ప్రతీకాత్మక చిత్రం
ప్రచండమైన పోటీ... పరిమితమైన అవకాశాలు... మార్కుల్ని తప్ప మరిదేన్నీ పరిగణించని విధా నాలు లేలేత హృదయాలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో హైదరాబాద్ నడిబొడ్డున మంగళవారం ఉదయం తనువు చాలించిన జస్లిన్ కౌర్ ఉదంతం తేటతెల్లం చేసింది. ఆబిడ్స్‌లో పదంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డ కౌర్ వయసు కేవలం పద్దెనిమిదేళ్లు. ఒకప్పుడు ఆ వయసు పిల్లలకు బాధ్యతలు పెద్దగా పట్టేవి కాదు. సవాళ్ల బాదరబందీ ఉండేది కాదు. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చేది.
కష్టమంటే పెద్దగా తెలియకపోయేది. దేన్నయినా సునాయాసంగా గెలవగలమన్న ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉండేది. నిజానికి ఆ ఆత్మవిశ్వాసమే వారికి సగం విజయాన్ని అందించేది. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. బాల్యం నుంచే మన విద్యావ్యవస్థ పిల్లల్లో పోటీ తత్వాన్ని నూరిపోస్తోంది. తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, తమ గెలుపు ఖచ్చితమని నమ్ముతున్నవారికోసం, తాము దేన్నయినా అవలీలగా జయించ గలమని విశ్వసిస్తున్నవారికోసం బడికెళ్లే వయసులోనే పిల్లలు లక్ష్య నిర్దేశం చేసుకుంటున్నారు. జీవి తాలను పరుగు పందెంగా మార్చేసుకుంటున్నారు. ఈ పందెంలో ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించినా... ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా నలుగురిలో నగుబాటు పాలవుతామని బెంగ పెట్టుకుంటున్నారు.
ఇంట్లోనూ, బయటా తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, అంచనాలను పెంచుకుంటున్నవారి కోసం మర మనుషులుగా మారిపోతున్నారు. సమూహంలో ఒంటరిగా మారుతున్నారు. శర సంధానం చేసిన అర్జునుడి దృష్టంతా చిటారు కొమ్మనున్న పక్షిపై నిలిచినట్టు లక్ష్యం తప్ప మరిదేన్నీ వారు పరిగణించలేకపోతున్నారు. ఒత్తిళ్ల ఊబిలో కూరుకుపోయి దాన్నే సర్వస్వమనుకుంటున్నారు. ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోవడం వారివల్ల కావడం లేదు. ఈ తరగతి దాటితే పోటీ ముగు స్తుందనిగానీ, ఈ పరీక్ష పూర్తయితే పీడ విరగడవుతుందనిగానీ గ్యారెంటీ లేదు.
మళ్లీ కొత్త తర గతిలో కొత్త పోటీలు, కొత్త లక్ష్యాలు తప్పవు. ఈ అమానుషమైన పరుగుపందెంలోనే జస్లిన్ కౌర్ ఓడిపోయింది. జీవితం వృథా అనుకుంది. కన్నవారికి, తోడబుట్టినవారికి శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచింది. ఈ విషయంలో జస్లిన్ కౌర్ ఒంటరి కాదు. నీట్ ఫలితాలు వెల్లడైన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా దాదాపు నలుగురైదుగురు ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అసలు నీట్ కోచింగ్ సమయంలోనే విద్యార్థులు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ర్యాంకు సాధించలేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.
సోమవారం వెల్లడైన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో మంచి ర్యాంకు రాలేదన్న మనో వ్యథతో జస్లిన్ కౌర్ ప్రాణాలు తీసుకుంది. ఈసారికి ర్యాంకు సాధించలేకపోయినా మళ్లీ ప్రయ త్నించి విజయం సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కొరవడటానికి కారణముంది. నీట్ పరీక్ష సాధారణమైనది కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలన్నిటిలో ఉన్న 54,000 సీట్లను భర్తీ చేయడం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈసారి 13,26,725 మంది ఆ పరీక్షకు హాజరయ్యారు. ఈ సంఖ్య నిరుటితో పోలిస్తే 2 లక్షలకన్నా ఎక్కువ. ఇలా ఏటికేడాదీ పెరిగే అభ్యర్థుల సంఖ్య వల్ల పోటీ రాను రాను మరింత జటిలంగా మారుతుందని, ఎంబీబీఎస్ సీటు రావడం దుర్లభమని జస్లిన్ కౌర్ బెంగ పెట్టుకుని ఉండొచ్చు.
పర్సంటైల్ ఆధారంగా విజే తలను నిర్ణయిస్తారు గనుక నీట్‌లో అర్హత సాధించినంత మాత్రాన సీటు గ్యారంటీ లేదు. అలా అర్హు లైనవారి జాబితాలో అగ్రభాగాన ఉండాలి. ఈసారి ఫలితాలను విశ్లేషిస్తే ఈ సంగతి తేటతెల్లమవు తుంది. ఉన్నవి 54,000 సీట్లయితే 7.14 లక్షలమంది అర్హత సాధించారు. అంటే సగటున ఒక సీటుకు 13మంది పోటీ పడుతున్నట్టు లెక్క. కనుక గెల్చినవారు సైతం చివరివరకూ నిస్స హాయంగా ఎదురుచూస్తూ కూర్చోవాలి. గుండెలు చిక్కబట్టుకుని ఉండాలి. నిరుడు కాస్త నయం. అప్పుడు 6.11 లక్షలమంది విద్యార్థులు అర్హత సాధించగా 64,000 సీట్లున్నాయి. అంటే సగటున ఒక సీటుకు 10మంది పోటీ పడ్డారు. కానీ తగిన మౌలిక సదుపాయాలు సరిగా లేవన్న కారణంతో కేంద్రం 82 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లను నిషేధించింది.
పర్యవసానంగా ఈ ఏడాది 10,000 సీట్లు తగ్గిపోయాయి. పైగా అర్హుల సంఖ్య బాగా పెరిగింది. అసలు సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు అంతమందిని ‘అర్హులు’గా ప్రకటించడంలోని సహేతుకత ఏమిటో ఎవరికీ బోధç³డని విషయం. ఈ విధానం వల్ల ఎవరికి వారు చివరివరకూ తమకు సీటొస్తుందన్న భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమ బద్దలైనప్పుడు ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడని స్థితికి చేరుకుంటారు.
ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న దశలో విద్యార్థుల్లో ఒత్తిళ్ల స్థాయి అత్యధికంగా ఉంటున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్‌లోకి వచ్చినప్పుడే భవిష్యత్తులో ఫలానా డిగ్రీలో చేరి జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన స్థూలంగా ఉంటుంది కనుక అందుకోసం తపన మొదలవు తుంది. ఏమాత్రం విఫలమైనా భవిష్యత్తు శూన్యమవుతుందన్న భయం, పోటీలో తోటివారు తనని మించిపోతున్నారన్న ఆందోళన, కన్నవారు తనపై పెట్టుకున్న ఆశల్ని అందుకోలేకపోతున్నానన్న చింత నానాటికీ అధికమవుతుంటుంది.
దానికితోడు కార్పొరేట్ కళాశాలల్లో బట్టీకొట్టించే విధానం, వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉండే పద్ధతులు వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పర్యవసానంగా మానసికంగా బలహీనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఆ వయసు పిల్లల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంటున్నదన్న ఆరా అటు తల్లిదండ్రులకూ, ఇటు అధ్యాపకులకూ లేకుండా పోతోంది. నిండైన ఆత్మవిశ్వాసంతో మెలగాల్సిన వయసులో పిల్లల్లో బేలతనం ఎందుకు ముసురుకుంటున్నదో ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అర్ధంలేని పోటీని పెంచు తున్న ప్రస్తుత విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాన చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment