కర్ణాటకకు చెందిన సమైరా హల్లూర్ 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ అయ్యింది.ఆరు రాతపరీక్షలు 200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఆమెకు ఈ అర్హతను సంపాదించి పెట్టాయి. కొత్త ఎత్తులకు ఎగరాలనుకునే ఈ తరానికి ప్రతినిధి సమైరా.
కొన్నేళ్ల క్రితం బీజాపూర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి భారీగా జరిగే ఉత్సవాలు. ఆ సందర్భంగా ప్రభుత్వం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసింది. టికెట్ కొనుక్కుంటే అలా ఊరి మీద ఒక రౌండ్ వేయొచ్చు. హైస్కూల్ చదువుతున్న సమైరాను సంతోపెట్టడానికి తండ్రి అమిన్ హల్లూర్ భార్యతో కలిసి హెలికాప్టర్ రైడ్‌కు వెళ్లారు. సమైరాకు పైలట్ పక్కన సీటు దొరికింది. హెలికాప్టర్ పైకి ఎగురుతుండగానే ఆ అనుభూతికి థ్రిల్ అయిపోయింది సమైరా.
పైలట్ డ్రస్, ఆ దర్పం, హెలికాప్టర్‌ను ఎగరేస్తున్న ఆ నైపుణ్యం... అందరూ పైలట్‌ను చూస్తున్న అబ్బురమైన చూపు అన్నీ సమైరాను ఆకర్షించాయి. ఆ అమ్మాయి హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్నంతసేపు కింద చూడకుండా పైలట్‌ను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆ పైలట్ సహనశీలి. సమైరా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు.
‘కిందకు దిగాక మాతో సమైరా ఒకటే అంది. నాన్నా... నేను కూడా పైలట్‌ను అవుతాను అని. నేను ఒక మధ్య తరగతి ఇంటీరియర్ డిజైనర్‌ని. నా భార్య టీచర్. మా అమ్మాయి అలాంటి కోరిక కోరడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాంటి కోరిక కోరే అమ్మాయి ఉండాలి కదా అసలు. అందుకే మేము ఏమైనా సరే అమ్మాయిని పైలట్ చేయాలనుకున్నాం. మాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని పొదుపు చేసి ఆమెకోసం ఖర్చు పెట్టాం‘ అంటాడు సమైరా తండ్రి అమిన్ హల్లూర్.
సమైరా ముందు నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్. బీజాపూర్‌లోని సైనిక్ స్కూల్స్‌లో చదువుకుంది. 17 ఏళ్లకు ఎంపీసీలో ఇంటర్ పూర్తి చేసింది. ‘కమర్షియల్ పైలట్ కావాలంటే సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ పెట్టే పరీక్షలు పాసవ్వాలి. ఆ తర్వాత ఫ్లయింగ్ అవర్స్‌లో అనుభవం ఉండాలి’ అంది సమైరా.
ఇంటర్ అయిన వెంటనే సమైరా న్యూఢిల్లీలోని‘వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడెమీ’లో థియరీకి సంబంధించిన అవసరమైన కోర్సును పూర్తిచేసింది. ‘నా 18వ ఏట పూర్తయ్యే సమయానికి అవసరమైన 6 పరీక్షలను రాసి పాస్ అయ్యాను. అయితే రేడియో ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ పేపర్ రాయాలంటే 18 ఏళ్లు నిండాలని నియమం. అందుకని పద్దెనిమిది నిండాక ఆ పేపర్ రాసి పాసయ్యాను’ అని తెలిపింది సమైరా.
బారామతిలో రెక్కలు
థియరీ ఢిల్లీలో పూర్తి చేశాక విమానం నడిపే అనుభవం కోసం సమైరా మహారాష్ట్రలోని ‘కార్వార్ ఏవియేషన్ అకాడెమీ’లో చేరింది. ఆరునెలల్లో అక్కడ 200 గంటలపాటు విమానం ఎగరేసే అనుభవాన్ని సాధించింది. ‘నేను రాత్రిపూట విమానం నడపడంలోనూ మల్టీ ఇంజిన్ విమానాలు నడపడంలోనూ అనుభవం సాధించాను’ అని తెలిపింది సమైరా. ‘పైలట్‌లు నాకు ఎంతో సహకరించారు. వారి స్ఫూర్తితోనే 19వ ఏటలోకి అడుగు పెట్టకముందే కమర్షియల్ పైలట్‌గా అర్హత సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది సమైరా.
ఉత్తర కర్ణాటకకు స్ఫూర్తి
‘ఉత్తర కర్ణాటకలో అమ్మాయిలు చదువులో వెనుకబడి ఉన్నారు. బీజాపూర్ నుంచి సమైరా అందరూ చదివి చదువు లాంటిది కాకుండా పైలట్ చదువు చదవాలనుకోవడం అతి తక్కువ వయసులో ఆ ఘనత సాధించడంతో మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఉత్తర కర్ణాటకలోని అమ్మాయిలను ఈ విషయం ఎంత ఉత్సాహపరుస్తుందో మీరు ఊహించలేరు. అమ్మాయిలు చదవాలనుకుంటే, తల్లిదండ్రులు వారినిప్రాంపోత్సహిస్తే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి’ అని ఆప్రాంపాంతానికి చెందిన అక్క మహాదేవి విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రొఫెసర్ కార్కరే అన్నారు.
సమైరా భుజాన రెక్కలతో రివ్వున దూసుకుపోతుంది. ఆ తార ఎందరికో ఇకపై దారి చూపనుంది. గెలుపు గాథలకు ఏ మూల ఏ ఇంట్లో మొదటి అడుగు పడుతుందో కదా.
Comments
Please login to add a commentAdd a comment