పురుగు మందు తాగిన కుటుంబం
భర్త, మరదలు మృతి... భార్య పరిస్థితి విషమం
ప్రాణాలతో బయటపడిన కూతురు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఘటన
తలమడుగు/తాంసి ఆదిలాబాద్ జిల్లా: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం, తాను అప్పు తీసుకున్న వారికి సమాధానం చెప్పలేక ఓ వ్యక్తి మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించి . అందులో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, తలమడుగు ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రాకేశ్ తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన తన మేనమామ వద్ద పెరిగాడు.
రాకేశ్‌కు ఆదిలాబాద్‌కు చెందిన లావణ్యతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కూతురు ప్రశస్త్య ఉంది. మొదట్లో ఆటో నడిపేవాడు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో మృతుడి మేనమామ–అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సాయి, స్పందన ఉన్నారు. వారు రాకేశ్ సంరక్షణలోనే ఉన్నారు. ఇద్దరూ ఉన్నతవిద్య అభ్యసించగా, సాయి బెంగ ళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్పందన ఇటీవల నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది.
రాకేందర్‌కు రూ.60 లక్షలు అప్పుగా..
ఆదిలాబాద్‌లోని విద్యానగర్ కాలనీలో 21 మంది సభ్యులతో కలిసి రాకేందర్ ఆర్‌కే సొసైటీని ప్రారంభించాడు. లావణ్య సైతం ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. అందులో కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అయితే ఆ సొసైటీ దివాలా తీసింది. అదే విధంగా రాకేందర్‌కు రూ.60లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాకేశ్–లావణ్య దంపతులు సూసైడ్ నోట్ రాశారు. బాకీ ఉన్న డబ్బుల వివరాలు కూడా అందులో పేర్కొన్నారు. రాకేందర్ తీసుకున్న ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివరించారు. దీంతో ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, బయట తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా రాకేశ్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
సొంత చేనుకు వచ్చిన...
శనివారం ఉదయం తలమడుగు మండలం ఉండం శివారులో ఉన్న తన సొంత చేనులో రాకేశ్(35), ఆయన భార్య లావణ్య, మరదలు స్పందన(19) పురుగు మందు తాగారు. ఆ తర్వాత లావణ్య జిల్లా కేంద్రంలో ఉండే తన బాబాయికి ఫోన్ ద్వారా సమాచారం ఇచి్చంది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాకేశ్, స్పందన చనిపోయారు. కొనఊపిరితో ఉన్న లావణ్యను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కూతురుకు తాగించేందుకు మందు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment