సాక్షి, రాజేంద్రనగర్: పదవ తరగతి పాసై ఉన్నత విద్యకు నోచుకోక ఆ యువకుడు పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. ఒకపక్క పని చేస్తూనే మరోపక్క తాను పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని ఆలోచించేవాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. పైసాపైసా కూడబెట్టి చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. అంచలంచలుగా ఎదుగుకుంటూ నేడు 40 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన అడికే మారప్ప, కమలమ్మలకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. రెండవ కుమారుడైన అడికే అర్జున్ 10వ తరగతి వరకు పాతబస్తీలోని రాఘవేంద్ర స్కూల్‌లో అభ్యసించాడు.
వేసవి సెలవుల్లో కాటేదాన్ పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో పని చేసేవాడు. ఇలా ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ యజమాని మెప్పుపొందాడు. సెలవులు, ఆదివారాల్లో పరిశ్రమకు వెళ్లి పని చేసి వచ్చేవాడు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్యా చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా పరిశ్రమలో చేరాడు. పని చేస్తూనే తాను కూడా పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. ఇలా తనకు వచ్చే జీతంలో కొంత భాగం పక్కనపెట్టి ఆ డబ్బుతో చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. నలుగురితో ప్రారంభించిన ఆ పరిశ్రమ నేడు 40 మందితో కోనసాగుతోంది. రిసైక్లింగ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రస్తుతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పని చేసిన పరిశ్రమలో నేర్చుకున్న మెలకువలతో నేడు అదే పరిశ్రమను స్థాపించి నిలదొక్కుకున్నాడు.
సంఘ సేవకుడిగా...
అడికే అర్జున్ సంఘ సేవకుడిగానూ గుర్తింపు పొందాడు. యువజన సంఘాలతో పాటు స్థానికంగా పేరు సంపాదించాడు. గత రెండు సంవత్సరాలుగా రాజేంద్రనగర్ సర్కిల్ మహాత్మా జ్యోతిరావుపూలే జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరూ వచ్చిపా తన స్థాయికి అనుగుణంగా సహాయం చేస్తూ పేరు తెచ్చుకున్నాడు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా
ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పినప్పటికీ తనవల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తన వంతు సహాయ, సహకారాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నాడు. హరితహారం కార్యక్రమం పాల్గొని మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. దూరప్రాంతాలకు వెళ్లిన సమయంలో తాను సేకరించిన అన్ని రకాల విత్తనాలను అడవుల్లో చల్లుతూ మొక్కలు మొలిచేవిధంగా పాటుపడుతున్నాడు. వర్షాకాలం మొదలై వర్షాలు ప్రారంభం కాగానే వీటిని చల్లుతానని తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా కొత్తగా విత్తన బాల్స్‌ను తయారు చేసి అడవులు, ఇతర గుట్టల్లో వేస్తున్నట్లు వివరించాడు.
– అడికే అర్జున్
Comments
Please login to add a commentAdd a comment