కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్, ఆసుపత్రిలో ఓ గుంపు చొరబడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సెమినార్ హాల్‌లో డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ విద్యార్ధులు, వైద్య సిబ్బంది ఆందోళన చేస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని నిరసనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకొచ్చి బీభత్సం చేశారు.
అయితే అసుపత్రి వద్ద జరిగిన విధ్వంసంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల పాత్ర ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం గవర్నర్‌ను కలిసిన తర్వాత మమతా మీడియాతో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వారు బయటి వ్యక్తులుగా కనిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
‘బయటి వ్యక్తులు, 'బామ్ అండ్ రామ్'కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసినట్లు నాకు సమాచారం అందింది. ఇందులో విద్యార్థుల పాత్ర లేదు. ఈ సంఘటనను ఖండిస్తున్నాను. అలాగే అత్యాచార నిందితులను ఉరి తీయాలంటూ ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయబోతున్నాను,
రాత్రి ఘటనలో వామపక్షాలు, బీజేపీ జెండాలను చూశాను. వారు పోలీసులపై దాడి చేసిన విధానం చేశారు. ఇన్‌ఛార్జ్ అధికారి ఒకరు గంటపాటు కనిపించలేదు. తరువాత అతను గాయపడినట్లు తేలింది. కానీ పోలీసులు రోగులకు ఇబ్బంది కలగకూడదని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము చాలా ఆందోళనలు చేశాం. కానీ ఆసుపత్రిలో ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు’ అని తెలిపారు. కాగా ే గతంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని బామ్ అంటే లెఫ్ట్, రామ్ అంటే బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉండగా కోల్‌కతాలో ఆర్‌జీ కర్ మెడికల్ క్యాంపస్‌లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపై సైతం ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారులు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment