సంతోష్ రాయ్ , మనోజ్
సాక్షి, సిటీబ్యూరో: ఎంబీబీఎస్, మెడిసిన్ పీజీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ దాదాపు 20 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన ఢిల్లీకి చెందిన సూడో డాక్టర్ సంతోష్ రాయ్ చేతిలో ప్రస్తుతం చిల్లిగవ్వ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇతడి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్ల లావాదేవీలు ఉన్నా... బ్యాలెన్స్ మాత్రం నిల్‌గా తేల్చారు. సంతోష్‌తో పాటు అతడి ముఠాకు చెందిన మరో నిందితుడు మనోజ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో మరిన్ని కోణాలు వెలుగులోకి తెచ్చేందుకు పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం నిందితులను తీసుకుని ఉత్తరాదికి వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరికి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
వీటిలో కరెంట్ ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి. ఆయా ఖాతాల్లో రూ.కోట్లలో లావాదేవీలు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక్క దాంట్లో రూ.2.5 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు తేలింది. దీంతో అనేక మంది నుంచి కాజేసిన డబ్బు ఏమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. సంతోష్ ఓ మతపరమైన సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాడని గుర్తించారు. తాను ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చానని, తమకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని పోలీసులకు తెలిపాడు. సంతోష్ ఢిల్లీలో ఓ ఆస్పత్రి సైతం నిర్వహించిన విషయం విదితమే. దీనిని కేవలం కరెంట్ ఖాతాల కోసమే ఏర్పాటు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రూ.కోట్లలో కాజేస్తున్న ఇతను డబ్బు డ్రా చేసుకునేందుకే కరెంట్ ఖాతాలను తెరచినట్లు భావిస్తున్నారు. 20 ఏళ్లుగా సంతోష్ ఈ పంథాలో రెచ్చిపోవడానికి ఢిల్లీకి చెందిన కొందరు బడాబాబుల సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేశారు. వీరిలో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నారు. వారితో సంతోష్‌కు ఉన్న సంబంధాలను కనిపెట్టడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికీ ప్రయత్నాలు ప్రారంభించారు.
ముంబై పోలీసులనూ పరుగులు పెట్టించారు...
సంతోష్ రాయ్ కుటుంబం 2014లో ముంబై పోలీసులను పరుగులు పెట్టించింది. సంతోష్ ఆ ఏడాది బెంగళూరులో భారీగా ‘ఎంబీబీఎస్ స్కామ్’కు పాల్పడ్డాడు. దీంతో అక్కడ కేసు నమోదు కావడంతో పోలీసుల వేట మొదలైంది. వీరిని తప్పించుకోవడానికి కుటుంబంతో సహా ముంబై శివార్లలో ఉన్న గోరేగావ్‌కు మకాం మార్చిన ‘డాక్టర్’ కొత్త జీవితం ప్రారంభించాడు. తన పాత సెల్‌ఫోన్ నెంబర్లను పూర్తిగా స్విచ్ఛాఫ్ చేశాడు. అతికష్టమ్మీద అతడి ఆచూకీ కనిపెట్టిన బెంగళూరు పోలీసులు ఆ ఏడాది నవంబర్‌లో అతడి ఇంటిపై దాడి చేశారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరు తరలిస్తుండగా సంతోష్ కుటుంబం ‘100’కు ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యుడిని నలుగురు వచ్చి కారులో కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు నగర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. చివరకు వన్రాయ్ పోలీసులు ‘డాక్టర్’ను ఎత్తుకుపోతున్న వాహనాన్ని గుర్తించి, భారీ ఛేజింగ్ తర్వాత అడ్డగించారు. విచారణలో సంతోష్‌ను తీసుకువెళ్తున్నది మఫ్టీలో వచ్చిన బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీసులుగా, అతడిపై అక్కడి చీటింగ్ కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో ముంబై పోలీసుల గంటన్నర ఉత్కంఠకు తెరపడింది.
ఎంపీ కావాలని ఆశయం...
ఢిల్లీలోని గణేష్‌నగర్ ప్రాంతంలో భారీ భవంతి నిర్మించుకుని స్థిరపడిన సంతోష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌ఘడ్. అఖిల భారతీయ హిందూ మహాసభకు (ఏబీహెచ్‌ఎం) ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెప్పుకునే ఇతగాడు ఎక్కువ రోజులు దక్షిణాదిలోనే గడిపేవాడు. అమెరికాలో ఎంబీబీఎస్ చేసినట్లు చెప్పుకునే సంతోష్ కొన్నాళ్ల పాటు కర్ణాటక కోకొనట్ బోర్డుకు జనరల్ సెక్రటరీగా పని చేశాడు. అప్పట్లో ఇతడికి బెంగళూరు పోలీసులు ఏకంగా ‘వై–కేటగిరీ’ భద్రత కల్పించారు. ఎప్పటికైనా ఆజామ్‌ఘడ్ ఎంపీగా గెలవాలన్నది సంతోష్ ఆశ, ఆశయమని పోలీసులు చెబుతున్నారు. దీనికోసమే అనేక సంస్థల్లో కీలకంగా పని చేసేవాడని వివరిస్తున్నారు. తాజాగా మెడిసిన్ పీజీ సీట్లంటూ మోసాలకు పాల్పడిన సంతోష్ రాకపోకలు, లావాదేవీలు గుజరాత్‌తో ఎక్కువగా ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి నిర్థారించారు. అయితే అక్కడి పోలీసులను సంప్రదించినప్పటికీ తమ వద్ద ‘మెడిసిన్ మోసాల’ కేసులు లేవని చెప్పారు. దీంతో కస్టడీలో విచారణ నేపథ్యంలో గుజరాత్ లింకులను బయటకు తీయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇవే కేసులో అత్యంత కీలకమని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment