Social service
-
Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు.. కానీ అనుకోకుండా?
‘అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఈ జాబ్ రొటీన్‌గా ఉండదు. నేర్చుకోవడానికి రోజూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. కెరీర్లో నేను ఏ ఎక్సయిట్మెంట్నైతే కోరుకున్నానో అది ఈ ఫీల్డ్‌లో దొరికింది. అందుకే ఇందులో సెటిల్ అయిపోయాను!’ – సలోనీ పటేల్.ఆమె పుట్టింది, పెరిగింది.. న్యూ ఢిల్లీలో. పంజాబీ కుటుంబం. చిన్నప్పుడే కథక్ డాన్స్‌లో శిక్షణ పొందింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ చేసింది. చదువైపోగానే టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో జావా డెవలపర్‌గా పనిచేసింది. కానీ ఎలాంటి ఉత్సాహాన్నివ్వని ఆ ఉద్యోగం ఆమెకు ఆసక్తినివ్వలేదు. అందుకే ఇతర కెరీర్ ఆప్షన్స్‌ని ఎక్స్ప్లోర్ చేద్దామనుకుని టీసీఎస్ జాబ్‌కి రిజైన్ చేసింది.ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఎంబీఏ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది. బిజినెస్ స్కూల్లో జాయిన్ కావడానికి 6 నెలల టైమ్ ఉండటంతో మళ్లీ ఉద్యోగ అన్వేషణలో పడిపోయింది. ఈలోపే ‘పర్పుల్ థాట్స్’ అనే మోడలింగ్ ఏజెన్సీ నుంచి మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఏంబీఏలో జాయిన్ అయ్యేవరకు సరదాగా మోడలింగ్ చేద్దామని ఆ చాన్స్‌కి ఓకే చెప్పింది.ర్యాంప్ వాక్‌లు, కొత్తకొత్త వాళ్ల పరిచయం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. ఇవన్నీ మోడలింగ్ మీద సలోనీకి ఇంట్రెస్ట్‌ను పెంచాయి. మోడలింగ్‌లోనే కెరీర్ వెదుక్కోవాలని నిశ్చయించుకుంది.మోడలింగ్ షూట్ కోసం ఒకసారి ముంబై వెళ్లినప్పుడు.. అక్కడ యాక్టింగ్, థియేటర్ వర్క్‌షాప్‌కి హాజరైంది. నచ్చడంతో థియేటర్లో ట్రైనింగ్ తీసుకుంది. పలు నాటకాల్లో నటించింది. ఆ టైమ్‌లోనే ప్యార్ విచ్, పీవైటీ (ప్రెటీ యంగ్ థింగ్) మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది.సలోనీ థియేటర్ పర్ఫార్మెన్స్ జీటీవీ ‘కోల్డ్ లస్సీ ఔర్ చికెన్ మసాలా’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. ఆ తర్వాత ‘ద హార్ట్‌బ్రేక్ హోటల్’ అనే వెబ్ సిరీస్, ‘ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. సలోనీకి బ్రేక్‌నిచ్చిన సిరీస్ మాత్రం ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోని ‘క్యాంపస్ డైరీస్’.ఆమె నటించిన మరో షార్ట్ ఫిల్మ్ ‘ద గుడ్ న్యూస్’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యి, అవార్డులనూ అందించింది.సలోనీ సామాజిక సేవా కార్యకర్త కూడా! ఏమాత్రం సమయం చిక్కినా ముంబైలో జరిగే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. కోవిడ్ సమయంలో తన సేవింగ్స్ అన్నిటినీ కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేసింది.సలోనీ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లు ‘సన్‌ఫ్లవర్’ జీ5లో, ‘పాట్లక్’ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
సమాజానికి అండగా ఉండాలి
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సామాజిక సేవలందించే సంస్థలు సమాజానికి మరింత అండగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సూచించారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ.. అన్నసంతర్పణ సమితి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సేవలను విçస్తృతం చేయాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, వాసవి క్లబ్ గవర్నర్ కొత్త గణేష్‌బాబు అన్నసంతర్పణ సమితి ట్రస్ట్ సేవలను కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్, కార్యదర్శి పీఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిర్విరామంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఒక సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం సేవలందించిన వలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. -
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్‌ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్‌షాప్‌ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్‌గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్‌పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
పల్లెకు పోదాం.. ప్రజాసేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది. 50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు.. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆరు ప్రాధాన్యతా రంగాల్లో.. 129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం.. https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్‌కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు. నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్ -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
