
న్యూస్‌మేకర్ – కరిబసమ్మ
ఆమె మరణించదలుచుకుంది. ‘సగౌరవంగా మరణించే హక్కును ప్రసాదించండి’ అని 24 ఏళ్ల పాటు పోరాడి ఆ హక్కును సాధించుకుంది. ‘రైట్ టు డై విత్ డిగ్నిటీ’ అనే డిమాండ్‌తో ‘యుథనేసియా’ ద్వారా ప్రాణం విడువనున్న 85 ఏళ్ల కరిబసమ్మ కొత్త చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ‘మన దేశంలో పేదరికం వల్ల వైద్యం చేయించుకోలేక, వైద్యం లేని జబ్బుల వల్ల కోట్ల మంది బాధపడుతున్నారు. వారికి సగౌరవంగా మరణించే హక్కు ఉంది’ అంటోంది కరిబసమ్మ. వివరాలు....
‘రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చినట్టుగానే మరణించే హక్కు కూడా ఇచ్చింది. నేనెందుకు గౌరవంగా మరణించకూడదు? నేను మరణించేందుకు ప్రభుత్వం ఎందుకు సాయపడకూడదు? యుథనేసియా (మెర్సీ కిల్లింగ్) నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాల్లో ఉంది. అది ఎక్కువ అవసరమైనది మన దేశంలోనే’ అంటుంది 85 ఏళ్ల కరిబసమ్మ.
‘మెర్సీ కిల్లింగ్’ కోసం 24 ఏళ్లుగా పోరాడుతోందామె. ఇప్పుడు ఆమెకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జనవరి 30న ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ రాష్ట్రంలో అనివార్యమైన పరిస్థితుల్లో ఉన్న 70 ఏళ్లకు పైబడిన వారు ‘రైట్ టు డై’ హక్కును ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే ఇతర అనుమతులు కూడా ఓకే అయితేనే రెండు వారాల్లో కరిబసమ్మకు దయామరణం ప్రాప్తించవచ్చు.
ఎవరు ఈ కరిబసమ్మ?
కర్నాటకలోని దావణగెరెకు చెందిన కరిబసమ్మ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు వయసు 85 ఏళ్లు. 30 ఏళ్ల క్రితం ఆమెకు డిస్క్ స్లిప్ అయ్యింది. దాంతో నడవడం ఆమెకు పెద్ద సమస్య అయ్యింది. నొప్పికి తట్టుకోలేక చావే నయం అని నిశ్చయించుకుంది. దాదాపుగా 24 ఏళ్లుగా ఆమె ఇందుకై పోరాడుతోంది. 2010లో పదివేల సంతకాలతో ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎందరో అధికారులకు, మంత్రులకు, రాష్ట్రపతికి ఆమె లేఖలు రాసింది.
రాష్ట్రపతికి లేఖ రాశాక పోలీసులు వచ్చి ఇందుకు మన దేశంలో అనుమతి లేదని, కనుక పిటిషన్లు పంపవద్దని కోరారు. దాంతో కరిబసమ్మ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ నువ్వు జైలుకెళితే మా మర్యాద ఏం కాను అని వారు ఆమెను నిలదీశారు. దాంతో ఆమె కేర్ హోమ్‌కు మారింది. తన పోరాటం కోసం ఇంటిని అమ్మి అందులో ఆరు లక్షలు బి.ఎస్.ఎఫ్ జవాన్ల సంక్షేమానికి ఇచ్చింది. మిగిలిన డబ్బుతో తన పోరాటం సాగించింది. ఇప్పుడు ఆమె కేన్సర్‌తో బాధ పడుతోంది.
2018లో సుప్రీంకోర్టు
రైట్ టు డై హక్కును సుప్రీంకోర్టు 2018లో అంగీకరించింది. ‘రాజ్యాంగపరంగా మరణించే హక్కు పౌరులకు లభిస్తుంది’ అని చెప్పింది. 2023లో ఎవరు ఏ వయసు, పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి విన్నపాన్ని కోరవచ్చో మార్గదర్శకాలను సూచించింది. అయితే కర్నాటక ప్రభుత్వం ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు డైరెక్షన్ గురించి దృష్టి పెట్టలేదు. అంటే మెర్సీ కిల్లింగ్ పట్ల సంశయ మౌనం దాల్చింది. కాని కరిబసమ్మ పట్టుదల వల్ల ఇన్నాళ్లకు అనుమతినిచ్చింది.
70 ఏళ్లు పైబడి
‘70 ఏళ్లు పైబడి, వైద్యపరంగా మందులకు స్పందించని స్థితిలో, సపోర్ట్ సిస్టమ్ మీద ఉంటే అటువంటి వారికి మెర్సీ కిల్లింగ్ గురించి ప్రభుత్వం అనుమతిని పరిశీలిస్తుంది. మనది సభ్య సమాజం. బాధితులను ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు. కాబట్టి అడిగిన వెంటనే మరణించే హక్కుకు అనుమతి లభిస్తుందని ఆశించవద్దు. కరిబసమ్మ విషయంలో కూడా ఆరోగ్యశాఖ ఆమెను పరిశీలించి ఆరోగ్యపరంగా దుర్భర స్థితిలో ఉందని తేల్చితేనే ఆమెకు రైట్ టు డై అనుమతి లభిస్తు్తంది’ అని కర్నాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రాణం తీసుకోవడం పాపం కాదా?‘ఆత్మహత్య, మరణాన్ని కోరుకోవడం ఏ మతమూ అంగీకరించదు. దీనిపై మీరేమంటారు?’ అని కరిబసమ్మను అడిగితే ‘అలా మతాచారాలు, విశ్వాసాలు మాట్లాడేవారు రోడ్డు మీద దిక్కు లేక అనారోగ్యంతో బాధపడే వృద్ధులను తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టుకోవాలి. అప్పుడు మాట్లాడాలి. అనుభవించేవారికి తెలుస్తుంది బాధ. మన దేశంలో పేదరికంలో ఉన్న వృద్ధులు జబ్బున పడితే చూసే దిక్కు ఉండదు. వాళ్లు మలమూత్రాలలో పడి దొర్లుతుండాలా? వారు సగౌరవంగా మరణించాలని కోరుకుంటే మనం ఆ కోరికను ఎందుకు గౌరవించకూడదు? అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment