
దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్ష
స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ
31న స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు. స్కూల్ యూనిఫామ్ నమూనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర, ఐజీ రమేశ్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
31న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్‌లో 50 శాతం సీట్లు యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment