సాక్షి, సిటీబ్యూరో: మెడికల్ పీజీ సీట్ల పేరుతో దేశ వ్యాప్తంగా రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన సంతోష్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతడితో పాటు మరో నిందితుడు మనోజ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నుంచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే. లండన్‌లో ఎంబీబీఎస్ చదివానంటూ ప్రచారం చేసుకుని ఢిల్లీలో ఓ ఆస్పత్రి సైతం ఏర్పాటు చేసిన ఈ సూడో డాక్టర్ కొన్ని సందర్భాల్లో సీబీఐ అధికారి పాత్రను పోషించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న బడా బాబులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరించిన సంతోష్ వారికి వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి సీబీఐ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకునే వాడు. వారిపై ఉన్న కేసులను రాజీ చేయిస్తానని డబ్బు డిమాండ్ చేసేవాడు. ఇందుకు అంగీకరించకపోతే అరెస్టులు చేయిస్తానని, ఆస్తులు సీజ్ చేయిస్తానంటూ బెదిరించి భారీ మొత్తం అడిగేవాడు. ఈ పంథాలో అనేక మంది నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహాకు చెందిన బాధితుల్లో నగరంలోని బషీర్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ బడా జ్యువెలరీ వ్యాపారీ ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
అయితే ఫిర్యాదు చేయడానికి సదరు వ్యాపారి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సంతోష్ అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోని అన్ని ప్రధాన నగరాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వి«విధ చోట్ల నమోదై ఉన్న, నమోదు కాని ఫిర్యాదులు వీరి దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే ముంబై, విశాఖపట్నం, గుజరాత్‌లలో కేసులు, బెంగళూరులో నాన్–బెయిలబుల్ వారెంట్, ఢిల్లీలో కేసు నమోదుకాని ఫిర్యాదు ఉన్నట్లు వర్తమానం అందింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత పీటీ వారెంట్లు దాఖలు చేసి ఆయా కేసుల్లో అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మెడికల్ పీజీ సీట్ల స్కామ్‌లో మరికొందరు నిందితులు ఉన్నారు. వీరి వివరాలతో పాటు బాధితుల నుంచి సేకరించిన రూ.కోట్లు ఏమయ్యాయి? ఇంకా ఈ గ్యాంగ్ చేసిన నేరాలేమిటి? తదితర వివరాలు విచారించాలని భావిస్తున్న పోలీసులకు సంతోష్ నుంచి సరైన సహకారం లభించట్లేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్న ఇతను గట్టిగా ప్రశ్నించేసరికి కళ్లుతిరిగి పడిపోతున్నట్లు నటిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నాడు. కస్టడీ గడువు ఇంకా ఉండటంతో లోతుగా విచారించి ఆరా తీయాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా ఇంటర్‌నెట్‌లో ఉన్న సంతోష్ ఫొటో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అందులో సంతోష్ ఓ తుపాకీ పట్టుకుని ఫోజు ఇచ్చాడు. దీంతో ఆ ఆయుధం వెనుక ఉన్న కథేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. అది నిజమైన తుపాకీయేనా? లైసెన్స్ ఉందా? తదితర వివరాలు అతడి నుంచి రాబట్టాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment