
ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదారులు
ఎన్నికల సంఘం అండతో నకిలీ ఓటర్లను చేరి్పస్తున్నారు
సరిదిద్దకపోతే ఈసీ ఆఫీసు వద్ద నిరవధిక దీక్ష చేస్తా
పశ్చిమ బెంగాల్ సీఎం మమత హెచ్చరిక
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు.
లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు.
మరోసారి ‘ఖేలా హోబే’
మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్‌లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్‌లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్‌లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.
మన లక్ష్యం
215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు.
‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment