
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్‌లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు.
జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు.
వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.