టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్‌లు మాయవుతున్నాయట.
కాఫీ మగ్‌ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్‌బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.
బెర్లిన్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్‌లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్‌లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్‌లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్‌లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.
ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్‌టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment