
అభిప్రాయం
తెలుగు నేలపై పుట్టి మొత్తం దక్షిణాదిలో విద్యను వ్యాపారీకరించిన రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు (corporate colleges) పిల్లలు, తల్లిదండ్రుల కలలపై వ్యాపారం చేస్తున్నాయి. ఇటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఎందరో పిల్లల జీవితాలు ఇవి చేసే వ్యాపారంలో సమిథలవుతున్నాయి.
నేడు భారతదేశంలో ఆత్మహత్యలు అనేది ఒక జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సగటున ప్రతిరోజూ సుమారుగా 36 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మనదేశంలో ప్రతి సంవత్సరం ఆత్మ హత్యల ద్వారా సుమారుగా 7–8 శాతం వరకు విద్యార్థులు మరణి స్తున్నారు. గత 25 ఏళ్లుగా (1995 నుండి 2021 వరకు) దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులను భారత్ ఆత్మహత్యల ఫలితంగా కోల్పోయింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా, వార్షిక ఐసీ–3 కాన్ఫరెన్స్– ఎక్స్‌పో– 2024 (ఆగస్టు 28)లో ‘విద్యార్థుల ఆత్మహత్యలు: ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా’ నివేదిక విడుదల చేయబడింది. మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరుగుతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4% పెరిగాయని ఈ నివేదిక ఎత్తి చూపింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో వార్షికంగా 4% పెరిగాయి. 2022లో మొత్తం ఆత్మహత్యల్లో 53% మంది విద్యార్థులు ఉన్నారు. 2021, 2022 మధ్య విద్యార్థులలో మగపిల్లల ఆత్మహత్యలు 6% తగ్గగా, బాలికల ఆత్మహత్యలు 7% పెరిగాయి అని ఐసీ–3 ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన నివేదిక పేర్కొంది.
చాలా మంది దిగువ – మధ్యతరగతి నేపథ్యాల వారు కార్పొరేట్ కాలేజీల్లో చేరి ఇటు ఫీజులు కట్టలేక, అటు కాలేజీల్లో ఉన్న ఒత్తిడి వాతావరణాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉండే అసహజ వాతావరణం తల్లిదండ్రులకు తెలిసినా... వాటిలో చేరితేనే తమ పిల్లలు మంచి ర్యాంకు పొంది డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనే నమ్మకంతో వాటిల్లోనే చేరుస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణా కమిటీలు నియమించి చేతులు దులుపుకొంటున్నాయి. తమ డబ్బు, పలుకుబడులతో అవి మేనేజ్ చేయగలుగుతున్నాయి.
చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
ఆత్మహత్య చేసుకున్న వారిలో చాలామంది నిరాశా నిస్పృహలకు లోనైనవారే ఉంటారు. ఏ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో మాత్రమే వారు ఈ చర్యకు పాల్పడతారు. చనిపోకముందే చాలా సార్లు మాటల ద్వారా, చేతల ద్వారా చనిపోవాలనే ఆలోచనను వ్యక్తపరుస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ మాటలు – చేతల్లోని భావాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకనే విద్యాసంస్థలలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించి సహాయమందించే ఏర్పాట్లు చెయ్యాలి. భావిభారత యువతను కాపాడుకోవాలంటే కార్పొరేట్ కాలేజీలపై కన్నేసి ఉంచాల్సిందే.
-డాక్టర్ బి. కేశవులు
ఎండి. సైకియాట్రీ, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్