
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు.
గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది.
దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment