సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్‌ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్‌ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్‌ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్‌మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.
సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్‌ఎల్‌లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్
లీవ్‌లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్‌లీవ్‌లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్‌లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్‌లీవ్‌లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి.
జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment