మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తున్న విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య. చిత్రంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా కార్యాచరణను అమలు చేయనున్నట్లు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వెల్లడించారు. ఇందుకు వెంటనే మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన అకడమిక్ కేలండర్‌ను ప్రతి కాలేజీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు, తల్లిదండ్రుల సంఘాలతో ఆమె సమావేశం నిర్వహించారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అకడమిక్ అంశాలే కాకుండా ఇతరత్రా విషయాలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని, వాటిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తామని, తరచూ రాష్ట్రస్థాయి వర్క్‌షాపులు నిర్వహిస్తామని చెప్పారు. తమ అకడమిక్ షెడ్యూలును మరోసారి పరిశీలించి మార్పులు చేస్తామ ని యాజమాన్యాలు హామీ ఇచ్చాయని రంజీవ్ ఆచార్య తెలిపారు. ఉదయం 4 నుంచి 11 వరకు కాకుండా.. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు ఉండేలా చర్యలు చేపతామని యాజమాన్యాలు చెప్పినట్లు వెల్లడించారు. సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు కచ్చితంగా 2 గంటలు సహ పాఠ్య కార్యక్రమాలకు వెచ్చించాలని, విద్యార్థులకు ఇష్టమున్న గేమ్స్ ఆడుకునేలా, యోగా, మెడిటేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు చెప్పారు. సైకాలజిస్టును కౌన్సెలర్‌గా నియమించాలని చెప్పామని, కౌన్సెలర్లు విద్యార్థుల వారీగా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
నాలుగైదు గంటలు కూడా నిద్ర పోవడం లేదు..
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు రోజుకు నాలుగైదు గంటలకు మించి నిద్రపోవడం లేదని గుర్తించినట్లు రంజీవ్ ఆచార్య చెప్పారు. మధ్య మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తప్ప మిగతా సమయం అంతా చదువుకే కేటాయిస్తుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోందన్నారు. విద్యార్థులకు ఎథిక్స్‌కు సంబంధించిన పాఠాలు నేర్పించాలని, నిపుణులను పిలిపించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా తరగతులు నిర్వహించాలన్నారు. యాజమాన్యాలు నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రు లు ఇతర విద్యార్థులతో పోల్చి తక్కువ మార్కు లు వచ్చాయంటూ తమ పిల్లల మానసిక స్థైర్యా న్ని దెబ్బతీయవద్దని సూచించారు. మహిళా కాలేజీల్లో మహిళా లెక్చరర్లు, మహిళా కౌన్సెలర్లను నియమించాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలో రూమ్‌లో నలుగురు విద్యార్థులకు మించి ఉంచడానికి వీల్లేదన్నారు. కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్లలో పరిస్థితులపై తనిఖీలు చేసేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతోనూ కమిటీ వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మొత్తంగా 15 అంశాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని, వాటిని ప్రతి కాలేజీ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
బోర్డు పరిధిలోకి హాస్టళ్లు!
కాలేజీలతోపాటు హాస్టళ్లను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. హాస్టళ్లలో వసతులు లేకపోవడం, తరగతిలో నిర్ణీత సంఖ్యకు మించి విద్యార్థులు ఉండటమూ ఒత్తిడికి కారణం అవుతోందని పేర్కొన్నారు. దీంతో హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి, బోర్డు ఆధ్వర్యంలో వాటిలో తనిఖీలు జరిపి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఇంటర్‌లో మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం తేవాలని తల్లి దండ్రులు సూచించారని, దాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి తర్వాత పిల్లలను తమ కాలేజీల్లో చేర్పించే మార్కెటింగ్, పీఆర్‌వోల వ్యవస్థలు, ప్రకటనలను నియంత్రించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంసెట్, జేఈఈ వంటి శిక్షణ ఇస్తామన్నారు. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment