభించి డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధునిక వసతులు ఏర్పాటు కానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 రకాల వసతుల ఏర్పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 9 రకాల వసతులు కలి్పంచనున్నారు. అవసరమైన కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, మేజర్, మైనర్ రిపేర్స్, రన్నింగ్ వాటర్, ఆర్వో ప్లాంట్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ పనులు, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, బెంచీలు, టేబుల్స్, గ్రీన్ చాక్బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్ వాల్ తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగం అధికారులు కళాశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ప్రతిపాదనల మేరకు తీర్మానాలు చేశారు. వీటికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆమోదముద్ర వేశారు. డిసెంబరు నాటికి పూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో తొలుత ఆయా కళాశాలలకు 15 శాతం నిధులు విడుదల చేయనున్నారు. పనులు ఆయా కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. నాడు–నేడు పనులు పూర్తతే కళాశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. – ఎ. శ్రీనివాసులు, డీవీఈఓ 22 కళాశాలల ఎంపిక జిల్లాలో మొత్తం 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 25 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ప్రస్తుతం నాడు–నేడుకు జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు ఎంపిక చేశారు. వీటి అభివృద్ధికి రూ.13,44,95,539 ని«ధులు మంజూరు చేశారు. -
ప్రాణాలు తీస్తున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: అడ్డూ అదుపూ లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. మాదాపూర్‌లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్‌కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి కార్పొరేట్ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. – ప్రవీణ్‌రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు.. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. – టి. నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాలే.. ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో : కరోనా కష్టకాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ముందస్తు ఫీజుల పేరిట బాదుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టి పట్టుమని పదిరోజులు గడవక ముందే ఫీజుల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి. పదో తరగతి పరీక్షల కంటే ముందే ఇంటర్మీడియట్లో సీటు బుకింగ్ రిజర్వ్డ్ పేరిట అడ్మిషన్ల సంఖ్యను పూర్తి చేసుకున్న కార్పొరేట్ కాలేజీలు.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు ప్రారంభించాయి. వాస్తవంగా పదో తరగతి పరీక్షలు రద్దయినా గ్రేడింగ్ ఇంకా వెలువడలేదు. కానీ.. కార్పొరేట్ కాలేజీలు సీటు రిజర్వ్డ్ చేసుకున్న విద్యార్థుల సెల్ఫోన్లకు ఆన్లైన్ ఐడీ పంపించి గత నెల 29 నుంచే ఆన్లైన్ బోధన సాగిస్తున్నాయి. కోర్సు ఫీజులో ముందస్తుగా రూ.20 వేలు, పాఠ్యపుస్తకాల కోసం మరో రూ.10 వేలు చెల్లించాలని విద్యార్థుల పేరెంట్స్ సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. సోమవారం నుంచి ఫీజు వసూలు కౌంటర్లు తెరిచి ఉంటాయని సమాచారం అందించాయి. తక్షణమే చెల్లించడంతో పాటు పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసేలా విద్యార్థులపై ఒత్తిళ్లకు దిగుతున్నాయి. ఆది నుంచీ అదే వైఖరి.. చదువుల కోసం ఆది నుంచీ కార్పొరేట్ కాలేజీల బాదుడు మొదలవుతోంది. సీటు రిజర్వ్డ్ పేరిట రూ.2000, దరఖాస్తు ఫారం పేరిట రూ 300 వసూలు సర్వసాధారణమైంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కోర్సును బట్టి రూ.70 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే కార్పొరేట్ విద్యా సంస్థలో పదో తరగతి చదివి ఉంటే మాత్రం కన్వర్షన్ పేరిట కొంత ఫీజులో తగ్గింపు ఇస్తున్నా.. మిగిలిన వారికి మాత్రం ఇష్టానుసారం ముక్కుపిండి వసూలు చేయడం మామూలుగా మారింది. అది కూడా రెండు మూడు విడతల్లోనే పూర్తి ఫీజు చెల్లించే విధంగా కార్పొరేట్ విద్యా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న కారణంగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యా సంవత్సరానికి ముందే ఆన్లైన్ తరగతులు ప్రారంభమైనా విద్యాశాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురి చేస్తోంది. చెల్లింపులన్నీ నగదు రూపంలోనే.. వైరస్ కట్టడిలో భాగంగా నగదు కాకుండా డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపడం మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం నగదు చెల్లింపు మాత్రమే అంగీకరిస్తామంటున్నాయి. కనీసం సీటు రిజర్వ్డ్ దరఖాస్తుకు చెల్లించే ఫీజునూ నగదు రూపంలోనే తీసుకోవడం విస్మయపరుస్తోంది. తాజాగా ఫీజులు, పాఠ్యపుస్తకాలకూ నగదు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు'
నవీన్‌చంద్ అనే విద్యార్థి విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో 2019–20లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో చేరాడు. హాస్టల్, కాలేజీ ఫీజులన్నీ కలిపి రూ.1.70 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు సెకండియర్‌కు వచ్చేసరికి ఆ ఫీజు రూ.2 లక్షలకు పెరిగింది. వంశీకృష్ణ విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి. గత ఏడాది ఫస్టియర్ ఫీజు రూ.1.80 లక్షలు. ఈ ఏడాది సెకండియర్‌లో అది కాస్తా 2.30 లక్షలకు పెరిగింది. లైబ్రరీ, ల్యాబ్, బుక్స్ కోసం అదనంగా డబ్బు వసూలు చేశారు. హాస్టల్లో ఉండే వారికి దోబీ చార్జీల కింద రూ.7 వేల వరకు వీటికి అదనం. కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవనప్పుడు ఇంతలా ఫీజులు అన్యాయం అని తల్లిదండ్రులు అడిగితే, నచ్చితేనే మీ పిల్లాడిని ఉంచండి.. లేదంటే తీసుకుపోండి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించమని చెప్పింది కదా.. అంటే మాకు హెడ్డాఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కనుక పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ కాలేజీల సిబ్బంది సమాధానమిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ కాలేజీల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలోని పరిస్థితులపై చేపట్టిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున గత ఏడాది ఫీజులను 30 శాతం మేర తగ్గించి, మిగతా మొత్తం మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు దీన్ని అమలు చేయడం లేదని కమిషన్ సభ్యుల పరిశీలనలో తేలింది. ఫీజులు తగ్గించకపోగా కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా భారీగా పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఫీజులు పెంచి ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు డ్రామాలకు తెర తీశాయి. కొన్ని ఏడాదికి కొంత మంది నుంచి 1.50 లక్షలు తీసుకొంటే, మరికొంత మంది నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయ శారదా రెడ్డి వెల్లడించారు. వసూళ్లకు లెక్కాపత్రాల్లేవు ► ఆయా కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కడా లెక్క పత్రాలు, ఫీజుల వివరాలు, అకౌంట్సు బుక్స్ ఆ విద్యా సంస్థల్లో ఉండడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆ ఫీజులో దేనికెంత అనే వివరాలు లేవు. ► ఆయా సంస్థల్లో పరిశీలనకు వెళ్తున్న కమిషన్ బృందాలు ఫీజులు, ఇతర వివరాల రికార్డుల గురించి అడిగితే అవన్నీ సెంట్రల్ ఆఫీసులో ఉంటాయని, కేవలం తాము అకడమిక్ వ్యవహారాలే చూస్తామంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కమిషన్ బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు అకౌంట్సు సిబ్బందిని అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఫీజుల లెక్కలు చూపకుండా తప్పించుకుంటున్నాయి. ► కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవలేదు. పాఠాల బోధన లేనేలేదు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తగ్గాయి. అయినా సరే కాలేజీలు గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల కోసం ప్రతి విద్యార్థికి నెలకు రూ.10 వేలు ఖర్చంటూ లెక్క చెబుతున్నాయి. ఈ ఏడాదిలో సెకండియర్లోకి వచ్చిన విద్యార్థుల ఫీజులను భారీగా పెంచాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగడం, విద్యార్థులను తీసుకుపొమ్మని చెబుతుండడంతో పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోంది. ల్యాబ్‌లు, లేబ్రరీలు లేకున్నా అదనపు ఫీజులు ► ఇటీవల కమిషన్ బృందాలు వరుసగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాయి. కాలేజీల్లో లైబ్రరీ, ల్యాబ్ వంటి వసతులు లేకపోయినా వాటి పేరిట అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ► హాస్టళ్లలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయినా హాస్టల్ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. గతంలో ఒక్కో గదిలో ఆరుగురు విద్యార్థులను ఉంచే వారమని, ఇప్పుడు ముగ్గురు లేదా నలుగురినే ఉంచుతున్నందున అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ► హాస్టళ్లలో పిల్లలకు సరైన సదుపాయాలు కూడా లేవని కమిషన్ తనిఖీల్లో బయట పడింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో వాటిని తినలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క కరోనాతో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్లోని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రుద్దుడే.. ► కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలతో విద్యార్థుల చదువులు తాపీగా సాగాయి. కాలేజీలు, హాస్టళ్లను తెరచిన యాజమాన్యాలు సిలబస్‌ను పూర్తి చేసేందుకు తొందర తొందరగా బోధన సాగిస్తున్నాయి. పిల్లలకు అర్థమవుతోందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. ► ఉదయం ఏడు గంటల నుంచి తరగతులు ప్రారంభించి.. రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెబుతున్నారని, లంచ్ ఇతర విరామ సమయాలు కొద్ది నిముషాలు కూడా ఉండడం లేదని విద్యార్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తెచ్చారు. స్టడీ అవర్‌లో కనీసం మూత్ర విసర్జనకూ అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కరోనా సమయంలో కార్పొరేట్ కాలేజీలు అనేక మంది సిబ్బందిని తొలగించాయి. వారికి వేతనాలు కూడా చెల్లించలేదు. గత్యంతరం లేక వారంతా వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పుడు కాలేజీలు తెరచినా వారెవ్వరూ తిరిగి రాక యాజమాన్యాలు అరకొర సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. ► పలు కాలేజీల్లో సరైన బోధనా సిబ్బంది కూడా లేరు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కాకుండా, వారు రూపొందించిన మెటీరియల్‌తో బోధన సాగిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా వారికి ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వం సూచించినా ఏ ఒక్క యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. ► 30 మంది పట్టే తరగతి గదిలో ఏకంగా 80 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న దృశ్యాలు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో మామూలైపోయింది. దీంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ: మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలిపారు. ఇప్పటివరకు 360 విద్యాసంస్థలు తనిఖీ చేశామని.. 50 కాలేజీలు, 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) ప్రభుత్వాదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు.అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి. అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 91502 81111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు. చదవండి: కదిలిన సంక్షేమ రథ చక్రాలు -
కార్పొరేట్ కక్కుర్తి..!
శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కూతురును ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో రూ. 1.2 లక్షల ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. ఈ నెలాఖరులోగా మిగతా ఫీజు చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీల్లో ప్రత్యక్ష బోధన లేదు.. ప్రాక్టికల్స్ లేవు. అయినా మొత్తం ఫీజు చెల్లించాలనడంతో గత్యంతరం లేక తన కూతురు భవిష్యత్తు కోసం అప్పు వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయి. రాయితీ ఇస్తామని ఆశపెట్టడం లేదా పిల్లలకు పాఠాలు చెప్పబోమని బెదిరించి మొత్తం ఫీజును వసూలు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష బోధన, ప్రాక్టికల్స్ లేకపోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. యాజమాన్యాలు చెప్పినంత ఫీజు చెల్లించాలనే డిమాండ్లతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడువులోగా ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాసులు నిలిపేస్తామని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉంటే ప్రైవేటు కాలేజీలే 1,550కుపైగా ఉన్నాయి. అందులో 18 కార్పొరేట్ మేనేజ్మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వాటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సాధారణ కాలేజీల్లో ఫీజులు రూ. 20–30 వేలు ఉండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం కాలేజీని బట్టి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బ్యాచ్‌ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఎంసెట్, ఐఐటీ కోచింగ్ అంటూ ప్రత్యేక బ్యాచ్‌ల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. గతేడాది నిర్ణయించిన ఫీజునే ఇప్పుడూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు కావడంతో కొంత రాయితీ ఇవ్వాలని కోరినా కాలేజీలో చేర్చినప్పుడు ఖరారు చేసుకున్న మొత్తాన్నే చెల్లించాలని పట్టుపడుతున్నాయి. ఇక ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిలిపేస్తున్నాయి. ప్రతి వారం నిర్వహించే స్లిప్ టెస్టులకు దూరం చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) కాలేజీలకు భారీ లాభం.. ఓ వైపు ఫీజులను తగ్గించట్లేదు. నిర్దేశిత ఫీజులనే వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఖర్చు భారీగా తగ్గింది. ఉన్న సిబ్బందిని 10 శాతం కంటే తక్కువకు కుదించాయి. వంద మంది లెక్చరర్లు బోధించాల్సిన క్యాంపస్‌లలో ఆరేడు మంది లెక్చరర్లతో నడిపిస్తున్నాయి. వారితోనే వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో క్యాంపస్‌లో ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటారు. వారికి 50 మందికిపైగా లెక్చరర్లు అవసరం. వారికి గతంలో వేతనాల రూపంలోనే నెలకు సగటున రూ.12.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదుగురు లెక్చరర్లకు రూ.లక్ష లోపు చెల్లిస్తూ ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ఇలా ఒక్కో కాలేజీలో 90 శాతం మంది బోధనా సిబ్బందిని (మొత్తంగా 10 వేల మందికి పైగా) రోడ్డున పడేసి, వారికి చెల్లించాల్సిన వేతనాల మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్క శాతం మందికే పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా, 2 శాతం మందికి 60 శాతం వేతనాలు, మిగతా వారికి 40 శాతం నుంచి 50 శాతం లోపే వేతనాలు చెల్లిస్తూ.. లెక్చరర్లను అర్ధాకలికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రైవేటు కాలేజీల్లో బోధించే మరో 10 వేల మందికి పైగా లెక్చరర్లు రోడ్డున పడ్డారు. పట్టించుకోని విద్యా శాఖ కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ పట్టించుకోవట్లేదు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించట్లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించినా ఆ తర్వాత గాలికి వదిలేశారు. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేదు: దుబ్బాక జానకిరెడ్డి, రాష్ట్ర లెక్చరర్స్ జేఏసీ ఉపాధ్యక్షుడు ఓ కార్పొరేట్ కాలేజీలో పని చేశాను. కరోనా దెబ్బతో ఉద్యోగానికి దూరమయ్యాను. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది. తెలిసిందల్లా టీచింగే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ వేవ్ అంటున్నారు. అదే పరిస్థితి వస్తే జీవనోపాధి ఇంకా కష్టంగా మారుతుంది. ట్యూషన్లు చెబుతున్నా: మారోజు చంద్రశేఖర్, రాష్ట్ర లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు కరోనాతో కాలేజీ మూత పడినప్పటి నుంచి నో వర్క్– నో పేలోనే ఉన్నాను. ఇకనైనా పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇన్నాళ్లూ పని లేదు. ఇకనైనా ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. అందుకే హోం ట్యూషన్స్ చెప్పి జీవనం కొనసాగిస్తున్నా. నాకు తెలిసిన అనేక మంది లెక్చరర్లు కూలీలుగా మారిపోయారు. -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్‌లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్‌ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్‌లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్‌గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్‌కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఝలక్..
కరోనా వైరస్ విపత్తు కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలతోపాటు, అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ యాజమాన్యాలు అడ్వాన్స్ దోపిడీకి తెరతీశాయి. పది పరీక్షలే జరగలేదు.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ముందే అడ్వాన్స్ చెల్లిస్తే.. ఫీజు రాయితీలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క ఆయా కళాశాలల్లో చదివి ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్వాన్స్ మొత్తం చెల్లిస్తేనే.. ద్వితీయ సంవత్సరం క్లాస్‌లకు ఆన్లైన్ లింక్ ఇస్తామని ఝలక్ ఇస్తున్నాయి. నెల్లూరు (టౌన్): కరోనా కష్టకాలంలోనూ జిల్లాలో ప్రైవేట్ కళాళాలలు అడ్వాన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కమిటీని కూడా నియమించింది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆన్లైన్లో తరగతులు ప్రారంభమయ్యాయని, వెంటనే 25 శాతం ఫీజు చెల్లించినట్లయితే సంబంధిత ఆన్లైన్ లింక్ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులతో ఫోన్లు చేయిస్తున్నాయి. ♦ జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 173 ప్రైవేట్, 35 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు 60 వేల మందికి పైగా ఉంటారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 12 నుంచి 14 వేల మంది చదువుతున్నారు. ♦ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో జూలై వరకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. అప్పటికి కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులు తరగతుల నిర్వహణను వాయిదా వేసే అవకాశం ఉంది. ♦ అయితే ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ కోర్సులకు సంబంధించి తరగతులు ప్రారంభించినట్లు తెలిసింది. ♦ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఫీజులో 25 శాతం చెల్లించాలని చెబుతున్నారు. ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ లింక్ ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. సిలబస్ మిస్ అయితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ♦ ఫీజులు కూడా గతేడాదికి అదనంగా 10 నుంచి 20 శాతం ఫీజు పెంచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగిన ఫీజులు చెల్లించకుంటే తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడతారోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే కొంత మంది ఫీజు చెల్లించి ఆన్లైన్ తరగతులకు హాజరువుతున్నట్లు తెలిసింది. ఇంటర్లో చేరబోయే విద్యార్థులదీ అదే పరిస్థితి పదో తరగతి పరీక్షలే ఇంకా జరగలేదు. అయితే వారి ఫోన్ నంబర్లను సేకరించిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కళాశాలలో చేరాలని అడుగుతున్నారు. ♦ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజులో 20 నుంచి 25 శాతం రాయితీ కల్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ♦ కార్పొరేట్ యాజమాన్యాల ఫోన్లతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఫీజు కట్టాలా లేకుంటే పది ఫలితాలు వచ్చిన తర్వాత చెల్లించాలన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. ♦ మరో పక్క కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ తరగతులు కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని, ముందు అడ్మిషన్ పొందితే ఆన్లైన్ తరగతులకు లింక్ ఇస్తామంటున్నారు. ♦ అయితే ఇప్పటికీ పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఇప్పుడే ఇంటర్ తరగతులపై దృష్టి పెడితే పదో తరగతి పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందని అంటున్నారు. ♦ ఈ పరిణామాలపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ముందస్తు ఇంటర్‌కు ప్రిపేర్ కావడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఇంకో పక్క క్లాసులు జరిగిపోతే ఎలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజుపై ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయొచ్చు ఇంటర్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేయాలని, త్రైమాసిక ఫీజును 45 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజులపై ఏ యాజమాన్యమైనా ఒత్తిడి తీసుకువస్తే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. విద్యా సంవత్సర ప్రారంభం విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పరిశీలించిన తర్వాత ఆన్లైన్ తరగతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటి వరకు ఇంటర్లో ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు. ఆన్లైన్ తరగతులకు అనుమతి లేదు ఇంటర్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించకూడదు. ఇంటర్‌కు సంబంధించి విద్యా సంవత్సర ప్రారంభం కంటే ముందుగానే ఫీజు వసూలు చేయరాదు. ఎవరైనా ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తే 99486 63982 నంబరుకు ఫిర్యాదు చేయాలి. కోచింగ్ సెంటర్లకు సైతం అనుమతి లేదు. క్లాసు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య!
కర్నూలు బిర్లా గేటు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్ క్లాస్‌లు చెప్పలేదు. ఈ కాలేజీకి చెందిన మరో బ్రాంచ్ కర్నూలు కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉంది. అక్కడ వారం రోజుల నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కర్నూలులోని ఓ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు పాస్ చేయించేందుకు బైపీసీ విద్యార్థుల నుంచి రూ. 2 వేలు, ఎంపీసీ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. కర్నూలు సిటీ: ఇంటర్లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ప్రయోగశాలలేవీ? జిల్లాలో మొత్తం 299 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 44, ఏపీ మోడల్ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్ కాలేజీలు10, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 14, రెసిడెన్షియల్ కాలేజీలు 2, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలు 3, కో–ఆపరేటివ్ కాలేజీలు 1, ఇన్సెంటివ్ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు 113, ఒకేషనల్ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్ టూర్‌కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి. అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను బొటానికల్ టూర్‌కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు జంబ్లింగ్ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా ఫీజులను వసూళ్లు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెబుతున్నారు. మరోసారి కాలేజీలను తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – సాలాబాయి, ఇంటరీ్మడియట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి -
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. బోర్డుకు ఫిర్యాదులు.. రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది. -
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేసవి సెలవుల సమయంలోనూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు, శ్రేణులు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఎస్ఎఫ్ఐ నేతలను, శ్రేణులను అడ్డుకున్నారు. అధికారులను వారు కలువకముందే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘం నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఆర్ఐవోపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కళాశాలకు ఇంటర్ బోర్డు అధికారులు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. -
ఇంటర్లో ప్రవేశాలకు కార్పొరేట్ వల..!
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి ఫలితాలు వెల్లడికాకుండానే విద్యార్థులకు వల విసురుతున్నాయి. తల్లిదండ్రులకు మాయమాటలుచెబుతూ విద్యార్థులను ‘బుక్’ చేసుకుంటున్నాయి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు భారీగా ముడుపులు ముట్టజెప్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నా.. జిల్లా ఇంటర్మీయట్ విద్యా పర్యవేక్షణ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాలు వెల్లడికాకుండానే ఇంటర్లో ప్రవేశాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు జిల్లాలో హడవుడి చేస్తున్నాయి. తమ పీఆర్వోలను పల్లె, పట్టణాల్లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు పంపిస్తున్నాయి. వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రవేశ దరఖాస్తులను నింపిస్తున్నాయి. ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు రాయితీల పేరుతో ముందుగానే 60 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. లేందంటే ఐడీ నంబర్రాదని భయపెడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 22, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 72 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 26 వేల మంది విద్యార్థుల ప్రవేశం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ కళాశాలలను మినహాయించి చూస్తే 16 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్ కళా శాలల్లోనే చదువుతున్నారు. వీరి ప్రవేశాల కోసం బేరసారాలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఫీజులు... ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే గ్రూప్‌లో ఏసీ క్యాంపస్ (రాష్ట్రంలో ఎక్కడి బ్రాంచ్‌ల్లోనైనా)లో చదువుకోదలిస్తే రూ.1.75 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూప్‌ల్లో సివి ల్స్ ఫౌండేషన్ పేరుతో కొత్త కోర్సులను పరిచ యం చేస్తున్నాయి. సుమారు రూ. 1.75 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నా యి. సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌తో సీఏ, సీసీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షల డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు పాతర... వాస్తవంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్‌లో ప్రవేశాలు తీసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోలతో నియామకాలు చేసుకోకూడదు. ఇం టర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదన్న వాదన విని పిస్తోంది. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విచ్చల విడిగా ప్రవేశాలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని విద్యావేత్తలు చెబుతున్నారు. తిరిగొస్తే డబ్బులు గోవిందా... కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులు చాలా మందికి అక్కడి పరిసరాలు నప్పవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కళాశాలను విడిచి పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఫీజులో 30 శాతం చెల్లించాల్సి వస్తోందంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున మొత్తం ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందేనంటున్నారు. పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పి అందులో చదివే విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు జిల్లాలో 100కు పైగా ఉన్నతపాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అదే కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసిన వారికే వేసవి సెలవుల్లో వేతనాలిచ్చే నిబంధనలు విధించాయి. దీంతో ఆయా కళాశాలల్లోని సిబ్బంది తీవ్రఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా. అన్ని చోట్లా పీఆర్వోలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, సాలూరు, గజపతినరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో పీఆర్వో (పబ్లిక్ రిలేషన్ అధికారులు)లను నియమించుకున్నాయి. ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయులను కళాశాలలకు ఏజెంట్లుగా నియమించి వీరికి నెలకు రూ.8వేల వరకు ఏడాది పొడువునా జీతం రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్‌టైం పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటవుతోంది. ఆ తాయిలాల కు ఆకర్షితులైన చాలామంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్ కళాశాలలకు పంపుతున్నారు. -
కార్పొరేట్ కళాశాలల దందా!
ప్రకాశం ,పర్చూరు: రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. కానీ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల కోసం అప్పుడే వేట మొదలు పెట్టాయి. ఫలితాలు వచ్చేందకు ఇంకా సమయం పడుతుంది. అయినా ప్రైవేటు కళాశాలల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో సాధ్యమైనంత వరకు అడ్మిషన్లు ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభించాయి. అందుకనుగుణంగా తమ సిబ్బందిని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల మీదకు వదిలారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న ఆయా కొర్పొరేట్ సంస్థల పీఆర్ఓలు.. అడ్మిషన్ల సమయంలోనే ఎంబీబీఎస్ ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్ అంటూ మభ్యపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 42,343 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 2018 అక్టోబర్, నవంబర్ నెలల నుంచే పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించిన కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లను అడ్వాన్స్ బుక్ చేసుకుంటున్న వైనం విస్తుగొలుపుతోంది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పీఆర్ఓలను దించేసి నిర్ణయించిన మేరకు అడ్మిషన్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పీఆర్ఓలు తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్ ఫీజు కింద రూ.2 వేలు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల పీఆర్ఓలు చేరే ముందు ఒక ఫీజు, చేరిన తర్యాత ఇంకో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాక జూన్‌లో ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకోసం ఎలాంటి ప్రచారం చేయకూడదు. కానీ పలు సంస్థల పీఆర్ఓల ద్వారా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక తమ పాఠశాలల్లో పది చదివి పాసైన వారిని ఉపాధ్యాయులు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తే రూ.2 నుంచి 5 వేలు వరకు కమీషన్ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రండి..బాబూ రండి!
సాక్షి,సిటీబ్యూరో:‘సార్ మీ ఇంట్లో ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలున్నారా? ఉంటే మా కాలేజీలో చేర్పించండి. ఫలితాలు వచ్చిన తర్వాత అయితే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ముందే రిజర్వు చేసుకుంటే ఫీజులో 20 నుంచి 30 శాతం రాయితీ లభిస్తుంది. ఎంసెట్, నీట్లో ఉచిత శిక్షణ ఇస్తాం’.. పదోతరగతి పరీక్షలు రాస్తున్న తల్లిదండ్రులకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల పీఆర్ఓలు, అధ్యాపకులు ఇస్తున్న ఆఫర్ ఇది. పదోతరగతి పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో అప్పుడే ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల వేట ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకోగా, ఇంకొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్పించే బాధ్యతను ఇప్పటి వరకుఆయా కాలేజీల్లో పనిస్తున్న అధ్యాపకులకు అప్పగించాయి. విద్యార్థులను చేర్పించే విషయంలో ఒకొక్కరికీ ఒక్కోరకమైన టార్గెట్ ఇస్తున్నారు. టార్గెట్ పూర్తి చేసిన వారికే వేతన పెంపు, కొలువు పదిలంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిపోయినా అధ్యాపకులకు ఆయా కళాశాలలు సెలవులు ఇవ్వలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు అధ్యాపకులు వెళ్లి కరపత్రాలు చూపించి విద్యార్థులను ఆకర్షించే పనిలో పడ్డారు. సాయంత్రం, ఉదయం సమయాల్లో కళాశాల సమీప ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ‘సార్, ఇంట్లో పదో తరగతి పరీక్ష రాసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..? వారిని మా కళాశాలలో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. గ్రేటర్‌లోని పలు జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ముందు గుర్తించిన వాటి యాజమాన్యాలు ఫీజు డిస్కౌంట్లు.. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రంగులు వేసి..ముస్తాబు చేసి.. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలు ఉన్న సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు వాటి యాజమాన్యాలు తమ కాలేజీల భవనాలకు మెరుగులు దిద్దుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయని అందులో పేర్కొంటున్నాయి. పదో తరగతి చదివే పిల్లల జాబితాలను, ఫోన్ నంబర్లు సేకరించి వారి ఇళ్లకు మధ్యవర్తులను, దళారులను పంపి ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుందని, అదే ముందే సీటు రిజర్వు చేయించుకున్న వారికి ఫీజులో రాయితీ ఉందంటూ ఆశ చూపుతున్నారు. ప్రవేశాల కోసం రాయితీల ఎర గ్రేటర్ పరిధిలో కొన్ని కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్లో చేరేటప్పుడు ఫీజులో 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పదిలో మార్కుల ఆధారంగా రాయితీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కానీ విద్యార్థి సదరు కళాశాలలో చేరిన తర్వాత ఏడాది పూర్తి ఫీజు గుంజుతున్నారు. ఎంసెట్, నీట్ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాక ఏదో రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మధ్యవర్తులతో బేరసారాలు ప్రచారం చేసి విద్యార్థులను ఆకర్షించడంలో కొన్ని కళాశాలలు ఆరితేరాయి. విద్యార్థులకు గాలం వేయడం కోసం రూ.లక్షలు వెచ్చించి మధ్యవర్తులను నియమించుకున్నాయి. వీరు విద్యార్థుల కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని మాట కలపడంలో నేర్పరులు. వీరి మాటల్లో పడి విద్యార్థులను ఆ కళాశాలల్లో చాలామంది తల్లిదండ్రులు చేర్పించేస్తున్నారు. ఆ మాటలు నమ్మి కళాశాలలను ఎంపిక చేసుకుంటే తర్వాత ఇబ్బందులేనని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు కట్టి మోసపోవద్దు అనుమతులు ఉన్న కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతాం. ఏ కాలేజీలో యే విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయో కూడా పొందుపరుస్తాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలి. తల్లిదండ్రులు ముందే డబ్బులు కట్టి మోసపోవద్దని మా విజ్ఞప్తి. – జయప్రద, హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,27,761 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1,733 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని (జనరల్ కాలేజీలు 1,561, ఒకేషనల్ 172 కాలేజీలు) ఎంపీసీ విద్యార్థులు 1,59,429 మంది, బైపీసీ విద్యార్థులు 89,496 మంది, జాగ్రఫీ విద్యార్థులు 261 మంది, ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 42,749 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35,925 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం 6,314 మంది అనుభవం కలిగిన జూనియర్ లెక్చరర్లను నియమించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. గతేడాది నుంచే ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపించే చర్యలను బోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి కూడా అరగంట ముందుగా ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపిస్తామని తెలిపింది. ఎగ్జామినర్ మొబైల్ నంబరుకు వన్‌టైం పాస్వర్డ్ పంపిస్తామని దాని ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను కూడా ఆ రోజు సాయంత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని బోర్డు స్పష్టంచేసింది. ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు ప్రాక్టికల్ పరీక్షల విధులను అప్పగించిన ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లినట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెందిన లెక్చరర్లను ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ చేసినప్పటికీ వారివారి కాలేజీల్లోనే సెంటర్లు పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బోర్డు అధికారులు గురువారం సాయంత్రం దాన్ని సవరించే పనిలో పడినట్లు తెలిసింది. మరోవైపు ఈ నెల 28న జరిగిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇంకా ఇంటర్ బోర్డుకు అందలేదు. ఆన్లైన్లో మార్కులను అదే రోజు అప్లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల కుదరలేదు. -
ఫీ'జులుం' భరించలేం
ఓ కార్పొరేట్ స్కూల్ అయితే పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు కూడా వారి దగ్గరే కొనాలంటోంది.బయట మార్కెట్లో రూ.800 ఉన్న బ్యాగ్‌కు స్కూల్ లోగో తగిలించి ఏకంగా రూ.2,000కి అమ్ముతున్నారు. పుస్తకాల ధరలు అయితే మరీ దారుణం. అన్యాయంగా దోచుకుంటున్నారని తెలిసినా సరే.. చదువుకున్న వారు సైతం పిల్లల కోసం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు. ‘రాజధాని అమరావతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో మా అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తే రూ.2,000 పెంచారు. మరో రూ.4,000 కడితే చిప్‌తో కూడిన పాఠాల సిలబస్ ఇస్తామన్నారు. దీని ద్వారా రోజూ చదవాల్సిన పాఠాలు, టెస్టులతో ఎప్పటికప్పుడు ఫెర్ఫామెన్స్‌ను మీకు తెలియజేస్తామన్నారు. అయితే.. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇస్తారా అని అడిగితే అలాగేమీ ఉండదన్నారు. అయితే, చిప్ అక్కర్లేదు అని చెప్పి వచ్చేశాను. తీరా చూస్తే మా అబ్బాయిని ఏ1 గ్రూపు నుంచి ఏ4 గ్రూపులోకి మార్చారు. మర్నాడు స్కూల్‌కి వెళ్లి గ్రూపు ఎందుకు మార్చారు అని అడిగితే చిప్ తీసుకున్న వాళ్లని ఏ1, ఏ2 గ్రూపుల్లో.. చిప్ తీసుకోని వాళ్లని ఏ3, ఏ4ల్లోకి మార్చామన్నారు. మా అబ్బాయి మానసికంగా ఎక్కడ కుంగిపోతాడోనన్న ఉద్దేశంతో.. వాళ్లతో వాదించలేక రూ.4,000 కట్టి వచ్చేశాను.’ – కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితిపై ఇదీ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన సాక్షి, అమరావతి : ఏటా ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు పెంచేసి.. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నారు. టెన్త్‌లోపు పిల్లలకు ఏటా ఏదో రూపంలో రూ.2,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేసి పిండేస్తున్నారు. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూళ్లలో అయితే ఈ మొత్తం రూ.5,000 పైనే దాటుతోంది. ఇంటర్‌కు వచ్చేసరికి ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోంది. ఏటా కనీసం రూ.10,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డే స్కాలర్‌గా అయితే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అవుతుంటే అదే హాస్టల్లో ఉండి చదివిస్తే రూ.2.25 లక్షలు తక్కువ కావడంలేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏటా ఫీజులు పెంచేస్తుండడంతో తల్లిదండ్రులు బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పుల పాలవుతున్నారు. మరీ ఇంత దారుణమా? ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటర్, స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు రూ.5,068 కోట్లు అదనంగా చెల్లించారంటే నమ్ముతారా? ఈ ఏడాది పెరిగిన ఫీజులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే టెన్త్‌లోపు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా వ్యయం సగటున 18 శాతం పెరిగితే ఇంటర్ విద్యార్థులకు 27 శాతం వరకు పెరిగింది. ఫీజులతో పాటు ఈ ఏడాది పుస్తకాలు, రవాణా వ్యయం, యూనిఫాం, బూట్లు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారికి ఫీజుల పెంపు లేకపోయినా పెరిగిన పుస్తకాలు, రవాణా, యూనిఫాం వంటి వాటివల్ల వారికి కూడా అదనపు ఖర్చులు తప్పడంలేదు. పాఠశాలల్లో.. ప్రతీ పాఠశాలలో గత ఏడాది ఫీజులు సగటున రూ.30,000 వరకు ఉండగా ఈ ఏడాది రూ.35,000 వరకు పెరిగాయి. అలాగే, పుస్తకాల వ్యయం రూ.3,200 నుంచి రూ.4,000 వరకు చేరుకున్నాయి. యూనిఫాం (మూడు జతలు) రూ.1,800 నుంచి రూ.2,750, బూట్లు (రెండు జతలు) రూ.3,000 నుంచి రూ.4,000కు పెరిగాయి. ఇక రవాణా, బ్యాగులు వంటి ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ఈ విధంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో విద్యార్థిపై సగటున రూ.7,350 వరకు భారం పెరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.2,350 వరకు ఖర్చు పెరిగినట్లు అంచనా. స్కూల్ విద్యార్థులపై పెరిగిన భారం రూ.3,167కోట్లు పైనే 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 69,61,058 మంది విద్యార్ధులు స్కూళ్లలో చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30.62 లక్షల మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98 లక్షల మంది చదువుతున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది రూ.2,251.20 కోట్లు భారం పడినట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న వారికి రూ.916.2 కోట్లు అదనపు భారమైంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.3,167.4 కోట్లు తక్కువ కాకుండా భారం పెరిగిందని లెక్కగా తేలింది. అదే పెద్దస్థాయి కార్పొరేట్ స్కూల్స్‌లో ఉన్న ఫీజులను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాలేజీల్లో... ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. కార్పొరేట్ కాలేజీల తీరు మరోలా ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఆన్లైన్ టెస్టుల పేరుతో ఫీజులు గుంజడం ఎక్కువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సామాన్య స్థాయి పైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫీజులు గతేడాది పోలిస్తే సగటున రూ. 55,000 నుంచి రూ.65,000కు పెరిగాయి. అలాగే పుస్తకాలు, రవాణా, బ్యాగ్‌లు వంటి ఇతర ఖర్చులు తీసుకుంటే రూ.24,800 నుంచి రూ.36,200 పెరిగాయి. 2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య 10,05,958గా ఉంది. ఇందులో ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు సుమారుగా 7,54,530 గా ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,51,428 చదువుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది సుమారు రూ.285 కోట్ల అదనపు భారం పడితే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు రూ.1,900.7 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది కేవలం డేస్కాలర్స్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తేనే ఇలా ఉందని, అదే రెసిడెన్షియల్ విద్యార్థుల భారాన్ని కూడా తీసుకుంటే ఈ మొత్తం మూడు రెట్లు అవుతుందంటున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇలా వేల రూ. కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘కార్పొరేటు’ సేవలో ఇంటర్ బోర్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల సేవలో ఇంటర్మీడియెట్ బోర్డు తరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది బోర్డు అధికారులు కార్పొరేట్ కాలేజీలకు తొత్తులుగా మారారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే అనేక మినహాయింపులను బోర్డు ఇస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా సంతృప్తి చెందని సదరు యాజమాన్యాలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు బోర్డు అధికారులపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారంలో బోర్డు తీరుపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోని అధికారులు.. హాస్టళ్ల గుర్తింపు విషయంలోనూ అదే ధోరణి తో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 50 కాలేజీలే దరఖాస్తు: రాష్ట్రంలో 600 వరకు కాలేజీల్లో విద్యార్థులకు హాస్టళ్లు ఉండగా, అందులో రెండుసార్లు అవకాశం ఇచ్చినా 50 లోపు కాలేజీలే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా హాస్టళ్ల ఇన్స్పెక్షన్ ఫీజు, అనుమతి ఫీజు, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఓ విధానం అంటూ లేకుండా, శాస్త్రీయ అంచనాలు లేకుండా, యాజమాన్యాల ఒత్తిడికి ఇంటర్ బోర్డు తలొగ్గుతూనే ఉంది. ఆ ఫీజుల విషయంలో యాజమాన్యాల డిమాండ్లకు ఇప్పటికే ఓసారి తలొగ్గిన బోర్డు మరోసారి తలొగ్గి ఫీజులను భారీగా తగ్గించింది. అయినా ఫీజులను ఇంకా తగ్గిస్తేనే తాము కోర్టులో ఉన్న కేసును విత్‌డ్రా చేసుకుంటామంటూ ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయా లో తెలియని గందరగోళంలో బోర్డు పడింది. నెలాఖరుకు ముగియనున్న గడువు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల హాస్టళ్లలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వాటిలో సరైన సదుపాయాలు ఉండేలా చేసేందుకు, వాటిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు ఇన్స్పెక్షన్, అనుమతి, ఫిక్స్డ్ డిపాజిట్ ఫీజులను నిర్ణయించారు. అంత మొత్తం తాము చెల్లించబోమంటూ యాజమాన్యాలు మొండికేయడం, పైగా బోర్డుకు ఆ అధికారం లేదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఫీజులను తగ్గించాల్సి వచ్చి ంది. ఆ తగ్గింపు కూడా సరిపోదని, మరింత గా తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఆ మేరకు తాజాగా కూడా ఫీజులను తగ్గించినా.. హాస్టళ్ల గుర్తింపు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరింతగా తగ్గించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. కాలేజీల హాస్టళ్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ఈనెల 6 నుంచి అవకాశం కల్పించింది. కానీ ఇప్పటివరకు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20తోనే దరఖాస్తు గడువు ముగియగా, రూ.5 వేల ఆలస్య రుసుముతో బుధవారంతో గడువు ముగిసింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో ఈనెల 31తో గడువు ముగియనుంది. ఇంకా తగ్గించాల్సిందే.. ♦ ఫిక్స్డ్ డిపాజిట్లను భారీగా తగ్గించినా ఇంకా తగ్గించాలంటూ యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. 200 మంది వరకు ఉంటే రూ.లక్ష, 201 నుంచి 500 లోపు ఉంటే రూ.2 లక్షలు, 501 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.3 లక్షలు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెల్లిస్తామని పట్టుపడుతున్నాయి. ♦ కార్పొరేషన్ పరిధిలో ఇన్స్పెక్షన్ ఫీజు ఏటా రూ.80 వేలుగా, అనుమతి ఫీజు రూ.లక్షగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. యాజమాన్యాల డిమాండ్ మేరకు తర్వాత వరుసగా రూ.55 వేలు, రూ.65 వేలకు తగ్గించింది. అయినా యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.30 వేలుగా, అను మతికి రూ.40 వేలు ఫీజుగా నిర్ణయించింది. అయినా తగ్గించాలని, ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతి ఫీజు రూ.30 వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొదట ఇన్స్పెక్షన్కు రూ.60 వేలు, అనుమతి ఫీజు రూ.80 వేలు ఉండగా తర్వాత దాన్ని రూ.40 వేలు, రూ.50 వేలకు బోర్డు తగ్గించింది. తాజాగా ఇన్స్పెక్షన్కు రూ.25 వేలు, అనుమతికి రూ.30 వేలుగా నిర్ణయించింది. వాటిని వరుసగా రూ.20 వేలు, రూ.25 వేలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీల్లో ఇన్స్పెక్షన్కు రూ.50 వేలు, అనుమతికి రూ.60 వేలుగా నిర్ణయించగా తర్వాత ఇన్స్పెక్షన్కు రూ.30 వేలు, అనుమతికి రూ.40 వేలకు తగ్గించింది. తాజా గా ఇన్స్పెక్షన్కు రూ.20 వేలుగా, అనుమతి ఫీ జు రూ.25 వేలుగా నిర్ణయించింది. వాటిని రూ.10 వేలు, రూ.15 వేలకు తగ్గించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కమీషన్ కాదు.. అంతకుమించి!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం పూర్తిగా బట్టబయలైంది. ఆ కాలేజీ యాజమాన్యాలకు చెందిన ఓ కీలక వ్యక్తి నేతృత్వంలో మొత్తం వ్యవహారం నడిచినట్లు సీఐడీ గుర్తించింది. శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సోమవారం కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాంగ్మూలాలను సీఐడీ నమోదు చేసింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పూర్తిస్థాయిలో లింకు బయటపడినట్లేనని, అయితే ఆ వివరాలు ఇప్పుడే బయటకు వెల్లడించబోమని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. లీకేజీకి కుట్ర పన్నినట్లు భావిస్తున్న కార్పొరేట్ కాలేజీల ప్రముఖుడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం పేరు బయటపెట్టకుండా.. ప్రశ్నపత్రంపై శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన వారు కావడంతో సీఐడీ వ్యూహాత్మకంగా దర్యాప్తు చేస్తోంది. సోమవారం 22 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాంగ్మూలాలు సేకరించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వాసుబాబు చెప్పినట్లు, శివనారాయణ వాదిస్తున్నట్లు.. కేవలం కమీషన్ కోసం విద్యార్థులను తరలించలేదని, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల ప్రమేయం ఉన్నట్లు తల్లిదండ్రుల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా తెలిసిందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. యాజమాన్యం పేరు బయటపెట్టకుండా వాసుబాబు, ఏజెంట్ శివనారాయణ ద్వారా తతంగం నడిపినట్లు గుర్తించామన్నాయి. అలాగే మాజీ విద్యార్థులు సందీప్, గణేశ్ ప్రసాద్ లాంటి కొంత మందితో లీకేజీ బ్రోకర్లు, కీలక పాత్రధారులతో కలసి కుట్రకు పాల్పడ్డారని సీఐడీ అనుమానిస్తోంది. ప్రశ్నపత్రం లీకేజీ, క్యాంపుల వ్యవహారం బిహార్‌కు చెందిన కమిలేశ్‌కుమార్ సింగ్, కర్ణాటకలోని బెంగళూర్‌కు చెందిన రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిపినట్లు భావిస్తోంది. ఆ వ్యక్తి ద్వారానే.. కేసుకు సంబంధించి కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన ఓ కీలక వ్యక్తిపై సీఐడీ దృష్టి సారించింది. ఏళ్ల నుంచి మంచి ర్యాంకులు సాధిస్తూ భారీ స్థాయిలో ఫీజులు దండుకున్న సంబంధిత కాలేజీలో ఆ వ్యక్తి కీలక హోదాలో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తన పేరు బయటపెట్టకుండా వాసుబాబు, శివనారాయణలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశాకే సీఐడీ అరెస్టు చేసేలా వ్యవహారం నడిపినట్లు తెలిసిందన్నారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు.. బ్రోకర్లు, సూత్రధారుల ద్వారా ఆ వ్యక్తి బండారం బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో బృందాలున్నాయని, కేసు ముందు నుంచి ఇప్పటివరకు దొరకని కొంత మంది బ్రోకర్లు దొరికితే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుందంటున్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేవరకు అన్ని ప్రాంతాల్లో ఈ కీలక వ్యక్తి తన ఏజెంట్లను అందుబాటులో ఉంచినట్లు భావిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం తయారు చేసిన వారి వివరాలూ ఇవ్వాలని జేఎన్టీయూకు లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వారి విచారణలో ఆ కీలక వ్యక్తికి సంబం ధించి బలమైన ఆధారాలు బయటపడే అవ కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ 16 మంది కోసం ఇంటెలిజెన్స్ లీకేజీ కేసు 90 శాతం పూర్తయినట్లు భావిస్తున్న సీఐడీ.. ఇందులో కీలక సూత్రధారులు, కుట్రదారుల లింకు తేల్చేందుకు 16 మంది బ్రోకర్ల పాత్ర కీలకమని అనుమానిస్తోంది. వీరి కోసం ఇప్పటివరకు వెతికిన సీఐడీ అధికారులు.. తాజాగా ఇంటెలిజెన్స్‌లోని కౌంటర్ వింగ్ పోలీసులను రంగంలోకి దింపారు. బ్రోకర్ల కోసం 4 ప్రత్యేక బృందాలతో కలసి బిహార్, కర్ణాటక, ఢిల్లీ, పుణేల్లో వేటసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో మృతిచెందిన కమిలేశ్ లింకు, కార్పొరేట్ కాలేజీల లింకు వీరిలోని కొంత మంది ద్వారా బయటపడుతుందని, వారికోసం తీవ్రంగా గాలిస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. వారు దొరికితే కేసు, మొత్తం వ్యవహారం ఛేదించినట్లేనని చెప్పారు. -
కార్పొరేట్ గుప్పిట్లో కన్వీనర్ ఆఫీసు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: విద్యను వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీలు.. ఆ దందాను విస్తృతం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాయి. ఎంసెట్ మెడికల్ ర్యాంకుల కోసం దొడ్డిదారిలో ప్రశ్నపత్రాలను సంపాదించేందు కు ఆరాటపడ్డాయి. ఇందుకు కార్పొరేట్ శక్తులు చేసిన లాబీయింగ్ అంతా ఇంతా కాదు. 2 దశాబ్దాలకు పైగా ఎంసెట్ నిర్వహించిన చరిత్ర ఉన్న జేఎన్టీయూ, ఆ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే కన్వీనర్ కార్యాలయాన్నీ వదల్లేదు. ఈ ఆఫీసులో సీనియర్ అధికారి మొదలు నాలుగో తరగతి ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికీ లంచాల ఎర చూపారు. సంవత్సరాల తరబడి సొమ్ము ముట్టజెప్పి సమాచారం కాజేసే యత్నాలకు ఒడిగట్టారు. దరఖాస్తులు స్వీకరించడం మొదలు, ఫలితాలు ప్రకటించేదాకా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తెలిసేది కార్పొరేట్ కాలేజీలకే! పేపర్ సెట్టింగ్ నుంచి మొదలు.. వేలాది మంది పోటీ పడే ఎంసెట్‌లో ప్రశ్నపత్రాల రూపకల్పన అత్యంత కీలకం. ప్రశ్నపత్రాలకు ఎవరు రూపకల్పన చేయాలన్నది కన్వీనర్‌కు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అందుకే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు కన్వీనర్ కార్యాలయంలోనే తిష్ట వేసేవారు. కన్వీనర్ ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ఎంత? ఆయన ఏ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు? వంటి విషయాలకు అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. కన్వీనర్ ఆఫీసులో మామూలుగా విశ్వసనీయత కలిగిన వారినే నియమిస్తారు. అయినా భారీ స్థాయిలో సొమ్ము ఆశ జూపి వారిని ప్రలోభపెట్టేందుకు యత్నించేవారు. కన్వీనర్ అనేక విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా కొన్నిసార్లు ఇతర సిబ్బందికి కొన్ని పనులు అప్పగించేవారు. కార్పొరేట్ శక్తులు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకునేవి. మొదట ప్రశ్నపత్రాలను సెట్ చేసేవారిని గుర్తించి, తర్వాత వారి నుంచి ప్రశ్నలు సేకరించడానికి కోట్లలో ఖర్చు చేసేవారని జేఎన్టీయూలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన జేఎన్టీయూలో పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను సీనియర్ పోలీసు అధికారి ఒకరికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్యానల్ నుంచి ప్రశ్నలు బయటకు.. ప్రశ్నపత్రం రూపొందించేందుకు జేఎన్టీయూకు ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో ఉన్న వారు రూపొందించే ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుంటారు. అయితే ప్యానల్ తయారు చేసే వెయ్యి ప్రశ్నలు లీక్ అయితే చాలు కొంచెం తెలివైన విద్యార్థి 160కి 150కి పైగా మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. దీన్ని కార్పొరేట్ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. ‘‘నాకు తెలిసి ఈ కాలేజీలు పేపర్ సెట్టింగ్ ప్యానల్ నుంచే ప్రశ్నలు సంపాదించేవి. అందుకు కోట్లు ఖర్చు చేసేవారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినా బయటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే భారీగా డబ్బు ముట్టజేప్పేవారు’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ‘‘ఇదేం మామూలు స్కాం కాదు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోవడం కూడా పొరపాటే. ప్యానల్ నుంచి ప్రశ్నలు సేకరించడం ఇబ్బంది అనుకున్న ప్రతీసారి వారు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం సంపాదించేవారు. మెడికల్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఇంజనీరింగ్ కోసం తక్కువ ఖర్చుతో ప్యానల్ నుంచి ప్రశ్నలు అందేవి’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ వివరించారు. తెలివైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉంటారు. కానీ రెండు కాలేజీలకే ర్యాంక్‌లు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని, పట్టించుకొని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వారంతా ఆ రెండు కాలేజీల విద్యార్థులే..! లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు ఆ రెండు కాలేజీలకు చెందినవారేనని సీఐడీ విచారణలో బయటపడింది. పేపర్ లీకేజీలో అరెస్టయిన శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను విచారిస్తున్న సీఐడీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు 136 మంది విద్యార్థులను విచారించారు. వీరిలో 86 మంది ఒక కార్పొరేట్ కాలేజీకి చెందిన వారు కాగా, ఇంకో 28 మంది మరో కార్పొరేట్ కాలేజీకి చెందిన వారే! దీంతో స్కాం పూర్తిగా ఈ రెండు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందా అన్న కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బ్రోకర్లు సైతం ఇదే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకొని ప్రస్తుతం మెడిసిన్ చేస్తుండటం గమనార్హం. తెరపైకి మరో 13 మంది బ్రోకర్లు ఎంసెట్ కేసులో అరెస్టయిన వాసుబాబు, శివ నారాయణ, శ్రీచైతన్య మాజీ విద్యార్థి గణేశ్ ప్రసాద్‌ల విచారణలో తెరపైకి మరికొన్ని కొత్త ముఖాలు వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మందిని నిందితులుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మరో 13 మంది బ్రోకర్లు కూడా స్కాంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరు రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులను బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె క్యాంపులకు తరలించి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. అటు డాక్టర్ ధనుంజయ్, సందీప్‌లకు ప్రశ్నపత్రం ఇచ్చిన బ్రోకర్ల లింకుపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 13 మంది బ్రోకర్లలో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, మిగిలిన ఐదుగురిలో ఇద్దరు యూపీ, ఒకరు ఢిల్లీ, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన వారున్నారని సీఐడీ అనుమానిస్తోంది. వీరిలో కొందరు స్కాం ప్రధాన సూత్రధారి కమిలేష్‌కుమార్ సింగ్‌తో పదేపదే టచ్‌లో ఉన్నారని, అక్కడ్నుంచి వీరి ద్వారానే కార్పొరేట్ కాలేజీలకు ప్రశ్నపత్రం అందినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో వాసుబాబు, శివనారాయణ, గణేష్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లిలోని సీఐడీ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ పిటీషన్‌పై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. మొత్తంగా చార్జిషీట్ దాఖలుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. -
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో వంద కోట్ల కుంభకోణం
-
ఎంసెట్ ‘ప్రశ్నపత్రం లీకేజీ’లో ట్విస్ట్