టీసీఎస్ ఉద్యోగుల సరికొత్త రికార్డ్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్‌లు కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 22 లక్షల గంటలు టీసీఎస్ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది. హోప్ చొరవలో భాగంగా టీసీఎస్ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు. సేవా కార్యక్రమాలు ఇవే.. సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్‌లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్‌లను టీసీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
12 ఏళ్ల బాలిక.. అవార్డుల ‘గీతిక’
సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా): పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ 12 ఏళ్ల బాలిక చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘సేవ్ వాటర్.. సేవ్ అగ్రికల్చర్.. సేవ్ సాయిల్..’’ నినాదంతో సూళ్లూరుపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతిక ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం గమనార్హం. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సొంత ఖర్చులతో ఓపిగ్గా.. గీతిక తండ్రి వెంకటేషన్ రైల్వే ఉద్యోగి కాగా తల్లి భారతి సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేస్తున్నారు. సూళ్లూరుపేటలోని సాయినగర్‌లో నివసించే గీతికకు చిన్నతనం నుంచే పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా సొంత డబ్బులతో యాదముడి ఇంటిగ్రేటెడ్ రూరల్, అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో మొక్కలను నాటుతోంది. భూతాపం నుంచి భూమిని కాపాడి పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలను నాటుదామంటూ పాఠశాలలు, గ్రామాల్లో విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓపిగ్గా గంటల తరబడి ప్లకార్డులతో నిలుచుని తన లక్ష్యం దిశగా సాగుతోంది. పల్లెలే కాకుండా చెన్నై లాంటి మహా నగరంలోనూ గీతిక చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రకటించారు. తమ కుటుంబానికి ఆర్థికంగా భారమే అయినప్పటికీ ఆ చిన్నారి ప్రయత్నాలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. చెన్నై ప్రాంతంలో ప్లకార్డులతో గంటల కొద్ది నిలబడి అవగాహన కల్పిస్తున్న బాలిక గీతిక సాధించిన అవార్డులు బెంగళూరు, బిహార్, హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓలు, సామాజిక సేవా సంస్థల నుంచి పలు అవార్డులు. 2020 చైల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు, యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ అవార్డు 2021లో గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, ఫేమ్ ఐకాన్ అవార్డు 2022లో సూళ్లూరుపేట ఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఏపీజే అబ్దుల్‌కలాం అవార్డు 2022లో ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్, ఎన్విరాన్మెంటల్ వారియర్ అవార్డులు. 2022లో ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఐకాన్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ద్వారా నేషనల్ అవార్డు, ప్రశంసా పత్రం. ఢిల్లీలో 2023 జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అవార్డు. -
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్‌గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
అలీ పెద్ద మనసు.. మెరిట్ స్టూడెంట్స్‌కు చేయూత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంటాడు. తాజాగా అలీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యంతో మెరిట్ విద్యార్థులకు చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పించబోతున్నారు. ఈ విషయంపై తాజాగా అలీ మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. ఇదేకాదు ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తే.. ఇండియా నుంచి 20 మంది రైతులను అక్కడకు తీసుకెళ్లి ఉపాధి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను’అని అలీ అన్నారు. -
Ms శ్రీదేవి.. ఎల్లలెరుగని సేవ
ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. మద్దిపాడు(ప్రకాశం జిల్లా): Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో ఇన్ఫ్లూయెన్సర్. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది. కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్‌లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్షిప్ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం. -
సంక్షేమం చేరువచేస్తూ..సమాజాన్ని చదివిస్తూ..!
‘‘పనుల్లేక వలసలు పోతున్నారనేది అవాస్తవం. రోజుకు లక్ష మందికి ‘ఉపాధి’ పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 60వేల మంది మాత్రమే వస్తున్నారు. అలాగే పింఛన్లు తీసేశారనేది కూడా సత్యదూరమైన ప్రచారం. అర్హత ఉన్న ఎవ్వరి పింఛన్ తొలగించలేదు. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలకు ఇళ్లు, వారి పిల్లలకు చదువు, పోషకాహారం అందించి ఆరోగ్యవంతులను చేయడంపై ప్రధానంగా దృష్టి సాధించాం. నా బిడ్డను కూడా అంగన్వాడీలో చేర్పించా. క్షేత్రస్థాయి నుంచి సమాజం, పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ, అధికారుల ప్రధాన లక్ష్యం.’’ అని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు సాక్షి: పనుల్లేక వలసలు పోతున్నారని ప్రచారం జరుగుతోంది? నిజంగా పనుల్లేవా? వలసకు కారణమేంటి? నివారణ చర్యలేంటి? కలెక్టర్: ఆదోని డివిజన్లో వలసలు దశాబ్దాలుగా ఉన్నాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వలసలు వెళ్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చించా. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెస్(సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్టడీస్)తో సర్వే చేయించా. గత డిసెంబర్ 12న రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధి పనులు ప్రతీ గ్రామంలో ఉన్నాయి. జిల్లాలో రోజూ లక్ష పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. కానీ 60వేల మందే వస్తున్నారు. పనుల్లేక వలసలు పోతున్నారనేది పచ్చి అబద్ధం. తెలంగాణ, గుంటూరులో నవంబర్, డిసెంబర్, జనవరిలో పత్తికోత కోసం ఆ పని తెలిసిన వారు వెళ్తారు. కిలోకు రూ.14చొప్పున కూలి ఇస్తారు. ఒక్కో వ్యక్తి క్వింటాపైన ఒలిచి రూ.1500–రూ.1800 వరకు సంపాదిస్తారు. పత్తికోత తర్వాత తిరిగి గ్రామాలకు వచ్చి ఉపాధి పనులకు వెళతారు. గతంలో కేరళ, కర్ణాటకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాక్షి: ఆదోని డివిజన్లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉంది? ముఖ్యంగా అమ్మాయిల్లో ఐరన్ లోపం తీవ్రంగా ఉందని తెలుస్తోంది? కలెక్టర్: పోషకాహార లోపాన్ని నివారించడంలో మనం ప్రథమస్థానంలో ఉన్నాం. ఆదోని డివిజన్ వెనుకబాటుకు గురైంది. పేదరికం కూడా ఉంది. దీంతో సరైన పోషకాహారం పిల్లలకు అందలేదు. అందుకే ప్రతీ స్కూలు, కాలేజీలో 10–19 ఏళ్ల బాలికల వివరాలు సేకరిస్తున్నాం. వారంలోపు వివరాలు వస్తాయి. రక్తపరీక్షలు చేసి వారికి ఐరన్ లోపం ఉంటే మందులు ఇస్తాం. హాస్టళ్లలో ఉంటే మెడిసిన్ అందిస్తాం. స్కూళ్లకు వచ్చేవారికి ఇంటికే పంపిస్తాం. ఇంటివద్దే ఉన్న పిల్లలకు ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా అందిస్తాం. హాస్టళ్లు, విద్యాసంస్థల్లో పోషకాహారం అందిస్తున్నాం. పరీక్షలు రాసి పిల్లలు ఇళ్లకు వెళ్లేలోపు ఏ ఒక్కరిలో ఐరన్ లోపం లేకుండా చూస్తాం. సాక్షి: పింఛన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది? వాస్తవం ఏంటి? కలెక్టర్: పింఛన్లు తీసేశారనే ప్రచారం సరికాదు. మొన్న ఒక గ్రామానికి వెళ్లాను. ఒక ఆవిడ వచ్చి పింఛన్ కావాలంది. అన్ని వివరాలు అడుగుతూ భూమి ఎంత ఉంది? అని ప్రశ్నిస్తే 17 ఎకరాలు అని చెప్పింది. ఇలాంటి వారికి పింఛన్లు ఎలా ఇస్తాం. పింఛన్ల పంపిణీ లక్ష్యం ఏంటి? అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తీయలేదు. కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు మరిన్ని ఇస్తున్నాం. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతోంది. సాక్షి: ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఉగాదికి పూర్తి చేసే అవకాశం ఉందా? కలెక్టర్: 16వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. 7వేలు పూర్తయ్యాయి. తక్కినవి పలు దశల్లో ఉన్నాయి. సొంత స్థలం ఉన్నా, గుడిసెలు, శిథిలావస్థలోని ఇళ్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవచ్చు. సాక్షి: సమస్యల పరిష్కారం కోసం స్పందనకు వస్తున్నారు? ఫలితం ఉందా? కలెక్టర్: కచ్చితంగా. కావాలంటే మీరు ప్రజలను విచారించవచ్చు. అభ్యంతరం లేదు. సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగే స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం సూచిస్తున్నాం. ఎక్కువగా భూసమస్యలు వస్తున్నాయి. గతేడాది 4,727 భూసమస్యలు వచ్చాయి. ఇందులో 70శాతం కుటుంబ తగాదాలే. ఇవేమీ చేయలేం. కోర్టు పరిధిలోని అంశాలు. మా పరిధిలోని సమస్యలు తప్పక పరిష్కరిస్తున్నాం. సాక్షి: మీ కుమారుడిని అంగన్వాడీలో చదివిస్తున్నారు? కారణమేంటి? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. చదువు పేరుతో రుద్ది, వాళ్లను ఉద్యోగంలో వేసి బందీలను చేయకూడదు. ఒకే జీవితం స్వేచ్ఛగా చదవాలి. సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అంగన్వాడీ నుంచి ఆక్స్ఫర్డ్ దాకా వెళ్లాలనేది నా కోరిక. ఫస్ట్ టీసీలో అంగన్వాడీ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటు సమాజాన్ని చదివించడం నేర్పాలి. అందుకే ఈ నిర్ణయం. సాక్షి: ఇలా పనులకు వెళ్లడంతో పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుంది కదా? ఈ కారణాలతోనే ఇది దేశంలో అక్షరాస్యతలో కూడా వెనుకబడి ఉందా? కలెక్టర్: పనుల కోసం వెళ్లేవారి పిల్లల కోసం సాధారణ హాస్టళ్లు కాకుండా 71 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. గతేడాది ‘పది’ ఫెయిల్ అయినవారు, పనులకు వెళ్లేవారి పిల్లలను గుర్తించాం. వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నాం. ఏ కారణంతో ఎవ్వరూ బడికి వెళ్లని పరిస్థితి రాకూడదు. ‘పది’ ఫెయిల్ అయిన వారు కూడా మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులై పై చదువులకు పంపే ఏర్పాటు తీసుకున్నాం. చదవులతోనే జీవితాలు బాగుపడతాయని మేమంతా నమ్ముతున్నాం. సాక్షి: సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పాలన సులభతరమైందా? ప్రజలకు సేవలు అందించడంలో సంతృప్తి ఉందా? కలెక్టర్: గతంలో సమస్యల కోసం మండల కేంద్రానికి వెళ్లేవారు. ప్రజలు వెళ్లినప్పుడు అధికారులు ఉండొచ్చు? క్యాంపులకు వెళ్లొచ్చు. దీంతో ఒకటికి రెండుసార్లు పనులు వదులుకుని, డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చేవారు. సచివాలయాలు వచ్చాక పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇతర సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. ఇవి ప్రజలకు సౌలభ్యంగా ఉన్నాయి. వీటి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నాం. సాక్షి: పదో తరగతి ఫలితాలు గతేడాది దారుణంగా వచ్చాయి? కారణమేంటి? ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నారా? కలెక్టర్: గతేడాది ఫలితాలపై నేను చాలా బాధపడ్డాను. పిల్లలు కష్టపడి పాసవ్వాలి. అప్పడే భవిష్యత్‌లో వారి ఆలోచన దృక్పథం బాగుంటుంది. దొడ్డిదారిలో పాస్ అయితే, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలా అలవాటు చేయొద్దని టీచర్లకు చెప్పా. గతేడాది 22వేల మంది ఫెయిల్ అయ్యారు. ఈ అనుభవంతో ఈ ఏడాది ప్రత్యేకంగా మెటీరియల్స్ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నాం. ప్రత్యేక అధికారులను నియమించాం. ఒక్కో టీచర్‌కు 5గురు పిల్లల బాధ్యతను అప్పగించాం. 45రోజులు ప్రత్యేకంగా తీసుకున్నాం. వందశాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. దగ్గరగా ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. -
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్‌గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా? అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్‌తో అతడు పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు. -
Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది
‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘ప్రవాహ్’లో పని చేస్తున్న భావి బరాద్ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది. కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక. ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్’గా ఫస్ట్ బ్యాచ్‌కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్ ఒకరు. ‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్. సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్. స్కూల్, కాలేజీలలో జెండర్ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్ కెరీర్‌కు సంబంధించి ప్యానల్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. ‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..) -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్‌మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్‌సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్‌కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్‌రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్‌రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్‌నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్‌ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
Sparsh Hospice: దేవతల్లాగే కనిపించారు.. వాళ్ల నవ్వు అద్భుతం!
బిడ్డను పొత్తిళ్లలో చూసుకున్నంతటి ప్రేమను కుటుంబం అంతా పంచుతుంది మహిళ. జీవితం చివరి దశలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రేమ కూడా అమ్మ సొంతమే అని హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ స్పష్టం చేస్తుంది. ఇంటి బాధ్యతల్లోనూ, చదువుల్లోనూ మునిగి ఉండే మహిళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవ సేవయే మాధవ సేవగా భావించడానికి కదులుతోంది. జీవితం నేర్పిన అనుభవాల పాఠాలను మూటగట్టుకొని సేద తీరుతున్న చివరి దశ ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పక వచ్చి చేరే దశను కుటుంబం అంతా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో అది ఆ కుటుంబానికి కష్టంగా మారచ్చు. వృద్ధాప్యంతోనూ, జబ్బుతోనూ ఉండే చివరి దశను గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకోసారి కుటుంబంలో ఇది అన్నివేళలా కుదరని పరిస్థితి ఉండచ్చు. అలాంటప్పుడు స్పర్శ్ లాంటి కేంద్రాల్లో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సమాజ బాధ్యతల్లో తామూ ‘సేవ’లో పాలుపంచుకోవచ్చు అనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంట్లో మరీ ముఖ్యంగా తమ ఇంటి పరిధులను దాటి సేవలో భాగం పంచుకుంటోంది మహిళ. ‘ఇదో అనిర్వచనీయమైన అనుభూతి. ప్రతిఫలం ఏమీ ఆశించని సేవ ఇంతకు మించి ఉండదు. మన అమ్మానాన్నలకు సేవ చేసుకున్నట్టే’ అంటున్నారు స్వచ్ఛంద సేవికలు. వాళ్ల నవ్వు అద్భుతం.. సైకాలజీ అండ్ ఫిలాసఫీ లో డిగ్రీ సెకండియర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ శోభ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు నేను స్పర్శ్ సెంటర్‌కి వెళ్లాను. తన ద్వారా ఇలాంటి ఒక సేవ ఉంటుందని తెలిసింది. అక్కడ అందరూ చాలా సహనంగా ఉండటం కనిపించింది. సేవ పొందుతున్న చివరిదశలో ఉన్నవారు దేవతల్లాగే కనిపించారు. భవిష్యత్తును చాలా పాజిటివ్‌గా చూస్తారు వాళ్లంతా. నాకు అది చాలా నచ్చింది. వారానికి ఒకసారి వెళ్లి అక్కడ వాళ్లతో మాట్లాడి వస్తుంటాను. వాళ్లే చాలా ధైర్యంగా ఉంటారు. నాకు భవిష్యత్తు గురించి మంచి విషయాలు చెబుతుంటారు. శారీరకంగా బెడ్ మీద నుంచి కూడా లేవడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వాళ్లలో ఒక మంచి నవ్వు ఉంటుంది. వారిలో ఆ నవ్వు చూడటానికి వెళుతుంటాను. – మహిక, స్టూడెంట్ ప్రతిఫలం ఆశించకూడదు.. మా నాన్నగారు క్యాన్సర్‌తో చనిపోవడంతో నా ఆలోచన సేవ వైపుగా మళ్లింది. క్యాన్సర్ పేషెంట్‌కు ఎలాంటి సేవ అందించాలనే విషయంలో చాలా తపన పడ్డాను. చివరి దశలో ఉన్న వాళ్లకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మా వారి ఫ్రెండ్ ద్వారా స్పర్శలో సేవ చేసే అవకాశం లభించింది. స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఆ అనుభూతిని స్వయంగా పొందాను. చివరి దశలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వాలి. వండాలి, తినిపించాలి. మందులు వేయాలి. మాట్లాడాలి. ప్రతిదీ వారికి దగ్గరగా ఉండాలి. అదంతా ఒక అసాధారణమైన అనుభూతి. డబ్బు ఒక్కటే కాదు మనసు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏమీ ఆశించని ప్రేమ ఇవ్వడం అనేది చాలా గొప్ప. పాతికేళ్లపాటు గృహిణిగా ఉన్న నేను, సేవ ద్వారా చాలా మందికి చేరువయ్యాను. బయటకు వచ్చి సమాజ బాధ్యతలో మరొక ప్రపంచాన్ని చూశాను. బాధలో ఉన్నవారికి ‘నేనున్నాను’ అని ధైర్యం ఇవ్వడమనేది చాలా ముఖ్యం. ఏమీ ఆశించకుండా చేసినప్పుడే మనం చేసిన సేవకు సార్థకత ఉంటుందని అభిప్రాయం. – పద్మారెడ్డి, బిజినెస్ ఉమన్ అవగాహనే ప్రధానం చివరిదశలో ఉన్నవారికి సేవ చేసుకునే భాగ్యం నాలుగేళ్లుగా నాకు లభించింది. చాలా మందికి ఈ చివరి దశలో ఉన్న సెంటర్ గురించి తెలియదు. చివరి దశలో ఉన్నవారిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. డాక్యుమెంటేషన్, సోషల్ మీడియా, డోనర్ రిపోర్ట్‌ను స్వచ్ఛందంగా చేస్తుంటాను. నాకు తెలిసిన వారందరికీ మానవ సేవలో ఉన్న గొప్పదనాన్ని గురించి చెబుతుంటాను. ఈ దశలో ఉన్నవారిని ఎలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలో తెలుస్తుంది. – నేహారాణి పటేల్, ఉద్యోగి సేవాగుణానికి నైపుణ్యం తోడు.. విద్యాసంబంధ సంస్థలతో కలిసి వర్క్ చేస్తుంటాను. ఒకరి ద్వారా తెలిసి స్పర్శ్ కేంద్రాన్ని విజిట్ చేశాను. ముఖ్యంగా సేవాగుణం ఉండటంతో పాటు నైపుణ్యం గల వాళ్లతో మాట్లాడి ఇలాంటి సేవ గురించి పరిచయం చేస్తాను. డాక్టర్ల దగ్గరకు చివరి దశలో ఉన్న పేషెంట్స్ వస్తుంటారు. అలాంటి వారికి సేవ అందించడానికి ఈ సెంటర్‌కి తీసుకువస్తుంటాను. అలాగే ఆన్లైన్ మ్యాగజైన్స్, డాక్యుమెంటరీ, వీడియో, సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం.. వంటివి చేస్తుంటాను. దీని ద్వారా మరికొందరికి ఈ సర్వీస్ అందేలా చూస్తాను. – అన్నపూర్ణ, సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనర్ చదవండి: Women's Day 2022: విజయవంతంగా 25 ఏళ్లు.. రూ. 20 సభ్యత్వంతో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో.. -
నయీ సోచ్
కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్. డ్రెస్‌లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్‌లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది. పంజాబ్‌కు చెందిన రీతూ సింగ్ ఎమ్బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్ బస్ ఎక్కించడానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది. ఏడాది పాటు ఫ్యాషన్ రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్‌లు, టైలర్ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్‌లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్‌లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్‌ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్ పీసెస్‌తో కుట్టిన డ్రెస్‌లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్‌లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది. నయీ సోచ్‌తో అవగాహన మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్‌లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్ డ్రెస్‌లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్ మీడియాలో ‘నయీ సోచ్’ పేరిట పేజ్ క్రియేట్ చేసి అవగాహన కల్పిస్తోంది. ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది. సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్‌లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు. రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే నయీ సోచ్.