
సాక్షి, వరంగల్ : అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా.
నేను మీ అక్కని రా అంటూ
ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్‌ను వినియోగించింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది.
ఏడాదిన్నరగా
ఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెలుగులోకి కిలాడీ లేడీ గ్యాంగ్ అరాచకాలు
ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను భయటపెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment