
వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని ఒకరు..
మగ పిల్లాడిని కనలేదని మరొకరు..
కలకాలం కాపురం చేస్తామని చేసిన బాసలు మరిచిన ఆ ఇద్దరు భర్తలూ భార్యల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోపం పెంచుకున్న ఓ భర్త అదనుచూసి సహచరిని అంతం చేయగా, ఆడపిల్లలను కనిందన్న కోపంతో భార్యను హత్య చేశాడు మరో భర్త.
నమ్మించి మెడ కోశాడు..
గుడిహత్నూర్: కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సహించలేకపోయిన భర్త ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు. గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌కు చెందిన లట్‌పటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహం జరిగింది.
మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్ష పెంచకున్న మారుతి తన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అత్తగారింటికి వచ్చి వారితో మర్యాదగా ప్రవర్తించాడు.
గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నల్లా వద్దకు వెళ్లగా, మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపై దాడి చేసి పారిపోయాడు. రిమ్స్‌కు తరలించేలోపే ఆమె మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు.
ఆడపిల్లలు పుట్టారని హతమార్చాడు..
కాగజ్‌నగర్ రూరల్: మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవ పడి తలపై దాడి చేసి చంపాడు. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాంకు ఆసిఫాబాద్‌కు చెందిన భీంబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఓ కూతురు పుట్టగా, మగసంతానం లేదని జయరాం కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్‌కు చెందిన పోషక్కను (40) 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఇద్దరూ కూతుళ్లే రవళి (12), గౌతమి (6) పుట్టారు. దీంతో మగపిల్లలు లేరని జయరాం తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా రెండో భార్య పోషక్కతో గొడవ జరిగింది.
ఆవేశానికి గురైన జయరాం పలుగుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోషక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనస్థలాన్ని కాగజ్‌నగర్ ఇన్‌చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.