రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులపై తరచూ అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు
‘బద్లాపూర్’ఘటనతో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బీఎంసీ నిర్ణయం
ముంబై పరిధిలోని పాఠశాలలకు మాత్రమే పరిమితమైన వైనం
విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల భయాందోళనలు
సంఘటనల సమయంలోనే హడావుడి నిర్ణయాలు
ఆ తరువాత వాటి ఊసే లేదంటూ విమర్శ
దాదర్: విద్యార్ధులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ అనేక బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్కూళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ఇంతవరకూ పూర్తికాలేదు. దీంతో విద్యార్ధుల భద్రత ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ గాలికి వదిలేసినట్టైంది సుమారు నాలుగు నెలల కిందట బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో ఉన్న అన్ని బీఎంసీ పాఠశాలల్లోని తరగతి గదుల్లో, కాంపౌండ్, పాఠశాల ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. కానీ ముంబై సిటీ పరిధిలో ఉన్న బీఎంసీ పాఠశాలల్లో మాత్రమే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. పశి్చమ, తూర్పు ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో ఇంతవరకు వాటి ఊసే లేదు. నిధుల కొరత వల్ల వాటిని ఏర్పాటు చేయలేదని బీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
‘బద్లాపూర్’ఘటనతో మళ్లీ తెరమీదకు...
ముంబై, ఉప నగరాల్లో బీఎంసీకి చెందిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఏడున్నర వేలకుపైగా ఉపాధ్యాయులు బీఎంసీ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. వీరిలో పురుషులతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయుల సంఖ్య అధికం. దీంతో వారికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత బీఎంసీపై ఉంది. పాఠశాల తరగతి గదుల్లో, కాంపౌండ్‌లో, ఆవరణలో విద్యార్ధులపై లైంగిక దాడులు, వేధింపులు చోటుచేసుకుంటే సీసీ టీవీ కెమరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలు నిందితులను గుర్తించడానికి ఎంతో దోహద పడతాయి. దీంతో బీఎంసీకి చెందిన అన్ని పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన సంఘటనలతో అప్రమత్తమైన బీఎంసీ అన్ని స్కూళ్లలోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్, గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న బీఎంసీ ఎన్నికలు, ఇతర అనివార్యకారణాలవల్ల కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కానీ బద్లాపూర్ ఘటనతో ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు సలహదారుల కమిటీని నియమించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది.
ఈ ‘ఆర్థిక బడ్జెట్’లో నిధుల మంజూరు?
బీఎంసీకి పరిధిలో మొత్తం 479 పాఠశాలుండగా వీటిలో ముంబై సిటీలో ఉన్న 123 పాఠశాలల్లో 2,832 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ నిధుల కొరత వల్ల ఉప నగరాల్లో ఉన్న 356 పాఠశాల్లో మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేదు. చివరకు బీఎంసీ అదనపు కమిషనర్ అమిత్ సైనీ జోక్యం చేసుకుని నిధుల మంజూరుకు ఆదేశించారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమలులోకి వచి్చంది. దీంతో నిధులు మంజూరు ప్రతిపాదన అటకెక్కింది. ఫలితంగా ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో సుమారు ఆరువేల సీసీ టీవీ కెమరాలు ఏర్పాటుచేసే ప్రక్రియ పెండింగులో పడిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తయి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. దీంతో ఈ పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు రూ.54 కోట్లు అవసరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశపెట్టే ఆరి్ధక బడ్జెట్‌లో నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని బీఎంసీ యోచిస్తోంది.
ఇదీ చదవండి: Birthright citizenship : ట్రంప్‌కు షాక్, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment