Ashram school
-
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజకు.. 21 రోజులపాటు నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం వేకువజామున 3 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ధాబా గ్రామానికి తీసుకువచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధాబా గ్రామానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ధాబా గ్రామానికి వెళ్లేందుకు ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసుల కన్నుగప్పి గ్రామానికి చేరుకున్న మాలి సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కచి్చతమైన హామీ ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టంచేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు శైలజ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఎక్స్‌గ్రేషియా విషయంపై మంత్రి సీతక్కతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.20 వేలు.. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష నగదును అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ముగిశాయి. అనంతరం శైలజ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, పాల్వాయి హరీశ్‌బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుíÙత ఆహారం కారణంగా 79 మంది గిరిజన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోడి గుడ్డు, రసంతో భోజనం తిన్న కొద్ది సేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వీరిలో 61 మందిని హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న సౌజన్య, 6వ తరగతి చదువుతున్న ఎస్.దీవెన, 8వ తరగతి చదువుతున్న జెస్సీల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 520 మంది గిరిజన విద్యార్థినులు ఉన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలో 61 మంది వైద్యసేవలు పొందుతుండగా, జామిగుడ ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన విద్యార్థినులకు కిల్లోగుడ పీహెచ్సీ వైద్య బృందం వైద్యసేవలు అందిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలను సమీక్షించారు. -
సిగ్గు.. సిగ్గు.. నవ్విపోతారు!
రామోజీకి ‘పచ్చ’ పైత్యం ముదిరిపోయింది. తన బాబు.. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా చూడలేక దిగులు పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఆత్రం మితిమీరింది. ఏదో విధంగా జనాన్ని ఏమార్చాలనే కుట్ర, కుతంత్రం ప్రతి కథనంలోనూ కనిపిస్తోంది. జనానికి సీఎం వైఎస్ జగన్ దగ్గరవ్వడం జీర్ణించుకోలేక నిత్యం అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. గురువారం ‘ఈనాడు’ పత్రిక బ్యానర్ కథనంలో ఇచ్చిన ఫొటోను కాసేపు పరిశీలిస్తే రామోజీ డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది. ఆ ఫొటోలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా దుప్పట్లు కప్పుకోవడం కనిపిస్తోంది. కొందరైతే అదనంగా తల కింద మరో దుప్పటి పెట్టుకోవడం కూడా కనిపించింది. కేవలం ముగ్గురు విద్యార్థులు దుప్పటి కప్పుకోలేదు. ఆ ముగ్గురికి కూడా దుప్పట్లు ఉన్నాయి. వారు కప్పుకోక పోవడం ప్రభుత్వం తప్పా రామోజీ? ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రగతి మీకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు ఇచ్చిన దుప్పట్లో దూరుకున్న మీకెలా కనిపిస్తుందిలే..! కర్నూలు (అర్బన్): ప్రజలు ఏమైనా అనుకుంటారన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా లేకుండా నిత్యం తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ అబద్ధాలు వండి వారుస్తోంది. కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పచ్చ పత్రిక పరువు పోగొట్టుకుంటోంది. ఈ నెల 30న ఈనాడు మొదటి పేజీలో ‘మనసు లేని మామ’ శీర్షికతో ప్రచురించిన కథనంలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని, చలికి విద్యార్థులు గజగజ వణికిపోతున్నారని రాశారు. వాస్తవానికి ఈ పాఠశాలలో అలాంటి పరిస్థితే లేదు. డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 5న ప్రభుత్వం ఈ పాఠశాలకు వంద దుప్పట్లు సరఫరా చేసింది. వీటిని ఈ నెల 6నే విద్యార్థులకు అందించి, వారికి దుప్పట్లు అందినట్లు సంతకాలను కూడా (అక్విటెన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు. కనీసం ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే ‘ఈనాడు’ దుర్మార్గంగా ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజల మనుసుల్లో విషం జొప్పించే యత్నం చేసింది. ఈనాడు తీరు పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే వాస్తవం కనిపిస్తుంటే ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా రాస్తారని ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి పూట హాస్టల్ ఫొటోలు తెప్పించుకుని.. ఇలా తప్పుడు రాతలు రాయడం ఏం జర్నలిజం అని హాస్టల్ పరిసర ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు. నాడు–నేడు కనిపించలేదా రామోజీ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించడం తెలిసిందే. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో సకల వసతులు కల్పిస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు చేపట్టి, పూర్తి చేసింది. రెండవ దశలో 22,217 పాఠశాలల్లో పనులు ప్రారంభించింది. చాలా వాటిలో పనులు పూర్తయ్యాయి. మరికొన్నింటిలో చివరి దశలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లను మూడో దశలో అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లి చూసినా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది.. ఒక్క రామోజీకి తప్ప. నాడు–నేడు కింద పనులు జరగని పాఠశాలలను వ్యూహాత్మకంగా ఎంచుకుని ప్రభుత్వంపై ఈనాడు బండలేస్తోంది. ఇప్పుడు చలి కాలం వచ్చిందనే నెపంతో దుప్పట్లు లేవంటూ అవాస్తవాలు వల్లె వేసింది. మాకు 6వ తేదీనే దుప్పట్లు ఇచ్చారు ఈ నెల 6వ తేదీనే మాకు కొత్త దుప్పట్లు అందించారు. పాతవి కొందరు పడేశారు. మరికొందరు వాటిని అలాగే ఉంచుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో మాకు ఇచ్చిన దుప్పట్లను తల కింద పెట్టుకొని పడుకున్నాం. చలి పెట్టినప్పుడు కప్పుకుందాం అనుకున్నాం. మా ఫొటోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో మాకు తెలియదు. చలి వేస్తే.. దుప్పట్లు పెట్టుకుని కూడా కప్పుకోకుండా ఎందుకుంటాం? – మనోజ్‌నాయక్, అఖిల్నాయక్, హర్షవర్దన్ నాయక్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, డాక్టర్స్ కాలనీ, కర్నూలు అందరికీ దుప్పట్లు పంపిణీ ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు ఈనెల 5న మాకు వచ్చాయి. ఆ మరుసటి రోజు.. అంటే 6వ తేదీన విద్యార్థులకు అందించాం. ఇంకా పది దుప్పట్లు మిగిలాయి. ఇది అద్దె భవనం. ‘నాడు–నేడు’ ఫేజ్–2 కింద ఈ పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా చూశాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి -
45 మంది విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్
మన్ననూర్: బాలికల గిరిజన ఆశ్రమపాఠశాలలో 45 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారంరాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో చోటుచేసుకున్నది. మన్ననూర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 400 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. గురువారంరాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపటికే 10 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడకపోవడం, కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని అల్లాడిపోయారు. దీంతో సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన తర్వా త అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో వసతిగృహంలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుండటంతో 4 అంబులెన్స్‌లలో సుమారు 45 మందిని అచ్చంపేటకు తరలించారు. ఆ తర్వాత లారీ తీసుకువచ్చి సుమారు వంద మంది విద్యార్థినులను అచ్చంపేటకు తీసుకెళ్లారు. ఇందులో ఇద్దరు బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. -
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
పోలవరం రూరల్: ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన కుమారుడు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో మృతదేహంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలవరం మండలం ఇటుకలకోట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంజం శ్రీనివాస్ (18) 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15న బుధవారం సాయంత్రం శ్రీనివాస్ వసతి గృహం నుంచి కొమ్ముగూడెం ఇంటికి వెళ్లాడు. గురువారం శ్రీనివాసరావును తండ్రి కుంజం రాజు ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారని తల్లి దుర్గ తెలిపింది. సెలవుల్లో తమ కుమారుడు ఇంటికి వస్తాడని, శనివారం సాయంత్రం రాకపోవడంతో ఆశ్రమ పాఠశాలకు వెళ్లి వార్డెన్‌ను, ఉపాధ్యాయులను అడిగినా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లి ఆరోపించింది. దీంతో పోలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా గోపాలపురం మండలంలోని పోలవరం కుడికాలువలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు చెప్పారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది తమ కుమారుడిదని బోరుమన్నారు. వసతి గృహంలో విద్యార్థి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా రెండు రోజులుగా వార్డెన్, ఉపాధ్యాయులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడిని కోల్పోయామన్నారు. వస తి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడికే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శ్రీనివాస్ కాలువలో పడి ఎలా మృతిచెందాడో తెలియని పరిస్థితి అని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. దుర్గమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ చిన్న కుమారుడు శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం వివరాలు లభ్యం గోపాలపురం: గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో పోలవరం కుడి ప్రధాన కాలువలో శనివారం కొట్టుకొచ్చిన మృతదేహం వివరాల లభ్యమైనట్టు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. మృతుడు పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్ (18)గా గుర్తించినట్టు చెప్పారు. మృతుడు 9వ తరగతి చదువుతున్నాడని ఈనెల 16న పాఠశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో జారిపడి మృతిచెందినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జి.బొడ్డాపుట్టు బాలికల ఆశ్రమంలో వివాదం
విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): జి.బొడ్డాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రదానోపాధ్యాయురాలు, 9వ తరగతి విద్యార్ధుల మధ్య వివాదం నెలకొంది. హెచ్ఎం తమను వేధిస్తుందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులంతా గురువారం ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, ఆశ్రమం వదిలి ఇళ్లకు వెళ్లిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. 33 మంది విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలను వదిలి, ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనతో జి.బొడ్డాపుట్టు ప్రాంతంలో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 9వ తరగతి గదిలో ఒక్క విద్యార్థిని కూడా లేక గది ఖాళీగా ఉంది. ప్రధానోపాధ్యాయురాలు రూపవతి, డిప్యూటి మేట్రిన్ విధులకు కూడా నిర్వహిస్తున్నారు. ఆమె విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులంతా మాకుమ్మడిగా ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను చెప్పడానికి ఆశ్రమ పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులు కూడా నిరాకరించారు. తోటి విద్యార్థులు కూడా వివరాలు చెప్పడానికి భయపడుతున్నారు. హెచ్ఎం రూపవతి సమావేశం నిమిత్తం పాడే రు వెళ్లడంతో ఆమె వివరణకు అందుబాటులో లేరు. అయితే 9వ తరగతి విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయిన సమాచారాన్ని గిరిజన సంక్షేమశాఖ అధికారులకు జి.బొడ్డాపుట్టు గిరిజనులు చేరవేశారు. -
మౌనంగా ఒక పూట
సాయంత్రమైంది. పొద్దు గుంకింది. నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది. బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది. ఒక ఆశ్రమ పాఠశాలలో ఆ రోజు మౌనం గొప్పతనం గురించి బోధించాడు గురువు. వారానికి ఒక రోజైనా మౌనంగా ఉండటం వల్ల ఎంత మానసిక ప్రశాంతత దొరుకుతుందో వివరించాడు. పాఠం విన్న నలుగురు యువ విద్యార్థులు ఆరోజు నుంచే దాన్ని అమలు చేయాలనుకున్నారు. వాళ్లు అలిఖితంగా సంజ్ఞల ద్వారానే ఆ రోజంతా పెదవి విప్పకూడదని ఒప్పందం చేసుకున్నారు. నలుగురూ తమ బసకు వెళ్లారు. మౌనంగా వారి పొద్దు గడిచింది. ఒక్క మాటా మాట్లాడకుండానే వారి వారి పనులు చేసుకున్నారు. సాయంత్రమైంది. పొద్దు గుంకింది. నిశ్శబ్దంగా చీకటి ఆవరిస్తోంది. బయట కీచురాళ్ల చప్పుడు మొదలవుతోంది. ‘ఎవరైనా లాంతరు వెలిగిస్తే బాగుంటుంది’ అన్నాడు ఒక యువకుడు.అంతసేపూ వున్న మౌన వాతావరణం ఆ మాటతో భంగపడింది.మొదటి యువకుడి మాటకు ఆశ్చర్యపోతూ, ‘మనం ఈరోజంతా ఒక్క మాట కూడా మాట్లాడకూడదని అనుకున్నాం కదా!’ అని గుర్తు చేశాడు మరో యువకుడు.ఈ ఇద్దరి సంభాషణ వల్ల మూడో యువకుడికి కోపమొచ్చింది. ‘మీ ఇద్దరూ మూర్ఖుల్లా వున్నారు. ఎందుకు మాట్లాడారు?’ అని అడిగాడు.‘అయితే నేనొక్కడినే అన్నమాట ఇంతసేపూ మాట్లాడకుండా వున్నది’ అని ముగించాడు నాలుగో యువకుడు. -
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి గోళ్ల చంద్రశేఖర్‌ని గణిత ఉపాధ్యాయుడు ఎ.లక్ష్మణ్ చితకబాదిన ఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి తీవ్ర నొప్పితో మెడను నిలపలేక, ఓ పక్కకు వంచేస్తూ అవస్థ పడుతున్నాడు. క్లాసు చెబుతుండగా.. తోటి విద్యార్థి వద్ద నోట్‌బుక్ తీసుకుంటున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ మెడను వంచి బల్లకు బాదినట్లు విద్యార్థులు చెబుతున్నారు. బూతులు తిడుతూ, తీవ్రంగా కొట్టారని, బాధిత విద్యార్థి మెడ నిటారుగా నిలపలేకపోతున్నాడని చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని ఈనెల 3న ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్ చేయగా, వెన్నుపూస ఎముకకు తీవ్ర గాయమైందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పట్ల గంగారం ఆశ్రమ పాఠశాల హెచ్ఎంను ఎన్.చందును వివరణ కోరగా.. ఈ ఘటన బాధాకరమేనని, ఆ విద్యార్థికి చికిత్స చేయిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యల కోసం డీటీడీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
డయేరియాతో పాఠశాల విద్యార్థిని మృతి
నార్నూర్ (ఆదిలాబాద్) : జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ముకాడె జ్యోతి(7) డయేరియాతో సోమవారం మృతిచెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన గిరిజన దంపతులు దుర్పతబాయి, చంపత్రావుల కూతురు జ్యోతి ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆమెకు శనివారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తగ్గకపోవడంతో ఆదివారం ఉదయం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. శనివారం రాత్రి వైద్యం అందించి ఉంటే పాప బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. పాఠశాల వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. -
ఆశ్రమపాఠశాలలో వేధింపులు
పీఎన్‌కాలనీ(శ్రీకాకుళం): మందస మండలం చినకోష్ట గిరిజన ఆశ్రమ పాఠశాలలో వేధింపుల పర్వం సాగుతోంది. గురువులే కీచకులుగా మారిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎలాగైనా ఈ దుశ్చర్యలకు చరమగీతం పాడాలని, తమలా ఇంకెవ్వరూ బాధపడకూడదనీ నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థినులు తల్లిదండ్రులతో కలసి జేసీ-2 రజనీకాంతరావుకు గురువారం ఫిర్యాదు చేశారు. ఆశ్రమపాఠశాలలో 350 మందికి పైగా గిరిజన విద్యార్ధినులు 10వ తరగతి వరకు చదువుతుండగా 7,8,9,10 తరగతుల విద్యార్థినులపై లైంగికవేధింపులు జరిగినట్టు వారు ఆరోపించారు. వేధింపులు ఇలా... ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నవారిలో ఒడిశాకు చెందినవారే ఎక్కువ. వారిని బెదిరించి తాము చెప్పినట్టు చేయాలని లేకపోతే మార్కులు తగ్గించేస్తామనీ, టీసీలు ఇచ్చి పంపిస్తామని భయపెట్టి కొందరు ఉపాధ్యాయులు లైంగికంగా వేధించారని తెలిపారు. లైంగిక వేధింపులకు సహకరించకపోతే.. వారిచేత బట్టలు ఉతికించడం, గిన్నెలు తోమించడంతో పాటు వెట్టిచాకిరీ పనులు చేయించారని తెలిపారు. ఇక చేసేది లేక తాము పడుతున్న వేదనను తొలుత వారి తల్లిదండ్రులకు చెప్పారు. అక్కడ చదువుతున్న మరికొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు కీచక గురువుల భరతం పట్టేందుకు నిర్ణయించుకున్నారు. గతంలో డీఆర్డీఏ పీడీ తనూజారాణి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, జిల్లా కలెక్టర్ పి లక్ష్మీనృసింహం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆయన్ను కలవడానికి రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావును కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కీచక కృత్యాలను ఆయనకు వివరించారు. తమ పిల్లలను అక్కడ చదివించాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చర్యలు చేపట్టకుంటే కలెక్టరేట్‌ను ముట్టడి విద్యార్థినులను లైంగిక వేదింపులకు గురిచేస్తున్న కీచక ఉపాధ్యాయులను తొలగించాలనీ కలెక్టర్ స్వయంగా వచ్చి అక్కడ విచారణ జరిపించాలనీ ఆదివాసీల సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబయోగి డిమాండ్ చేశారు. పీడీ తనూజారాణి చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే చర్యలు చేపట్టకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.