బస్టాండ్ కూడలిలో గుంతలు
సాక్షి, కరీంనగర్: నరేంద్రమోదీ సారథ్యంలో 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని వంద నగరాలను అభివృద్ధి సేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 2015 జూన్‌లో ‘స్మార్ట్‌సిటీ మిషన్’ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాలను ఈ మిషన్‌లోకి ప్రతిపాదించారు. స్మార్ట్ సిటీ మిషన్ చాలెంజ్ పేరుతో నగరాలకు పోటీ నిర్వహించి ఐదు దశల్లో ఎంపిక పూర్తి చేశారు.
నాలుగో దశ చాలెంజ్‌లో 2017, జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాను కరీంనగర్ దక్కించుకుంది. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1878 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం సమంగా భరించాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కేంద్రం విడుదల చేసే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్య నిధులు జమకావడం లేదు. ఎమ్మెల్యేలకు ఏటా ఇచ్చే రూ.100 కోట్లనే కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ నిధులుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం 2019–20 బడ్జెట్‌లో కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌కు రూపాయి కూడా కేటాయించలేదు. కరీంనగర్ రూపురేఖలు మార్చేందుకు వీలున్న ఈ ప్రాజెక్టు అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
కేంద్రం మంజూరు చేసిన నిధులు రూ.218 కోట్లు
2017, జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాతో ‘కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ఏర్పాటైంది. మున్సిపల్ కమిషనర్ ఎండీగా, కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతాయి. స్మార్ట్‌సిటీ పనులకు రూ.1,878 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఇందులో ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్(ఏబీడీ) కింద రూ.1,410 కోట్లు, పాన్ సిటీ సొల్యూషన్స్ కింద రూ.468 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.218 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశలో చేపట్టే స్మార్ట్‌సిటీ పనులకు మాస్టర్ ప్లాన్ ఆధారంగా స్మార్ట్ రోడ్లు, పార్కింగ్ ప్లేసెస్, ఫుట్‌ఫాత్‌లు, సైకిల్ ట్రాక్స్, కార్‌పార్కింగ్, పోల్‌షిఫ్టింగ్ పనులకు సంబంధించి ఆర్వీ కన్సల్టెన్సీ డిజైన్‌లు సిద్ధం చేసింది. మొదటి విడతలో స్మార్ట్‌రోడ్ల నిర్మాణం కోసం 2018, జూలై 3న రూ.217.70 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. అదే యేడాది ఆగస్టు 8న టెక్నికల్ బిడ్ తెరిచారు. టెండర్లు ఖరారు కాకముందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగస్టు 15న హడావిడిగా అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే స్మార్ట్ రోడ్ల పనులెక్కడా ప్రారంభం కాలేదు.
అటకెక్కిన టవర్ సర్కిల్ ఆధునికీకరణ ?
స్మార్ట్‌సిటీ కేంద్రంగా కరీంనగర్‌కు చారిత్రాత్మకమైన టవర్‌సర్కిల్‌ను ఎంపిక చేశారు. టవర్‌సర్కిల్ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలనేది ప్లాన్. స్మార్ట్‌సిటీ వెబ్‌సైట్‌లో టవర్ సర్కిల్ భవిష్యత్ ఊహాచిత్రాలను చూస్తే ఇది కరీంనగరేనా అనిపించక మానదు. ఈ ప్లాన్ కింద సుమారు 60 శాతం నగరం రిట్రోఫిటింగ్ కిందకు రానుంది. ఇందు లో 29 డివిజన్లకు చోటిచ్చారు. 2వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు, 28, 29, 31, 38, 39, 45 డివిజన్‌లను రిట్రోఫిటింగ్ కింద చేర్చగా... మిగతా డివిజన్లను పాన్‌సిటీ కింద అభివృద్ధి చేయాలనేది ప్లాన్.
అయితే ఇప్పటి వరకు టవర్ సర్కిల్ విషయంలో ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయలేదు. రూ.13 కోట్లతో టవర్‌సర్కిల్‌ను అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో అభివృద్ధి చేయాలని టెండర్లు పిలిచారు. ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో గోల్డెన్ టెంపుల్ దగ్గరున్న మార్కెట్ తరహాలో ఎలా అభివృద్ధి చేస్తారో అర్థంకాని విషయం. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న టవర్ సర్కిల్‌కు కిలోమీటర్ చదరపు విస్తీర్ణంలో సుందరీకరణ అనేది అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రారంభించిన పనులు నత్తనడకే!
స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు మోక్షం లేదు. రూ.24 లక్షలతో చేపట్టిన ఒక్క కమాన్ జంక్షన్‌ను మాత్రమే ఇప్పటి వరకు పూర్తిచేశారు. కమాన్ చుట్టూ చిన్న ఐలాండ్ ఏర్పాటు చేసి, కరీంనగర్ స్మార్ట్ సిటీ అనే బోర్డును పెట్టి ‘సుందరీకరణ’ పూర్తి చేశారు. అయితే కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లే రోడ్డును చూస్తే కరీంనగర్ స్మార్ట్‌నెస్ ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. బైపాస్ రోడ్డుకు కలిపే ఈ మార్గంలో వర్షం పడితే జనాలు, వాహనదారులకు నరకమే.
ఇక రూ.18 కోట్లతో అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి పనులు రెండు నెలల క్రితం అప్పటి మేయర్ రవీందర్‌సింగ్, ఎంపీ బండి సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి. రూ.3.80 కోట్లతో సర్కస్‌గ్రౌండ్‌లో పార్కు పనులు జరుగుతున్నాయి. పాత హైస్కూల్‌లో రూ.7.20 కోట్లతో ప్లేగ్రౌండ్, పార్క్ పనులు ప్రారంభించినా.. అవి నత్తనడకన సాగుతున్నాయి. రూ.34 కోట్లతో హౌసింగ్‌బోర్డు అభివృద్ధి కోసం టెండర్లు పూర్తిచేసి, పనులు అప్పగించినా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. స్మార్ట్ రోడ్లకు సంబంధించిన కొన్ని టెండర్లు సాంకేతిక కారణాలతో రద్దయ్యాయి.
సీఎం హామీ నిధులు స్మార్ట్ సిటీ ఖాతాలోకి?
శాసనసభ్యులకు నియోజకవర్గానికి రూ.వంద కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదటి విడత రూ.100 కోట్లతో 74 పనులు, రెండో విడత రూ.147 కోట్లతో 233 పనులు, మూడో విడత రూ.100 కోట్లతో 86 పనులకు టెండర్లు నిర్వహించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు కేటాయించారు. అయితే ఈ నిధులను స్మార్ట్‌సిటీ మిషన్ భాగస్వామ్యం కింద జమకట్టినట్లు సమాచారం.
ఈ పనులను మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌హెల్త్, పంచాయతీరాజ్, సోషల్‌వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల ద్వారా చేపట్టారు. అడ్డగోలుగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎక్కడి పనులను అక్కడే వదిలేశారు. రూ.347 కోట్ల అభివృద్ధి పనుల్లో 30 శాతం పనులు కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment