Telangana Crime News: TS Crime News: ఆన్‌లైన్‌ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
Sakshi News home page

TS Crime News: ఆన్‌లైన్‌ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!

Published Fri, Aug 25 2023 12:52 AM | Last Updated on Fri, Aug 25 2023 12:25 PM

- - Sakshi

కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్‌ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది.

కాగజ్‌నగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో కలెక్షన్‌ బాయ్‌గా విధులు నిర్వర్తించే ప్రమోద్‌సింగ్‌ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు.

కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్‌నగర్‌ మండలం ఈజ్‌గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్‌తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్‌ విషయం బయట పడింది.

కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో కాక్‌ఫైట్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతున్నారు. చైన్‌ సిస్టం లాంటి ఈ గేమ్‌లో ఒకరి నుంచి మరొకరు గేమ్‌ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి.

నిఘా ఉన్నా..
ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు.

యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్‌ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్‌ఫోన్‌లోనే బెట్టింగ్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు.

రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లను వీపీఎన్‌ సాయంతో లొకేషన్‌ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్‌ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు.

తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే..
జిల్లాలో ఎక్కువగా క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్‌ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్‌ కప్‌తోపాటు అక్టోబర్‌లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి.

బెట్టింగ్‌ నిషేధం..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేదం. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

తల్లిదండ్రులు నిఘా ఉంచాలి..
యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్‌ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో అత్యాశతో నష్టం

తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌, కాక్‌ఫైట్‌, తీన్‌మార్‌ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి.

మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement