నత్తనడకన స్మార్ట్‌సిటీ పనులు
ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్రం
71 నగరాల్లో అసంపూర్తి.. లక్ష్యానికి దూరంగా 16 సిటీలు
60 శాతంలోనే వరంగల్, కరీంనగర్
2025 మార్చి నాటికి లక్ష్యం పూర్తయ్యేనా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్మార్ట్‌సిటీ మిషన్ (ఎస్‌సీఎం) కింద చేపట్టిన పనులు పలు నగరాల్లో నత్తనడకన సాగుతున్నాయి. దేశంలోని 100 నగరాలను ఎస్‌సీఎం ద్వారా ‘సుందర నగరాలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. పనులు పూర్తి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.
వాస్తవానికి 2023 జూన్‌లోనే.. దేశంలోని వంద నగరాల్లో చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇప్పటికి రెండు పర్యాయాలు స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగించినా ఫలితం లేదు. పనుల తీరు చూస్తే 2025 మార్చి 31 నాటికైనా పూర్తవుతాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
తొమ్మిదేళ్లుగా సా..గుతున్న పనులు
దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న స్మార్ట్‌సిటీ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం దీని లక్ష్యం. మొదటి విడత 98 నగరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చింది.
సుమారు తొమ్మిదేళ్ల వ్యవధిలో వంద నగరాల కోసం 8,066 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లను జారీ చేసి రూ.1,64,669 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు 2024 నవంబర్ 28 వరకు 7,352 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లపై రూ.1,47,366 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని భువనగరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి తోఖన్ సాహు వెల్లడించారు.
ఇన్ని నిధులు ఖర్చయినా.. అన్ని ప్రాజెక్టులను 13 నగరాలు మాత్రమే పూర్తి చేశాయి. ఆ తర్వాత 48 నగరాల్లో 90 శాతం, 23 నగరాల్లో 75 శాతం పూర్తయ్యాయి. 16 నగరాల్లో స్మార్ట్‌సిటీ మిషన్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉండగా.. రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి.
ఆ 13 నగరాలు భేష్..
నూరు శాతం స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేపట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాల్లో గుజరాత్ రాష్ట్రంలో సూరత్, జార్ఘండ్‌లో రాంచీ, కర్ణాటకలో తుమకూరు, లక్ష్యదీప్‌లో కవరాట్టి, మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్, మహారాష్ట్రలో పుణె, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మధురై, సాలెం, ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా, బరేలీ ఉన్నాయి.
60 శాతంలోనే వరంగల్, కరీంనగర్..
గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ రెండు నగరాలకు కేటాయించిన నిధులు, ఖర్చయిన నిధులు, పూర్తయిన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఇంకా 58 శాతంలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోగా.. తుది గడువైన 2025 మార్చి 31 నాటికి పూర్తవడం ప్రశ్నార్థకంగా ఉంది. 2017–18లో కరీంనగర్, గ్రేటర్ వరంగల్‌ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన తర్వాత.. ఆ రెండు నగరాల్లో రూ.1,879 కోట్లతో రహదారులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించింది.
క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పురపాలకశాఖ అధికారులు ప్రతిపాదించగా.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. స్మార్ట్‌సిటీలుగా ప్రకటించి ఆరేళ్లు దాటినా ఆ రెండు నగరాల్లో పనులు 60 శాతం దాటలేదు. నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు.. గ్రేటర్ వరంగల్‌లో రూ.179 కోట్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.102 కోట్లు అందుబాటులో ఉన్నా పనులు చేయించడంలో అధికారులు అలసత్వం చేశారనే ఫిర్యాదులున్నాయి.
పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. అందుకే గడువు పొడిగింపు..
ఉత్తరప్రదేశ్‌లోని 10 నగరాల్లో రూ.21,115.53 కోట్లతో 889 ప్రాజెక్టులు చేపట్టగా.. రూ.864.4 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఏడు నగరాల్లో 788 ప్రాజెక్టుల కోసం రూ.15,078.54 కోట్లు అంచనా కాగా.. 748 ప్రాజెక్టులను రూ.14,192.23 కోట్లతో పూర్తి చేయగా, 40 ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి.
తెలంగాణలోని రెండు నగరాల్లో రూ.2,817.65 కోట్ల విలువైన 169 ప్రాజెక్టుల్లో 97 పూర్తి కాగా, రూ.794.74 కోట్ల విలువైన 72 ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. తమిళనాడులోని 11 నగరాల్లో రూ.17,983.63 కోట్ల విలువైన 733 ప్రాజెక్టుల్లో రూ.513.54 కోట్లతో చేపట్టిన 25 పూర్తి కావలసి ఉంది.
రాజస్తాన్‌లోని అజ్మీర్, జైపూర్, కోట, ఉదయ్‌పూర్ నగరాల్లో రూ.8639.95 కోట్ల ఖర్చు కాగల 579 ప్రాజెక్టుల్లో 561 పూర్తి కాగా, రూ.324.73 కోట్లతో నడుస్తున్న 18 పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 47, ఛత్తీస్‌గఢ్‌లో 41, హిమాచల్‌ప్రదేశ్‌లో 32, బిహార్‌లో 30, జమ్ముకశీ్మర్‌లో 30, మహారాష్ట్రలో 29, కేరళలో 27, కర్ణాటకలో 26, హరియాణాలో 26 ప్రాజెక్టులు.. మొత్తం 714 పెండింగ్‌లో ఉన్నాయి.
స్మార్‌సిటీ మిషన్ వివరాలు..
స్మార్ట్‌సిటీ మిషన్ (ఎస్‌సీఎం)కు శ్రీకారం: 2015 ఆగస్టు 27
దేశంలో ఎంపిక చేసిన నగరాల సంఖ్య: 100 (మొదట 98 నగరాలు.. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్)
ఎస్‌సీఎం కింద విడుదలైన నిధులు: రూ.1,64,669 కోట్లు
ప్రతిపాదన చేసిన ప్రాజెక్టులవర్క్‌ఆర్డర్లు: 8,066
నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాలు: 13
90 శాతంలో ఆగిన నగరాలు : 48
75 శాతం వరకు పూర్తి చేసినవి : 23
నత్తనడకన రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు
స్మార్ట్‌సిటీలతో ప్రయోజనాలు..
» సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ
» వ్యర్థ నీటి రీసైక్లింగ్
» నీటి వృధాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం, గ్రీన్ స్పేసెస్
» భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన
» ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి వస్తు, సేవల లభ్యత
» ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల
» సహజ వనరుల సమర్థ వినియోగం
» గవర్నెన్స్‌లో పౌరుల భాగస్వామ్యం
» పర్యావరణ పరిరక్షణ–యాజమాన్యం
» ‘స్మార్ట్’ పట్టణాభివృద్ధి సాధన..సుస్థిర వృద్ధి
» గ్లోబల్ నెట్ వర్కింగ్
» సృజనాత్మక పరిశ్రమ
» ఆధునిక సమాచార వ్యవస్థఅందుబాటులోకి
» ఈ–అర్బన్ గవర్నెన్స్..
» పారిశ్రామికీకరణ
» భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment