వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య! | Irregularities In Inter Practical Exams | Sakshi
Sakshi News home page

వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య!

Published Sat, Jan 18 2020 12:09 PM | Last Updated on Sat, Jan 18 2020 12:10 PM

Irregularities In Inter Practical Exams  - Sakshi

కర్నూలు బిర్లా గేటు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్‌ క్లాస్‌లు చెప్పలేదు. ఈ కాలేజీకి చెందిన మరో బ్రాంచ్‌ కర్నూలు కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉంది. అక్కడ వారం రోజుల నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. 

కర్నూలులోని ఓ కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్‌ తీసుకునే సమయంలో ప్రాక్టికల్‌ పరీక్షలు పాస్‌ చేయించేందుకు బైపీసీ విద్యార్థుల నుంచి రూ. 2 వేలు, ఎంపీసీ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది.   

కర్నూలు సిటీ: ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్‌ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్‌ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జబ్లింగ్‌ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది.

ప్రయోగశాలలేవీ? 
జిల్లాలో మొత్తం 299 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 44, ఏపీ మోడల్‌ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్‌ కాలేజీలు10, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు 14,  రెసిడెన్షియల్‌ కాలేజీలు 2, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీలు 3, కో–ఆపరేటివ్‌ కాలేజీలు 1, ఇన్‌సెంటివ్‌ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు 113, ఒకేషనల్‌ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్‌ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్‌  కళాశాలల్లో  ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్‌ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్‌ టూర్‌కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి.

అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులను బొటానికల్‌ టూర్‌కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్‌ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్‌ బోర్డు జంబ్లింగ్‌ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం.. 
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీల్లో ప్రాక్టికల్‌ పరీక్షల కోసం అదనంగా ఫీజులను వసూళ్లు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెబుతున్నారు. మరోసారి కాలేజీలను తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.
– సాలాబాయి, ఇంటరీ్మడియట్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement