‘ఆర్‌ఆర్‌’ ట్యాక్స్‌ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ | PM Narendra Modi Fires On RR Tax BRS and Congress | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌’ ట్యాక్స్‌ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ

Published Thu, May 9 2024 4:08 AM | Last Updated on Thu, May 9 2024 4:08 AM

బుధవారం వేములవాడ సభలో ప్రధాని మోదీ అభివాదం. చిత్రంలో బండి సంజయ్‌

బుధవారం వేములవాడ సభలో ప్రధాని మోదీ అభివాదం. చిత్రంలో బండి సంజయ్‌

సగం రాష్ట్రంలోని ‘ఆర్‌’కు.. సగం ఢిల్లీలోని ‘ఆర్‌’కు పంపకం.. వేములవాడ, వరంగల్‌ బీజేపీ సభల్లో ప్రధాని మోదీ ఆరోపణ

ట్రిపుల్‌ ఆర్‌ సినిమా వసూళ్లను దాటిన కాంగ్రెస్‌ ‘ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌’ 

అమరుల కుటుంబాలకు పెన్షన్, భూమి ఏవి? 

మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500 అమలు ఏది? 

ఏడాదికో ప్రధాని అంటూ ఇండియా కూటమిలో ఒప్పందం 

అలా అయితే దేశం భవిష్యత్తు ఏం కావాలి 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ తోడు దొంగలే! 

ఓటుకు నోటు, కాళేశ్వరం కేసుల్లో దర్యాప్తు లేకపోవడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్య 

చర్మం రంగు నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లలా ఉంటారని రాహుల్‌ ఫ్రెండ్‌ పిట్రోడా అన్నారు.. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా? అంటూ ధ్వజం

కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు చీల్చి ముస్లింలకు పంచుతుంది

సాక్షి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ వేములవాడ: ‘‘కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అభివృద్ధి పూర్తిగా ఆగి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది, కాంగ్రెస్‌ వాళ్లు.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందులో సగం హైదరాబాద్‌లోని ‘ఆర్‌’కు వెళ్తే.. రెండో సగం మరో ‘ఆర్‌’ కోసం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌.. ట్రిపుల్‌ ఆర్‌ సినిమా రూ.వెయ్యికోట్ల వసూళ్లను అనతికాలంలోనే దాటడం ఇక్కడి అవినీతికి నిదర్శనం..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంత అబద్ధాల కోరు అన్నది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్‌ చేతులెత్తేయబోతోందని.. లోక్‌సభ ఎన్నికల వరకు ఆగి మోసగిస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్‌ ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, మోసం చేసింది. తెలంగాణలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. ప్రజలకు గంట గడవడం కష్టమవుతోంది. అలాంటి నమ్మక ద్రోహి కాంగ్రెస్‌ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు కాంగ్రెస్‌ను అధికారమిస్తే.. కుటుంబానికే పెద్దపీట వేసి, జాతి ప్రయోజనాలకు గంగలో ముంచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించింది. అదే పీవీని బీజేపీ సర్కారు భారతరత్నతో గౌరవించింది. 

బీసీలకు కోత వేసి ముస్లింలకు ఇస్తుంది 
కాంగ్రెస్‌ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్‌ కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లు కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో అదే ప్రయత్నం జరిగినా హైకోర్టు నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. అందుకే చట్టం చేసి అయినా.. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్‌ఎస్‌ కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కేవలం ముస్లింల కోసం ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. 2014లో అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని మోసం చేసింది. దళిత బంధు పేరిట మోసం చేసింది. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. 

ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. 
మాదిగ సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం నా చిన్న తమ్ముడు మంద కృష్ణ చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. అమలు చేసి చూపిస్తా. 

కాంగ్రెస్‌ సీట్లను భూతద్దంలో చూసుకోవాల్సిందే.. 
ప్రపంచమంతా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ కార్యభారాన్ని, శక్తిని తప్పుడు చేతుల్లో పెట్టొద్దు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏరకమైన పాపాలు చేసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులకో కుంభకోణం, అవినీతి బయటపడుతుండేవి. దేశంలోని పెద్ద పట్టణాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ఇప్పుడు ఎన్టీయే విజయరథం వేగంగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో ముందు నిలిచింది. కాంగ్రెస్‌ ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసే పరిస్థితి ఏర్పడింది. నాలుగో దశ పూర్తయ్యే సరికి భూతద్దంతోనూ దొరకవు. మైక్రోస్కోప్‌ కావాల్సి వస్తుంది. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తోడు దొంగలే! 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ తోడుదొంగలే. పైకి తిట్టుకున్నా అవినీతి అనే వారధి వారిని తెరవెనుక కలుపుతోంది. అందుకే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేతను, కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌ నేతలను రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం విషయంలో బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్య అవగాహన ఉంది. కానీ బీజేపీ రంగంలోకి దిగేసరికి వారిలో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌లకు కుటుంబ రాజకీయాలే తొలి ప్రాధాన్యం. బీజేపీకి దేశమే తొలిప్రాధాన్యం. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల అడ్రస్‌ గల్లంతే. తెలంగాణ ప్రజలంతా ఏకమై మే 13న ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి..’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఓరుగల్లు సభలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. 

చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా..? 
మేం 2014లో తొలిసారి అధికారంలోకి రాగానే దళితుడైన రాంనాథ్‌ గోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. 2019లో ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. కాంగ్రెస్‌ ఈ ఇద్దరిని వ్యతిరేకించింది. ముఖ్యంగా ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ ఎందుకు అంతగా వ్యతిరేకించిందా? అని ఎంతగా ఆలోచించినా ఇన్నాళ్లూ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ద్రౌపదీ ముర్ము గారి చర్మం రంగు నలుపు. ఇక్కడున్న రాజ కుమారుడి (రాహుల్‌ గాం«దీ)కి అమెరికాలో ఓ ఫ్రెండ్‌ ఫిలాసఫర్, మార్గదర్శి (శ్యామ్‌ పిట్రోడా) ఉన్నారు. 

చర్మం రంగు నల్లగా ఉన్నవాళ్లందరూ ఆఫ్రికన్లలా ఉంటారని ఆయన ఈ మధ్య అన్నారు. చర్మం రంగును బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్‌ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి రాజకుమారుడికి బోధించారు. నలుపు చర్మం ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపే. మరి అలాంటిది చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? ఇందుకే ఆ రాజ కుమారుడి మీద నాకు కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు. కానీ నా దేశ ప్రజలను చర్మం రంగు పేరిట రాజ కుమారుడి మార్గదర్శకుడు లండన్‌లో కూర్చొని , అమెరికాలో కూర్చొని తిట్టడం నాకు కోపం తెప్పిస్తోంది. 

రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ 
బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకున్నారు. నేరుగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలానగర్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. సభ ముగిశాక హెలికాప్టర్‌లో వరంగల్‌ పయనమయ్యారు. 

‘ఒక్కొక్కరి పొలంలో పది మీటర్లు..’ కాంగ్రెస్‌పై మోదీ సెటైర్‌ లెక్క! 
‘‘ఈసారి ఇండియా కూటమి ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను తీసుకొస్తామని చెప్తోంది. ఇదీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే మరో పద్ధతిలో చెబుతా. పది మంది రైతులు తమ పొలాల్లో బోరు వేయించాలనుకున్నారు. ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తం పరిశీలించి, 100 మీటర్లు తవ్వితే నీళ్లు పడతాయని చెప్పారు. అప్పుడు ఈ రైతులు.. ఒకరి పొలంలో పది మీటర్లు, పక్క పొలంలో పది మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో పది మీటర్లు.. ఇలా పది మంది పొలాల్లో తవ్వితే 100 మీటర్లు అయిపోతుందనుకున్నారు. అలా చేస్తే నీళ్లు వస్తాయా? ఇండియా కూటమి అంతే. పార్టీకో ప్రధాని ఉంటే దేశం భవిష్యత్‌ ఏమవుతుంది?’’ 

రుణమాఫీపై చేతులెత్తేస్తారు! 
‘‘కాంగ్రెస్‌ అతిపెద్ద నాయకురాలు (సోనియా) పుట్టినరోజు డిసెంబర్‌ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్‌సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. 

ఇది మిమ్మల్ని మోసం చేయడమే.. మీ మనోభావాలను దెబ్బతీయడమే.. వాళ్లు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. 
సనాతన ధర్మాన్ని తిడుతూ, ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు..’’ – మోదీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement