Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు | Thayamma helps other Released Bonded Labourers through the Udayonmukha Trust | Sakshi
Sakshi News home page

Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు

Published Fri, May 17 2024 6:29 AM | Last Updated on Fri, May 17 2024 6:29 AM

Thayamma helps other Released Bonded Labourers through the Udayonmukha Trust

మైసూరు చుట్టుపక్కల చెరుకు తోటల్లో వెట్టి పాలేర్లను పెట్టుకోవాలని చూస్తారు కొంతమంది. అప్పులిచ్చి వాళ్లను పాలేర్లుగా మారుస్తారు. తాయమ్మ కూడా ఒక వెట్టి పాలేరు. కానీ, ఆమె వెట్టి నుంచి బయట పడింది.  సొంత ఉపాధి పొందింది. అంతే కాదు అప్పులపాలై వెట్టికి వెళ్లే దిగువ వర్గాల స్త్రీల విముక్తికి పోరాడుతోంది. మైసూరుకు చెందిన తాయమ్మ ఒక యోధురాలు. ధీర.

‘అదంతా ఎలా తట్టుకున్నానో. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటుంది తాయమ్మ. 33 ఏళ్ల ఈ ముగ్గురు పిల్లల తల్లి చేసిన నేరం ఏదైనా ఉంటే వెనుకబడిన వర్గాల్లో పుట్టడం. పేదరికంలో ఉండటం. ‘మా పేటల్లో సరైన ఇళ్లు ఉండవు. పరిశుభ్రత ఉండదు. మా కాలంలో మమ్మల్ని చదివించకుండా పొలాల్లో పని చేసే కూలీలను చేశారు. నేనూ నా భర్త మూర్తి ఇద్దరం పాలేరు పనులు చేస్తూనే పెళ్లి చేసుకున్నాం. ముగ్గురు పిల్లల్ని కన్నాం. వారి భవిష్యత్తు కోసం ఆరాట పడటమే మేము చేసిన నేరం’ అంటుంది తాయమ్మ.

మైసూరు జిల్లాలోని లోపలి ్రపాంతమైన హన్సూర్‌ అనే ఊరిలో చెరకు పండిస్తారు. రోజువారీ కూలీల కంటే వెట్టి కూలీలుగా కొందరిని పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు. దిగువ వర్గాల వారి ఆర్థికస్థితిని అవకాశంగా తీసుకుని వారి చేత వెట్టి చేయించుకుంటారు. 

‘నా భర్త మూర్తి మాకున్న కొద్ది స్థలంలో ఒక చిన్న ఇల్లేదైనా వేసుకుందామని అనుకున్నాడు. మా ముగ్గురు పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో పెంచాలని అనుకున్నాము. అందుకు 60 వేలు అప్పు తీసుకున్నాం. ఆ కొద్ది అప్పు వడ్డీతో కలిసి మా జీవితాలను తల్లకిందులు చేసింది. అప్పు తీర్చలేకపోవడం వల్ల నేను, నా భర్త వెట్టికి వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు నేను, నా భర్త చెరుకు తోటల్లో వెట్టి చాకిరీ చేశాం. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాకు పని ఉండనే ఉండేది. నేను నా చిన్న కొడుకును వీపున కట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, కూడు నెత్తిన పెట్టుకుని పనికి వెళ్లేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా ఒకరు పొలంలో ఉండి ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత ఘోరమైన వెట్టి అది. నా పిల్లలు బాగా చదువుకుంటేనే ఇలాంటి వెట్టి నుంచి బయటపడగలరనుకున్నాను. మూడేళ్లు కష్టపడి పని చేసినా మాకు విముక్తి రాకపోయేసరికి ఎవరో అధికారులకు చెప్పి మాకు విముక్తి కలిగించారు.’ అని చెప్పింది తాయమ్మ.

స్వేచ్ఛ పొందిన తాయమ్మ, ఆమె భర్త వాళ్లకు ఉన్న ఒక కొబ్బరి చెట్టు కాయలతో చిన్న షాప్‌ పెట్టుకున్నారు. కర్నాటకలో వెట్టి పాలేర్ల విముక్తి కోసం పని చేసే ‘ఉదయోన్ముఖ ట్రస్ట్‌’ తాయమ్మకు లోన్‌ ఇప్పించింది– కుట్టు మిషన్ల కోసం. తాయమ్మకు కుట్టు పనిలో ఉన్న ్రపావీణ్యం ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెలా వెట్టి నుంచి విముక్తి పొందిన మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కలిగిస్తోంది.

‘ఇంటిని ముందుకు నడపడంలో స్త్రీ కీలకం. ఆమె ఓడిపోకూడదు. కుటుంబం కోసం పోరాడాలి. అడ్డంకులను అధిగమించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈ హక్కు అందరు పిల్లలకు దొరకాలి. వలస వచ్చే కూలీలు, దిగువ కులాల పేదలు వెట్టిలో చిక్కుకుంటున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వారి పిల్లలకు సరైన చదువు అందేలా ప్రభుత్వాలు పని చేయాలి’ అంటోంది తాయమ్మ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement