Smart City Mission
-
సీ4సీ చాలెంజ్‌కు 2 నగరాలు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సైకిల్ ఫర్ ఛేంజ్(సీ4సీ) చాలెంజ్ కార్యక్రమం స్టేజీ–1 కింద హైదరాబాద్, వరంగల్ నగరాలు సహా దేశంలోని 25 నగరాలు, పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీస్ మిషన్ సీ4సీ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మేలు చేయడానికి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, దీని వల్ల నగరాల్లో కాలుష్యం సైతం తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 107 నగరాలు ‘సీ4సీ’చాలెంజ్‌కు రిజిస్ట్రర్ కాగా, తొలి విడత కింద ఎంపిక చేసిన 25 నగరాల పేర్లను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. రాష్ట్ర పురపాలక శాఖ ఈ చాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయ డంతో హైదరాబాద్, వరంగల్ నగరాల ఎంపికకు దోహదపడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఈ కార్యక్ర మానికి హెచ్ఎండీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా)లు సాంకేతిక సహాయం అందిస్తున్నాయి. పోలీసు శాఖ సహకారంతో ఇప్పటికే కేబీఆర్పార్క్, నెక్లెస్ రోడ్డులో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ లేని విధులు, సైకిల్ అద్దె సదుపాయాలు, సైక్లింగ్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను సీ4సీ కింద ఎంపికైన నగరాల్లో అమలు చేయనున్నారు. ఈ 25 నగరాల్లో ఏడు నగరాలను స్టేజీ–2 కింద ఎంపిక చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ త్వరలో ప్రకటించనుంది. స్టేజీ–2 కింద ఎంపికైన ఏడు నగరాల్లో సైక్లింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి చొప్పున మంజూరు చేయనుంది. నర్చరింగ్ నెబర్హుడ్ చాలెంజ్‌కు హైదరాబాద్, వరంగల్ ఎంపిక పట్టణ ప్రాంతంలో 0–5 ఏళ్ల బాలబాలికలకు సురక్షితమైన, మెరుగైన సదుపాయాలు కలిగిన పరిసరాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘నర్చరింగ్ నెబర్ హుడ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద హైదరాబాద్, వరంగల్ నగరాలుసహా దేశంలోని మొత్తం 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. 63 నగరాలు ఈ చాలెంజ్‌లో పోటీపడ్డాయి. తొలి విడత కింద ఎంపికైన 25 నగరాలకు 6 నెలలపాటు చాలెంజ్ అమలుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు. ఈ నగరాల్లోని టాప్ 10 నగరాలకు 2 ఏళ్లపాటు సాంకేతిక సహకారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అందించనుంది. -
‘స్మార్ట్ మిషన్’ చతికిల
సాక్షి, కరీంనగర్: నరేంద్రమోదీ సారథ్యంలో 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని వంద నగరాలను అభివృద్ధి సేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 2015 జూన్‌లో ‘స్మార్ట్‌సిటీ మిషన్’ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాలను ఈ మిషన్‌లోకి ప్రతిపాదించారు. స్మార్ట్ సిటీ మిషన్ చాలెంజ్ పేరుతో నగరాలకు పోటీ నిర్వహించి ఐదు దశల్లో ఎంపిక పూర్తి చేశారు. నాలుగో దశ చాలెంజ్‌లో 2017, జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాను కరీంనగర్ దక్కించుకుంది. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1878 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం సమంగా భరించాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కేంద్రం విడుదల చేసే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్య నిధులు జమకావడం లేదు. ఎమ్మెల్యేలకు ఏటా ఇచ్చే రూ.100 కోట్లనే కరీంనగర్లో స్మార్ట్‌సిటీ నిధులుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం 2019–20 బడ్జెట్లో కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌కు రూపాయి కూడా కేటాయించలేదు. కరీంనగర్ రూపురేఖలు మార్చేందుకు వీలున్న ఈ ప్రాజెక్టు అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కేంద్రం మంజూరు చేసిన నిధులు రూ.218 కోట్లు 2017, జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాతో ‘కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటైంది. మున్సిపల్ కమిషనర్ ఎండీగా, కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతాయి. స్మార్ట్‌సిటీ పనులకు రూ.1,878 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఇందులో ఏరియా బేస్డ్ డెవలప్మెంట్(ఏబీడీ) కింద రూ.1,410 కోట్లు, పాన్ సిటీ సొల్యూషన్స్ కింద రూ.468 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.218 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశలో చేపట్టే స్మార్ట్‌సిటీ పనులకు మాస్టర్ ప్లాన్ ఆధారంగా స్మార్ట్ రోడ్లు, పార్కింగ్ ప్లేసెస్, ఫుట్‌ఫాత్‌లు, సైకిల్ ట్రాక్స్, కార్‌పార్కింగ్, పోల్షిఫ్టింగ్ పనులకు సంబంధించి ఆర్వీ కన్సల్టెన్సీ డిజైన్లు సిద్ధం చేసింది. మొదటి విడతలో స్మార్ట్‌రోడ్ల నిర్మాణం కోసం 2018, జూలై 3న రూ.217.70 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. అదే యేడాది ఆగస్టు 8న టెక్నికల్ బిడ్ తెరిచారు. టెండర్లు ఖరారు కాకముందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగస్టు 15న హడావిడిగా అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే స్మార్ట్ రోడ్ల పనులెక్కడా ప్రారంభం కాలేదు. అటకెక్కిన టవర్ సర్కిల్ ఆధునికీకరణ ? స్మార్ట్‌సిటీ కేంద్రంగా కరీంనగర్‌కు చారిత్రాత్మకమైన టవర్‌సర్కిల్‌ను ఎంపిక చేశారు. టవర్‌సర్కిల్ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలనేది ప్లాన్. స్మార్ట్‌సిటీ వెబ్సైట్లో టవర్ సర్కిల్ భవిష్యత్ ఊహాచిత్రాలను చూస్తే ఇది కరీంనగరేనా అనిపించక మానదు. ఈ ప్లాన్ కింద సుమారు 60 శాతం నగరం రిట్రోఫిటింగ్ కిందకు రానుంది. ఇందు లో 29 డివిజన్లకు చోటిచ్చారు. 2వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు, 28, 29, 31, 38, 39, 45 డివిజన్లను రిట్రోఫిటింగ్ కింద చేర్చగా... మిగతా డివిజన్లను పాన్‌సిటీ కింద అభివృద్ధి చేయాలనేది ప్లాన్. అయితే ఇప్పటి వరకు టవర్ సర్కిల్ విషయంలో ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయలేదు. రూ.13 కోట్లతో టవర్‌సర్కిల్‌ను అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో అభివృద్ధి చేయాలని టెండర్లు పిలిచారు. ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో గోల్డెన్ టెంపుల్ దగ్గరున్న మార్కెట్ తరహాలో ఎలా అభివృద్ధి చేస్తారో అర్థంకాని విషయం. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న టవర్ సర్కిల్‌కు కిలోమీటర్ చదరపు విస్తీర్ణంలో సుందరీకరణ అనేది అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించిన పనులు నత్తనడకే! స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు మోక్షం లేదు. రూ.24 లక్షలతో చేపట్టిన ఒక్క కమాన్ జంక్షన్‌ను మాత్రమే ఇప్పటి వరకు పూర్తిచేశారు. కమాన్ చుట్టూ చిన్న ఐలాండ్ ఏర్పాటు చేసి, కరీంనగర్ స్మార్ట్ సిటీ అనే బోర్డును పెట్టి ‘సుందరీకరణ’ పూర్తి చేశారు. అయితే కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లే రోడ్డును చూస్తే కరీంనగర్ స్మార్ట్‌నెస్ ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. బైపాస్ రోడ్డుకు కలిపే ఈ మార్గంలో వర్షం పడితే జనాలు, వాహనదారులకు నరకమే. ఇక రూ.18 కోట్లతో అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి పనులు రెండు నెలల క్రితం అప్పటి మేయర్ రవీందర్‌సింగ్, ఎంపీ బండి సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి. రూ.3.80 కోట్లతో సర్కస్‌గ్రౌండ్‌లో పార్కు పనులు జరుగుతున్నాయి. పాత హైస్కూల్లో రూ.7.20 కోట్లతో ప్లేగ్రౌండ్, పార్క్ పనులు ప్రారంభించినా.. అవి నత్తనడకన సాగుతున్నాయి. రూ.34 కోట్లతో హౌసింగ్‌బోర్డు అభివృద్ధి కోసం టెండర్లు పూర్తిచేసి, పనులు అప్పగించినా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. స్మార్ట్ రోడ్లకు సంబంధించిన కొన్ని టెండర్లు సాంకేతిక కారణాలతో రద్దయ్యాయి. సీఎం హామీ నిధులు స్మార్ట్ సిటీ ఖాతాలోకి? శాసనసభ్యులకు నియోజకవర్గానికి రూ.వంద కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదటి విడత రూ.100 కోట్లతో 74 పనులు, రెండో విడత రూ.147 కోట్లతో 233 పనులు, మూడో విడత రూ.100 కోట్లతో 86 పనులకు టెండర్లు నిర్వహించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు కేటాయించారు. అయితే ఈ నిధులను స్మార్ట్‌సిటీ మిషన్ భాగస్వామ్యం కింద జమకట్టినట్లు సమాచారం. ఈ పనులను మున్సిపల్, ఆర్అండ్బీ, పబ్లిక్‌హెల్త్, పంచాయతీరాజ్, సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ద్వారా చేపట్టారు. అడ్డగోలుగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎక్కడి పనులను అక్కడే వదిలేశారు. రూ.347 కోట్ల అభివృద్ధి పనుల్లో 30 శాతం పనులు కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు
కార్పొరేషన్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం.. నచ్చిన సంస్థకు ఆ ప్రాజెక్టుని అప్పగించడం.. జీవీఎంసీ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కట్టబెట్టడం. గత మూడేళ్లుగా ఇదే తంతు. ఇలాగైతే.. కార్పొరేషన్ పుట్టి మునిగిపోవడం ఖాయం. చివరికి ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలంటే ఒక్క రూపాయీ మిగలదేమో..! – ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి.. ఆయన మాటల్లో కించిత్తయినా అవాస్తవం లేదు. ప్రస్తుతం జీవీఎంసీలో జరుగుతున్న తీరును పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసా పైసా కూడబెట్టుకొని మహా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల పాలవుతోంది. స్మార్ట్ సిటీ, అమృత్ నగరమంటూ ప్రకటించి.. పప్పుబెల్లాలు చేతికిచ్చి మిగిలిన సొమ్ము పెట్టుబడి పెట్టి చేస్తున్న ప్రాజెక్టులు ఖజానాను ఊడ్చేస్తున్నాయి. తాజాగా.. హైబ్రిడ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు కూడా అదే కోవలోకి వస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న నగరంపై అదనంగా రూ.150 కోట్ల భారం వేస్తోంది. విశాఖ సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థకు కొత్త ప్రాజెక్టులు తలబొప్పి కట్టిస్తున్నాయి. అరకొర నిధులు మంజూరు చేసి మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్ భరించుకొని పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలను ఆధునికీకరణ, స్వచ్ఛత పేరుతో స్మార్ట్‌సిటీ, అమృత్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీధులు సర్వాంగ సుందరంగా, నగరంలోని ఓ ప్రాంతం సాంకేతిక రూపు సంతరించుకునేలా స్మార్ట్‌సిటీ, నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాల పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాలను ప్రవేశపెట్టింది. పేరుకే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా.. ఖర్చులో సింహభాగం కార్పొరేషన్‌దే కావడం గమనార్హం. ఈ పథకాల కారణంగానే జీవీఎంసీ ఖజానా ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 33.33 శాతం నిధులు మా త్రమే అందిస్తుంది. అంటే అమృత్ పథకం కింద జీవీఎంసీ పరిధిలో రూ.250 కోట్లు పనులు చేపట్టాలని టెండర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.83 కోట్లు కాగా, జీవీఎంసీపై రూ.167 కోట్ల భారం పడుతోంది. సివరేజ్... గ్రేటర్ నిధులు బ్రేవ్ జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 2007లో రూ.244 కోట్ల అంచనాతో 320 కిలోమీటర్ల పొడవునా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని అనుబంధంగా కార్పొరేషన్ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నరవలో 108 ఎంఎల్డీ సామర్థ్యంతో అతిపెద్ద ఎస్టీపీ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు 50 శాతం మా త్రమే పూర్తయ్యాయి. మరోవైపు.. ఈ సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్వహణకు జీవీఎంసీ తల ప్రాణం తోకకొస్తోంది. వీటికి విద్యుత్ సరఫరా కోసం హెచ్‌టీ పవర్ సప్లై అవసరమవుతోంది. నిర్వహణ వ్యయం తడిసి మోపెడై కార్పొరేషన్ ఖజనాను ఖాళీ చేసేస్తోంది. జీవీఎంసీ నెత్తిన హైబ్రిడ్ ఎస్టీపీ శఠగోపం ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతోనే సతమతమవుతున్న కార్పొరేషన్‌కు తాజాగా ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసిన మరో హైబ్రిడ్ ఎస్టీపీ ప్రాజెక్టు గుదిబండలా మారనుంది. రూ.762 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో తొలి విడతగా రూ.412కోట్లతో పెందుర్తిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరవలో సగం పనులు పూర్తయిన ఎస్టీపీని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది. రూ.412 కోట్లలో రూ.150 కోట్లు జీవీఎంసీ భరించాల్సింది. అప్పోసొప్పో చేసి ప్లాం టు పూర్తి చేసిందే అనుకున్నా.. ఈ భారీ ఎస్టీపీ నిర్వహణ ఖర్చుల మోత మోగిపోనుంది. ఈ హైబ్రిడ్ సివరేజ్ ట్రీ ట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు అ య్యే అవకాశముందని జీవీఎంసీ అంచనా వేస్తోంది. అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం ఈ ప్రాజెక్టులు ప్రారంభించాలంటే కార్పొరేషన్ అప్పుల బాట పట్టాల్సిందే. కొన్నేళ్లుగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో... ఉన్న వాటితోనే సర్దుకుపోతున్న పరిస్థితి. రెండేళ్ల క్రితం వరకూ రూ.400 కోట్లు అప్పుగా ఉండగా.. ప్రస్తుతం వాటిని సగం మేరకు తీర్చేశారు. మిగిలిన రూ.198 కోట్లను చెల్లించేందుకు మూడు నెలలకోసారి రూ.3 నుంచి 4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తి చేసేందుకు రూ.75 కోట్లు అప్పు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే జీవీఎంసీ అధికారులు లేఖ రాశారు. మరోవైపు.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.100 కోట్ల 14 వఆర్థిక సంఘం నిధుల్నీ కేంద్రం నిలిపేసింది. ఇవి వస్తాయన్న దీమాతో అభివృద్ధి పనులు పూర్తి చేసిన కార్పొరేషన్.. ఇప్పుడు దిక్కులు చూస్తూ.. జనరల్ ఫండ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. జీవీఎంసీకి వచ్చే ఆదాయ వనరుల్లో ప్రధానంగా ఉండే ఆస్తి పన్ను రూ.200 కోట్లు ఉద్యోగుల జీతాలకు సరిపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ నుంచి రూ.100 కోట్లు, నీటి సరఫరా నుంచి సుమారు రూ.50 కోట్లు ఆదాయం వస్తున్నా.. సాధారణ పనులకు సరిపోతున్నాయి. 2007 నుంచి ఆస్తి పన్నుని, 2012 నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని పెంచలేదు. వీటిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నిరోధిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండేళ్లలో గ్రేటర్ మళ్లీ రూ.400 కోట్ల అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితే ఎదురవుతుందని జీవీఎంసీ అధికారిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజల అవసరాల కోసమే.. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులూ ప్రజల అవసరాల కోసమే చేపట్టాం. ప్రస్తుతం ఉన్న నిధులతో పనులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్ సిటీ అన్నప్పుడు ఖర్చులు తప్పవు. ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు అమ్మగా వచ్చిన నిధులతో ప్లాంట్ నిర్వహణ జరుగుతుంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ నిధులు ఖర్చు చెయ్యాలి. ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
స్మార్ట్ కి స్టార్టింగ్ ట్రబుల్
* ప్రకటించి ఏడాదైనా ముందుకు కదలని పనులు * నేడు కాకినాడలో ఆకర్షణీయ నగర వార్షికోత్సవం కాకినాడ : దేశవ్యాప్తంగా 100 నగరాలతో పోటీపడి తొలివిడత స్మార్ట సిటీ జాబితాలో స్థానం దక్కించుకున్న కాకినాడ ఆకర్షణీయ నగరం దిశగా అంతంతమాత్రంగా అడుగులేస్తోంది. మొదటి ఏడాదికి నిధులు విడుదలైనా, అవి చేతికి అందక పనులు నెమ్మదించాయి. స్మార్ట్‌సిటీ మిషన్‌ను ప్రకటించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం ఆకర్షణీయ నగరాల్లో వార్షికోత్సవాలను జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. నిధులు చేతికందక.. తొలివిడత స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడకు ప్రభుత్వం రూ.376 కోట్లు దాదాపు మూడు నెలల క్రితమే విడుదల చేసింది. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, మిగిలిన 50 శాతం కేంద్రవాటాగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఆ నిధులు చేతికి అందలేదు. విడుదలైన స్మార్ట్‌సిటీ నిధులు ఖర్చు చేయాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతితో పీడీ అకౌంట్ ప్రారంభించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయగా క్లియరెన్స్‌రాలేదని, అందువల్లే నిధులు ఇంకా జమకాలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య కొలిక్కి వచ్చి పనులు వేగవంతం చేస్తామని వారు చెబుతున్నారు. సోలార్ పరికరాల ఏర్పాటు స్మార్ట్ సిటీలో భాగంగా విద్యుత్ ఆదాచేసే క్రమంలో సోలార్ పరికరాల ఏర్పాటుకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.40కోట్ల విలువైన ఐదుమెగా వాట్ల విద్యుత్ పరికరాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. సుమారు 42 ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ-పాఠశాలలు ప్రారంభం స్మార్ట్‌సిటీలో భాగంగా రామకృష్ణారావుపేటలోని మున్సిపల్ స్కూల్లో ఈ-పాఠశాలకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. కంప్యూటర్ ల్యాబ్స్, ప్రొజెక్టర్లు, ఆడియో, సీడీ, డీవీడీ, వీడియో ద్వారా విద్యాబోధన చేసేలా ఈ-పాఠశాలలకు శ్రీకారంచుడుతున్నారు. తొలివిడత ఒక పాఠశాలలో ప్రారంభిస్తున్నా, మలివిడత 23 స్కూళ్లల్లో ప్రవేశపెట్టనున్నారు. హైజనిక్ స్టాల్స్ తోపుడుబళ్ల స్థానంలో హైజనిక్ ఫుడ్ వెండింగ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో దాదాపు 100 వరకు మెషీన్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించి శనివారం వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు ప్రత్యేక సదస్సు స్మార్ట్‌సిటీ తొలివార్షికోత్సవ సదస్సును శనివారం ఉదయం ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొననున్నారు. వేగవంతంగా స్మార్ట్‌సిటీ పనులు స్మార్ట్‌సిటీ దిశగా పనులన్నీ వేగవంతమవుతున్నాయి. తొలుత సోలార్ పరికరాల ఏర్పాటు, ఈ పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. ఆ తరువాత మిగిలిన పనులను వేగవంతం చేస్తాం. ఇప్పటికే కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌గా రిజిష్టర్ చేయించాం. అవసరమైన అన్ని ప్రతిపాదనలు ఒక్కొక్కటిగా వేగవంతం చేస్తాం. - ఎస్.అలీమ్‌భాషా, కాకినాడ కమిషనర్ -
జర్మనీ పర్యటనకు వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం రాత్రి జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జర్మనీలో జరిగే వంద స్మార్ట్ సిటీ మిషన్ సదస్సులో పాల్గొంటారు. జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తో కలిసి వెంకయ్య మెట్రోపాలిటిన్ సొల్యూషన్ ఫెయిర్-2016ను సందర్శిస్తారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో సమావేశమవుతారు. కాగా భారత్‌లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం అందించనుంది. ఇక ఈ పర్యటనలోనే కేంద్రమంత్రి వెంకయ్య పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో భేటీ అవుతారు. అలాగే భారత్‌లో వంద ఆకర్షణీయ నగరాల నిర్మాణం గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. జర్మనీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ఉపయోగిస్తున్న సాంకేతికత, ఇతర పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. బుధవారం బెర్లిన్‌లోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రాన్ని వెంకయ్య సందర్శిస్తారు. బెర్లిన్‌లో రవాణా వ్యవస్థ డిజిటలైజేషన్‌పై చర్చించనున్నారు. అలాగే గురువారం ఉదయం జర్మనీ పార్లమెంటు భవనాన్ని సందర్శించి స్పీకర్‌తో భేటీ అవుతారు. పార్లమెంటు ఉపాధ్యక్షురాలు ఉల్లా ష్మిత్, ఇండోజర్మన్ పార్లమెంటరీ బృందంతో సమావేశమవుతారు. తిరిగి వెంకయ్య శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకుంటారు. -
అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్‌సిటీస్ మిషన్‌కు రూ. 3205కోట్లు కేటాయించారు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500కోట్ల నిధులిస్తారు.