అర్ధరాత్రి స్వగ్రామానికి మృతదేహం
పోలీసుల భారీ బందోబస్తు.. ఆంక్షలు
కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నిరసన
పరిహారం హామీ అనంతరం అంత్యక్రియలు పూర్తి
ఫుడ్‌పాయిజన్‌తో మృతిచెందిన వాంకిడి గురుకుల విద్యార్థిని
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు.
శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు.
ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్‌గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు.
మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్‌బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment