న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం రాత్రి జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జర్మనీలో జరిగే వంద స్మార్ట్ సిటీ మిషన్ సదస్సులో పాల్గొంటారు. జర్మనీ పర్యావరణ, భవనాల మంత్రి బార్బరా హెండ్రిక్స్ తో కలిసి వెంకయ్య మెట్రోపాలిటిన్ సొల్యూషన్ ఫెయిర్-2016ను సందర్శిస్తారు.
ఆ తర్వాత పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో సమావేశమవుతారు. కాగా భారత్‌లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం చేస్తామని జర్మనీ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీలు మార్చేందుకు సాయం అందించనుంది.
ఇక ఈ పర్యటనలోనే కేంద్రమంత్రి వెంకయ్య పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో భేటీ అవుతారు. అలాగే భారత్‌లో వంద ఆకర్షణీయ నగరాల నిర్మాణం గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. జర్మనీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ఉపయోగిస్తున్న సాంకేతికత, ఇతర పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు.
బుధవారం బెర్లిన్‌లోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రాన్ని వెంకయ్య సందర్శిస్తారు. బెర్లిన్‌లో రవాణా వ్యవస్థ డిజిటలైజేషన్‌పై చర్చించనున్నారు. అలాగే గురువారం ఉదయం జర్మనీ పార్లమెంటు భవనాన్ని సందర్శించి స్పీకర్తో భేటీ అవుతారు. పార్లమెంటు ఉపాధ్యక్షురాలు ఉల్లా ష్మిత్, ఇండోజర్మన్ పార్లమెంటరీ బృందంతో సమావేశమవుతారు. తిరిగి వెంకయ్య శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకుంటారు.