పీఎన్‌కాలనీ(శ్రీకాకుళం): మందస మండలం చినకోష్ట గిరిజన ఆశ్రమ పాఠశాలలో వేధింపుల పర్వం సాగుతోంది. గురువులే కీచకులుగా మారిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎలాగైనా ఈ దుశ్చర్యలకు చరమగీతం పాడాలని, తమలా ఇంకెవ్వరూ బాధపడకూడదనీ నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థినులు తల్లిదండ్రులతో కలసి
జేసీ-2 రజనీకాంతరావుకు గురువారం ఫిర్యాదు చేశారు. ఆశ్రమపాఠశాలలో 350 మందికి పైగా గిరిజన విద్యార్ధినులు 10వ తరగతి వరకు చదువుతుండగా 7,8,9,10 తరగతుల విద్యార్థినులపై లైంగికవేధింపులు జరిగినట్టు వారు ఆరోపించారు.
వేధింపులు ఇలా...
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నవారిలో ఒడిశాకు చెందినవారే ఎక్కువ. వారిని బెదిరించి తాము చెప్పినట్టు చేయాలని లేకపోతే మార్కులు తగ్గించేస్తామనీ, టీసీలు ఇచ్చి పంపిస్తామని భయపెట్టి కొందరు ఉపాధ్యాయులు లైంగికంగా వేధించారని తెలిపారు. లైంగిక వేధింపులకు సహకరించకపోతే.. వారిచేత బట్టలు ఉతికించడం, గిన్నెలు తోమించడంతో పాటు వెట్టిచాకిరీ పనులు చేయించారని తెలిపారు. ఇక చేసేది లేక తాము పడుతున్న వేదనను తొలుత వారి తల్లిదండ్రులకు చెప్పారు. అక్కడ చదువుతున్న మరికొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు కీచక గురువుల భరతం పట్టేందుకు నిర్ణయించుకున్నారు. గతంలో డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, జిల్లా కలెక్టర్ పి లక్ష్మీనృసింహం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆయన్ను కలవడానికి రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావును కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కీచక కృత్యాలను ఆయనకు వివరించారు. తమ పిల్లలను అక్కడ చదివించాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
చర్యలు చేపట్టకుంటే కలెక్టరేట్‌ను ముట్టడి
విద్యార్థినులను లైంగిక వేదింపులకు గురిచేస్తున్న కీచక ఉపాధ్యాయులను తొలగించాలనీ కలెక్టర్ స్వయంగా వచ్చి అక్కడ విచారణ జరిపించాలనీ ఆదివాసీల సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబయోగి డిమాండ్ చేశారు. పీడీ తనూజారాణి చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే చర్యలు చేపట్టకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఆశ్రమపాఠశాలలో వేధింపులు
Published Thu, Sep 24 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement