
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థళకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.
లభించని మృతదేహాల ఆనవాళ్లు
ఇటీవలి కాలంలో ధర్మస్థళ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ధర్మస్థళ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా అధికారులకు తెలిపాడు. ఆ మృతదేహాల్లో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నాయన్నాడు. దీంతో అతను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగిన సిట్ అధికారులు అతను చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. అయితే మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అధికారులకు లభించలేదు.

మాయమాటలతో వ్యవస్థను నమ్మించి..
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి మరోమారు విచారించారు. ఈ నేపధ్యంలో అతను మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి, ఇప్పుడు తనకు ఏమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ నేపద్యంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. నేడు (శనివారం) అతనిని కోర్టుకు హాజరుపరచనున్నారు. దీనికి ముందు భీమా.. తనకు ఒకరు పుర్రె ఇచ్చి, సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో కేసు కూడా వారే చేయించారని చెప్పాడు.

సుజాత భట్ చెప్పిందీ కట్టుకథే..
మరోవైపు సుజాత భట్ తాను గతంలో ధర్మస్థళకు వెళ్లినప్పుడు తన కూతురు మిస్ అయిందని తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని సిట్ అధికారులమందు నిజం వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. తనకు అసలు అనన్య భట్ అనే కూతురే లేదని.. ధర్మస్థళ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా కొత్తగా సృష్టించినవేనన్నారు.


విచారణకు రాలేను: యూట్యూబర్ సమీర్
ధర్మస్థళ గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్‌కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్‌కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి లేఖ రాస్తున్నానని, తాను ధర్మస్థల స్టేషన్‌కు రావటానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. తనకు ప్రాణ హాని ఉందని భావించి, సెషన్ న్యాయస్థానంలో బెయిల్‌కు దరఖాస్తు చేశానని సమీర్ తెలిపాడు. ఒకవేళ తాను ధర్మస్థళ పోలీస్ స్టేషన్‌కు వస్తే, తనకు భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజులలోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని ఆ లేఖలో సమీర్ కోరాడు.