సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌పై వాగ్బాణాలు.. బీజేపీకి చురకలు.. ఎంఐఎం పార్టీపై విమర్శలు. అసలా మూడు పార్టీలూ ఒక్కటేనంటూ ఆరోపణ లు. మరోవైపు ఇందిర, రాజీవ్, సోనియాగాంధీల పేర్లను ప్రస్తావిస్తూ..తనది తెలంగాణతో కుటుంబ బంధమంటూ ఆత్మీయత పంచే ప్రయత్నం. అంతేకాదు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో మమేకం. సింగరేణి కార్మికులకు భరోసా.. టీ షాపు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో కులాసా కబుర్లు.. సమ స్యలపై ఆరా.. ఎక్కడ కనబడితే అక్కడ చిన్నారుల కు చాక్లెట్లు..ఇదీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో మూడురోజుల పర్యటన సాగిన తీరు.
ఆశలు రేపిన రాహుల్..
రాష్ట్రంలో రాహుల్ తొలివిడత విజయభేరి యాత్ర శుక్రవారంతో ముగి సింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నించారు. ములుగు, భూపా లపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, బోధన్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదు గా ఆయన మూడురోజుల బస్సుయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు, వ్యవహార శైలి, సామాన్యుడిలా కలిసి పోయేందుకు ప్రయత్నించడం మంచి ప్రభావం చూపుతుందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ప్రజలను ఆకట్టుకోవడంలో రాహుల్ సఫలీకృతులయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ బలంగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటన స్థానిక కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపిందని అంటున్నారు. నేతల్లోనూ ఆయన జోష్ నింపారని, ఇదే ఊపు కొనసాగిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు!
ఇటు ‘యుద్ధం’.. అటు ‘బంధం’
రాహుల్ ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా ఇది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించగలిగారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో పాటు తెలంగాణతో తమ కుటుంబానికి ఉన్నది కేవలం ఎన్నికల బంధం, రాజకీయ బంధమే కాదని, ప్రేమానురాగాల అనుబంధమని, అందుకే చెల్లి ప్రియాంకను తెలంగాణకు తీసుకువచ్చానని చెప్పిన రాహుల్..తెలంగాణపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని బలంగా చెప్పే ప్రయత్నం చేశారనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు సామాజిక న్యాయం అంశాన్ని కూడా రాహుల్ చర్చకు తెచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని మెజార్టీ బీసీ వర్గాలకు కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారని, 18 శాఖలు కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదంటూ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామంటూ గట్టి హామీ ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.
అయితే రాహుల్‌తో పాటు వచ్చిన ప్రియాంకా గాంధీ కేవలం ఒక్కరోజు మాత్రమే రాష్ట్రంలో ఉండడం పార్టీ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురి చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసేలోపు మరో రెండు దఫాలుగా యాత్ర సాగుతుందని, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment