Employment creator
-
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్‌కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్‌టైమ్ జాబ్‌తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్‌స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు
మైసూరు చుట్టుపక్కల చెరుకు తోటల్లో వెట్టి పాలేర్లను పెట్టుకోవాలని చూస్తారు కొంతమంది. అప్పులిచ్చి వాళ్లను పాలేర్లుగా మారుస్తారు. తాయమ్మ కూడా ఒక వెట్టి పాలేరు. కానీ, ఆమె వెట్టి నుంచి బయట పడింది. సొంత ఉపాధి పొందింది. అంతే కాదు అప్పులపాలై వెట్టికి వెళ్లే దిగువ వర్గాల స్త్రీల విముక్తికి పోరాడుతోంది. మైసూరుకు చెందిన తాయమ్మ ఒక యోధురాలు. ధీర.‘అదంతా ఎలా తట్టుకున్నానో. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటుంది తాయమ్మ. 33 ఏళ్ల ఈ ముగ్గురు పిల్లల తల్లి చేసిన నేరం ఏదైనా ఉంటే వెనుకబడిన వర్గాల్లో పుట్టడం. పేదరికంలో ఉండటం. ‘మా పేటల్లో సరైన ఇళ్లు ఉండవు. పరిశుభ్రత ఉండదు. మా కాలంలో మమ్మల్ని చదివించకుండా పొలాల్లో పని చేసే కూలీలను చేశారు. నేనూ నా భర్త మూర్తి ఇద్దరం పాలేరు పనులు చేస్తూనే పెళ్లి చేసుకున్నాం. ముగ్గురు పిల్లల్ని కన్నాం. వారి భవిష్యత్తు కోసం ఆరాట పడటమే మేము చేసిన నేరం’ అంటుంది తాయమ్మ.మైసూరు జిల్లాలోని లోపలి ్రపాంతమైన హన్సూర్ అనే ఊరిలో చెరకు పండిస్తారు. రోజువారీ కూలీల కంటే వెట్టి కూలీలుగా కొందరిని పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు. దిగువ వర్గాల వారి ఆర్థికస్థితిని అవకాశంగా తీసుకుని వారి చేత వెట్టి చేయించుకుంటారు. ‘నా భర్త మూర్తి మాకున్న కొద్ది స్థలంలో ఒక చిన్న ఇల్లేదైనా వేసుకుందామని అనుకున్నాడు. మా ముగ్గురు పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో పెంచాలని అనుకున్నాము. అందుకు 60 వేలు అప్పు తీసుకున్నాం. ఆ కొద్ది అప్పు వడ్డీతో కలిసి మా జీవితాలను తల్లకిందులు చేసింది. అప్పు తీర్చలేకపోవడం వల్ల నేను, నా భర్త వెట్టికి వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు నేను, నా భర్త చెరుకు తోటల్లో వెట్టి చాకిరీ చేశాం. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాకు పని ఉండనే ఉండేది. నేను నా చిన్న కొడుకును వీపున కట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, కూడు నెత్తిన పెట్టుకుని పనికి వెళ్లేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా ఒకరు పొలంలో ఉండి ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత ఘోరమైన వెట్టి అది. నా పిల్లలు బాగా చదువుకుంటేనే ఇలాంటి వెట్టి నుంచి బయటపడగలరనుకున్నాను. మూడేళ్లు కష్టపడి పని చేసినా మాకు విముక్తి రాకపోయేసరికి ఎవరో అధికారులకు చెప్పి మాకు విముక్తి కలిగించారు.’ అని చెప్పింది తాయమ్మ.స్వేచ్ఛ పొందిన తాయమ్మ, ఆమె భర్త వాళ్లకు ఉన్న ఒక కొబ్బరి చెట్టు కాయలతో చిన్న షాప్ పెట్టుకున్నారు. కర్నాటకలో వెట్టి పాలేర్ల విముక్తి కోసం పని చేసే ‘ఉదయోన్ముఖ ట్రస్ట్’ తాయమ్మకు లోన్ ఇప్పించింది– కుట్టు మిషన్ల కోసం. తాయమ్మకు కుట్టు పనిలో ఉన్న ్రపావీణ్యం ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెలా వెట్టి నుంచి విముక్తి పొందిన మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కలిగిస్తోంది.‘ఇంటిని ముందుకు నడపడంలో స్త్రీ కీలకం. ఆమె ఓడిపోకూడదు. కుటుంబం కోసం పోరాడాలి. అడ్డంకులను అధిగమించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈ హక్కు అందరు పిల్లలకు దొరకాలి. వలస వచ్చే కూలీలు, దిగువ కులాల పేదలు వెట్టిలో చిక్కుకుంటున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వారి పిల్లలకు సరైన చదువు అందేలా ప్రభుత్వాలు పని చేయాలి’ అంటోంది తాయమ్మ. -
పెట్టుబడులు, ఆవిష్కరణలతో ఉపాధికి ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్‌కేర్‌లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... గతం భవిష్యత్తుకు బాట కావాలి మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి. గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం గిడ్డంగి, సరఫరా చైన్ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రైవేటు వినయోగం పెరగాలి కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే... è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం. è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి. è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రోపాలిటన్ నగరాలు ముందంజలో నిలవనున్నాయి. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం నుంచి భారత్ క్రమంగా కోలుకుంటున్న దశలో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన యువతకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కరోనా ఇబ్బందులకు టీకా కార్యక్రమం ద్వారా చెక్ పెట్టే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధిక శాతం ప్రజలకు టీకాలు వేయడంలో మెట్రో నగరాలు మరింత పురోగతిని సాధిస్తున్నాయి. ఇలా ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్న హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్‌లు ఉద్యోగాల కల్పనలో సైతం దేశంలోనే అగ్ర భాగాన నిలవనున్నట్టు స్టాఫింగ్ సంస్థ ‘టీమ్ లీజ్ సర్వీసెస్’తాజా సర్వే వెల్లడించింది. ఆర్థిక రంగం కుదుటపడేందుకు దోహదం కరోనా సెకండ్ వేవ్ దుష్పరిణామాల నుంచి బయటపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం కుదుటపడేందుకు.. వ్యాపార, వాణిజ్యాలు మెరుగు కావడం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో దోహదం చేయనున్నట్టు అధ్యయనం అంచనా వేసింది. వివిధ రంగాలకు సంబంధించిన వాణిజ్య అవసరాలు, వ్యాపారాల పురోగతిని బట్టి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు తెలిపింది. పర్మినెంట్ ఉద్యోగాలు–నైపుణ్యంతో కూడిన తాత్కాలిక ఉద్యోగాల (స్కిల్డ్ టెంపరరీ జాబ్స్) మధ్యనున్న వేతన వ్యత్యాసాలు తగ్గిపోతాయని పేర్కొంది. అమ్మకాలు (సేల్స్), సాంకేతికత (టెక్నాలజీ) రంగాల్లో, మరి ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక (డీప్ టెక్) నైపుణ్యాలకు ప్రధాన నగరాల్లో అత్యధిక డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాపారాలు నిలదొక్కుకునేలా పురోగతి సాధనకు గాను కంపెనీలు ఈ అత్యాధునిక సాంకేతిక నిపుణుల కోసం అన్వేషిస్తున్నట్టుగా ఈ పరిశీలనలో వెల్లడైంది. ఈ ఏడాదిలో మొత్తం 618 కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా సంస్థ ఈ అంచనాలకు వచ్చినట్లు ‘టీమ్ లీజ్’వైస్ ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకులు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి ప్రభావం ఐటీ, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, ఎడ్ టెక్ తదితర రంగాలపై ఎక్కువగా పడలేదు ► బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, టెలికాం, తయారీ, ఇంజనీరింగ్ రంగాలు త్వరగానే కోలుకుంటున్నాయి ► వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టొచ్చు. ► రిటైల్, జీవనశైలి (లైఫ్‌స్టైల్) ఆతిథ్యం వంటి రంగాలు కోలుకునేందుకు సుదీర్ఘ కాలం పట్టే అవకాశాలున్నాయి. ► ‘డీప్ టెక్’లో సూపర్ స్పెషలైజేషన్ నైపుణ్యాలున్న వారికి అత్యధిక వేతనాలు లభించే అవకాశం ఉంది. ► వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్, వాహన.. నిర్మాణ రంగాలకు, రియల్ ఎస్టేట్, ఈ–కామర్స్, టెక్ స్టార్టప్‌లు, పారిశ్రామిక తయారీ, ఆర్థిక రంగాలకు ఆదరణ పెరుగుతోంది. తెలంగాణలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు ప్రజల్లో కరోనా భయం తగ్గుతుండడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతున్న క్రమంలో మెరుగైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వివిధ రంగాలకు సంబంధించిన వాణిజ్య, వ్యాపారాలు కోలుకుంటున్న నేపథ్యంలో ఆటోమోటివ్, బ్యాంకింగ్, తయారీ, ఫార్మా, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ప్రధానంగా విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్ సంస్థలు ఎక్కువగా రావడం శుభ పరిణామం. అంతర్జాతీయ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థలు సైతం తెలంగాణకు వస్తుండడంతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. – డాక్టర్ బి.అపర్ణ రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
నాడు కార్మికుడు.. నేడు యజమాని
సాక్షి, రాజేంద్రనగర్: పదవ తరగతి పాసై ఉన్నత విద్యకు నోచుకోక ఆ యువకుడు పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. ఒకపక్క పని చేస్తూనే మరోపక్క తాను పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని ఆలోచించేవాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. పైసాపైసా కూడబెట్టి చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. అంచలంచలుగా ఎదుగుకుంటూ నేడు 40 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన అడికే మారప్ప, కమలమ్మలకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. రెండవ కుమారుడైన అడికే అర్జున్ 10వ తరగతి వరకు పాతబస్తీలోని రాఘవేంద్ర స్కూల్లో అభ్యసించాడు. వేసవి సెలవుల్లో కాటేదాన్ పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో పని చేసేవాడు. ఇలా ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ యజమాని మెప్పుపొందాడు. సెలవులు, ఆదివారాల్లో పరిశ్రమకు వెళ్లి పని చేసి వచ్చేవాడు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్యా చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా పరిశ్రమలో చేరాడు. పని చేస్తూనే తాను కూడా పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. ఇలా తనకు వచ్చే జీతంలో కొంత భాగం పక్కనపెట్టి ఆ డబ్బుతో చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. నలుగురితో ప్రారంభించిన ఆ పరిశ్రమ నేడు 40 మందితో కోనసాగుతోంది. రిసైక్లింగ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రస్తుతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పని చేసిన పరిశ్రమలో నేర్చుకున్న మెలకువలతో నేడు అదే పరిశ్రమను స్థాపించి నిలదొక్కుకున్నాడు. సంఘ సేవకుడిగా... అడికే అర్జున్ సంఘ సేవకుడిగానూ గుర్తింపు పొందాడు. యువజన సంఘాలతో పాటు స్థానికంగా పేరు సంపాదించాడు. గత రెండు సంవత్సరాలుగా రాజేంద్రనగర్ సర్కిల్ మహాత్మా జ్యోతిరావుపూలే జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరూ వచ్చిపా తన స్థాయికి అనుగుణంగా సహాయం చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పినప్పటికీ తనవల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తన వంతు సహాయ, సహకారాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నాడు. హరితహారం కార్యక్రమం పాల్గొని మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. దూరప్రాంతాలకు వెళ్లిన సమయంలో తాను సేకరించిన అన్ని రకాల విత్తనాలను అడవుల్లో చల్లుతూ మొక్కలు మొలిచేవిధంగా పాటుపడుతున్నాడు. వర్షాకాలం మొదలై వర్షాలు ప్రారంభం కాగానే వీటిని చల్లుతానని తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా కొత్తగా విత్తన బాల్స్‌ను తయారు చేసి అడవులు, ఇతర గుట్టల్లో వేస్తున్నట్లు వివరించాడు. – అడికే అర్జున్ -
అమెరికాలో 3 లక్షల ఉద్యోగాల సృష్టి
వాషింగ్టన్: అమెరికాలో గత డిసెంబర్లో కొత్తగా సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు అధికారిక నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో నిరుద్యోగిత రేటు 3.9 శాతంగా నమోదైందని, వ్యవసాయేతర రంగాల్లో కొత్తగా 3.12 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. అమెరికా తొలిసారిగా 150 మిలియన్ జాబ్ మార్క్‌ను అందుకుందని కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ పేర్కొన్నారు. ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ: సీనియర్ డెమోక్రాట్, భారత్ అనుకూల నేతగా పేరున్న నాన్సీ పెలోసీ(78) అమెరికా ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. దీంతోపాటు ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పెలోసీ నేతృత్వంలో సమావేశమైన సభ ‘షట్‌డౌన్’కు ముగింపు పలుకుతూ మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు లేకుండానే బిల్లును ఆమోదించింది. -
ఉపాధి కల్పనలో ఐటీ రంగం టాప్...
బెంగళూరు: దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) మించి ఐటీ కంపెనీలు ఉపాధి కల్పిస్తున్నాయని ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పారు. ఐటీ సంస్థలు 32 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, ఏటా అదనంగా రెండు లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. తయారీ రంగానికి చైనా ప్రసిద్ధి చెందినట్లే .. ఐటీకి కేంద్రంగా భారత్ ఎదిగిందని మూర్తి పేర్కొన్నారు. కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగానికి పరోక్షంగా మరో మూడు ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని మూర్తి పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలు భారీ ఆదాయాలతో కల్పించినన్ని ఉద్యోగాలు.. వందేళ్ల చరిత్రలో మరే ఇతర కంపెనీ కూడా కల్పించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ ఉద్యోగాలు దేశీ ఎకానమీని కూడా గణనీయంగా మార్చేశాయి. వీటి తోడ్పాటుతో నేడు మన యువత ఖరీదైన వాహనాలు, గృహాలు కొనుక్కోగలుగుతున్నారు. సూపర్మార్కెట్లలో షాపింగ్ చేస్తున్నారు’ అని మూర్తి వివరించారు. మూడు వందల ఏళ్లలో తొలిసారిగా ఐటీ ఊతంతోనే భారత్ అంతర్జాతీయ వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగిందని చెప్పారు. ‘ఇప్పుడు ఏ సంపన్న దేశానికెళ్లినా భారత్‌కి ప్రత్యేక గౌరవం ఉంది. సాఫ్ట్వేర్ పరిశ్రమే ఇందుకు కారణం. యావత్ప్రపంచానికి ఫ్యాక్టరీగా చైనా ఎలాగైతే పేరు పొందిందో.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో భారత్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంది’ అని మూర్తి పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో దేశీ సాఫ్ట్వేర్ పరిశ్రమ 12-14 శాతం మేర వృద్ధి నమోదు చేయగలదని మూర్తి చెప్పారు. అటు కంపెనీలు సైన్స్, టెక్నాలజీపై కూడా దృష్టి సారించాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా సూచించారు.