శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కూతురును ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో రూ. 1.2 లక్షల ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. ఈ నెలాఖరులోగా మిగతా ఫీజు చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీల్లో ప్రత్యక్ష బోధన లేదు.. ప్రాక్టికల్స్ లేవు. అయినా మొత్తం ఫీజు చెల్లించాలనడంతో గత్యంతరం లేక తన కూతురు భవిష్యత్తు కోసం అప్పు వేటలో పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయి. రాయితీ ఇస్తామని ఆశపెట్టడం లేదా పిల్లలకు పాఠాలు చెప్పబోమని బెదిరించి మొత్తం ఫీజును వసూలు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష బోధన, ప్రాక్టికల్స్ లేకపోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. యాజమాన్యాలు చెప్పినంత ఫీజు చెల్లించాలనే డిమాండ్లతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడువులోగా ఫీజు చెల్లించకుంటే
ఆన్‌లైన్ క్లాసులు నిలిపేస్తామని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.
అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉంటే ప్రైవేటు కాలేజీలే 1,550కుపైగా ఉన్నాయి. అందులో 18 కార్పొరేట్ మేనేజ్‌మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వాటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సాధారణ కాలేజీల్లో ఫీజులు రూ. 20–30 వేలు ఉండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం కాలేజీని బట్టి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బ్యాచ్‌ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఎంసెట్, ఐఐటీ కోచింగ్ అంటూ ప్రత్యేక బ్యాచ్‌ల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. గతేడాది నిర్ణయించిన ఫీజునే ఇప్పుడూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులు కావడంతో కొంత రాయితీ ఇవ్వాలని కోరినా కాలేజీలో చేర్చినప్పుడు ఖరారు చేసుకున్న మొత్తాన్నే చెల్లించాలని పట్టుపడుతున్నాయి. ఇక ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపేస్తున్నాయి. ప్రతి వారం నిర్వహించే స్లిప్ టెస్టులకు దూరం చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా)
కాలేజీలకు భారీ లాభం..
ఓ వైపు ఫీజులను తగ్గించట్లేదు. నిర్దేశిత ఫీజులనే వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఖర్చు భారీగా తగ్గింది. ఉన్న సిబ్బందిని 10 శాతం కంటే తక్కువకు కుదించాయి. వంద మంది లెక్చరర్లు బోధించాల్సిన క్యాంపస్‌లలో ఆరేడు మంది లెక్చరర్లతో నడిపిస్తున్నాయి. వారితోనే వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో క్యాంపస్‌లో ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటారు. వారికి 50 మందికిపైగా లెక్చరర్లు అవసరం. వారికి గతంలో వేతనాల రూపంలోనే నెలకు సగటున రూ.12.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదుగురు లెక్చరర్లకు రూ.లక్ష లోపు చెల్లిస్తూ ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ఇలా ఒక్కో కాలేజీలో 90 శాతం మంది బోధనా సిబ్బందిని (మొత్తంగా 10 వేల మందికి పైగా) రోడ్డున పడేసి, వారికి చెల్లించాల్సిన వేతనాల మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్క శాతం మందికే పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా, 2 శాతం మందికి 60 శాతం వేతనాలు, మిగతా వారికి 40 శాతం నుంచి 50 శాతం లోపే వేతనాలు చెల్లిస్తూ.. లెక్చరర్లను అర్ధాకలికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రైవేటు కాలేజీల్లో బోధించే మరో 10 వేల మందికి పైగా లెక్చరర్లు రోడ్డున పడ్డారు.
పట్టించుకోని విద్యా శాఖ
కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ పట్టించుకోవట్లేదు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించట్లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించినా ఆ తర్వాత గాలికి వదిలేశారు. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేదు: దుబ్బాక జానకిరెడ్డి, రాష్ట్ర లెక్చరర్స్ జేఏసీ ఉపాధ్యక్షుడు
ఓ కార్పొరేట్ కాలేజీలో పని చేశాను. కరోనా దెబ్బతో ఉద్యోగానికి దూరమయ్యాను. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది. తెలిసిందల్లా టీచింగే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ వేవ్ అంటున్నారు. అదే పరిస్థితి వస్తే జీవనోపాధి ఇంకా కష్టంగా మారుతుంది.
ట్యూషన్లు చెబుతున్నా: మారోజు చంద్రశేఖర్, రాష్ట్ర లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు
కరోనాతో కాలేజీ మూత పడినప్పటి నుంచి నో వర్క్– నో పేలోనే ఉన్నాను. ఇకనైనా పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇన్నాళ్లూ పని లేదు. ఇకనైనా ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. అందుకే హోం ట్యూషన్స్ చెప్పి జీవనం కొనసాగిస్తున్నా. నాకు తెలిసిన అనేక మంది లెక్చరర్లు కూలీలుగా మారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment