
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రదారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.
అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.
సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment